Begin typing your search above and press return to search.

కేసీఆర్ పంతమా.. ఆర్టీసీ కార్మికుల పట్టుదలా?

By:  Tupaki Desk   |   5 Nov 2019 9:36 AM GMT
కేసీఆర్ పంతమా.. ఆర్టీసీ కార్మికుల పట్టుదలా?
X
తెలంగాణలో అత్యంత బలవంతుడైన కేసీఆర్ అల్లిమేటం జారీ చేశాడు. క్లియర్ కట్ గా కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు కార్మికులే తేల్చుకోవాలి.. రాజావారు వెనక్కి తగ్గే ఉద్దేశం లేదు. ఆర్టీసీని కాపాడుతారా ముంచేస్తారా అన్నది కార్మికుల నిర్ణయంపై ఆధారపడి ఉంది.

ఇంకా కొన్ని గంటలే మాత్రమే మిగిలింది.. కేసీఆర్ పెట్టిన డెడ్ లైన్ ఈ రాత్రితో ముగిసిపోతోంది. కేసీఆర్ పంతం నెగ్గుతుందా? ఆర్టీసీ కార్మికుల పట్టుదల నిలుస్తుందా అన్నది ఉత్కంఠగా మారింది. తెలంగాణలో నెలరోజులుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మె ఈరోజు అర్థరాత్రి కీలక మలుపు తీసుకోబోతోంది. కార్మికులు సమ్మెపై వెనక్కి తగ్గితే ఆర్టీసీ నిలబడుతుంది.? తగ్గకపోతే ఆర్టీసీ మొత్తం కనుమరుగై ప్రైవేటు పరం అవుతుంది.. కేసీఆర్ విసిరిన ఈ బాల్ ఇప్పుడు కార్మికుల కోర్టులో ఉంది. ఆర్టీసీని ముంచుతారా తేలుస్తారా అన్నది వారి చేతిలో ఉంది..

తెలంగాణలో ఇప్పుడు ఏ నిర్ణయానికి అయినా కర్త, కర్మ క్రియ కేసీఆరే.. హుజూర్ నగర్ లో ప్రజల తీర్పు వరకు సైలెంట్ గా ఉన్న కేసీఆర్ ఆ తర్వాత జూలు విదిల్చారు. ప్రతిపక్షాలన్నీ గట్టిగా పోరాడి.. ఆర్టీసీ సమ్మె ఉధృతంగా సాగి.. కేసీఆర్, కేటీఆర్ సైతం ప్రచారానికి వెళ్లలేని క్లిష్ట పరిస్థితుల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ విజయం కేసీఆర్ కు అంతులేని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. అందుకే ఇప్పుడు ప్రజల నమ్మకంతో కేసీఆర్ మరింత కఠినంగా వ్యవహరించడానికి రెడీ అయ్యారు. ఆర్టీసీపై ఉక్కుపాదం మోపారు. కార్మికులు విధుల్లో చేరడానికి నవంబర్ 5 డెడ్ లైన్ పెట్టారు.

మొన్నటి వరకు తొడకొట్టిన ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికులు కేసీఆర్ చేసిన అల్టీమేటంతో కాస్త తగ్గారు. చర్చలు పిలవాలని కోరుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలని కోరడం లేదు. కానీ కేసీఆర్ మాత్రం చర్చలు పిలిచే ప్రసక్తే లేదని.. 5లోపు చేరిన వారే ఆర్టీసీ ఉద్యోగులు అని స్పష్టం చేశారు. దీంతో ఇన్నాళ్లు ఘీంకరించిన ఆర్టీసీ జేఏసీ, కార్మికులు అంతా ఇప్పుడు ఆలోచనలో పడిపోయారు.

ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పదుల సంఖ్యలో కార్మికులు, ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యోగాల్లో చేరిపోయారు. దాదాపు 49వేల మందికి పైగా ఉన్న ఉద్యోగులతో పోల్చితే ఈ సంఖ్య చాలా తక్కువ. మరి ఈ అర్ధరాత్రి డెడ్ లైన్ తర్వాత ఎంత మంది చేరుతారు? సమ్మె నీరుగారిపోతుందా? కేసీఆర్ డెడ్ లైన్ పనిచేస్తుందా? లేక ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ డెడ్ లైన్ పక్కనపెట్టి ఉద్యమాన్ని కొనసాగిస్తారా? అసలు ఆర్టీసీ భవిష్యత్ ఏమి అయిపోతుందనేది ఈ అర్ధరాత్రి తర్వాత తేలుతుంది. సో తెలంగాణలో ఇప్పుడు ఈ రాత్రికి ఏం జరుగుతుందనేది ఉత్కంఠ రాజేస్తోంది.