Begin typing your search above and press return to search.

కేసీఆర్ టార్గెట్ ఇప్పుడు బీసీల‌పై ప‌డింది

By:  Tupaki Desk   |   7 May 2017 5:19 AM GMT
కేసీఆర్ టార్గెట్ ఇప్పుడు బీసీల‌పై ప‌డింది
X
తెలంగాణ సీఎం కేసీఆర్ రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో మ‌రో ముందడుగు వేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియకు ప్రభుత్వం త‌ర‌ఫున శ్రీకారం చుట్టించారు. ముస్లింలకు బీసీ కోటాకింద 12శాతం రిజర్వేషన్లు కల్పించాలని శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన ప్రభుత్వం - ఆ సందర్భంలో ఇచ్చిన హామీమేరకు బీసీల రిజర్వేషన్ల శాతాన్ని సైతం పెంచేందుకు సమగ్ర అధ్యయనం చేయాలని బీసీ కమిషన్‌ ను ఆదేశించింది. ఈమేరకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. బీసీల ఆర్థిక - సామాజిక స్థితిగతులపై అధ్యయనం చేసి ఆరునెలల్లో నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్‌ ను ప్రభుత్వం కోరింది.

బాగా వెనకబడిన వర్గాల్లో సంచార జాతి కులాల ఆర్థిక - సామాజిక స్థితిగతులపై అధ్యయనం చేయాలని ప్రత్యేకంగా పేర్కొంది. అధ్యయనం చేయాల్సిన అంశాలపై మార్గదర్శకాలతో జీవో విడుదలైంది. ప్రస్తుతం బీసీలకు 25 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. బీసీ ‘ఎ’ గ్రూపులోని కులాలకు 7 శాతం - బిసి ‘బి’కి పది శాతం - బిసి ‘సి’కి ఒక శాతం - బిసి ‘డి’కి ఏడు శాతం చొప్పున మొత్తం 25 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ముస్లింలను బీసీ ‘ఈ’ గ్రూపుగా పరిగణిస్తూ వారికి 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది.రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో బీసీల సంఖ్య ఎక్కువగా ఉందని, దీని ప్రకారం బీసీల రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్ ప్రభుత్వం ముందకు రావడంవల్ల సమగ్ర అధ్యయనం కోసం మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్టు జీవోలో పేర్కొంది. బీసీల్లో సామాజిక - ఆర్థిక స్థితిగతులు - చదువువంటి అంశాలపై శాస్ర్తియంగా అధ్యయనం చేయాలని సూచించారు. బీసీల స్థితిగతులను మెరుగుపర్చటంతోపాటు వారి రిజర్వేషన్ల శాతాన్ని పెంచడానికి ఈ అధ్యయం అవసరమని పేర్కొన్నారు. విద్యాసంస్థలు - ప్రభుత్వోద్యోగాల్లో ఈ రిజర్వేషన్లు అమలవుతాయి.

గతనెల 12న జరిగిన మంత్రివర్గ సమావేశంలో బీసీల స్థితిగతులు - రిజర్వేషన్లపై చర్చించినట్టు జీవోలో పేర్కొన్నారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు అధ్యయం చేయాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం పేర్కొంది. బీసీల స్థితిగతులు - వారి జీవన ప్రమాణాలపై అధ్యయనం చేసి ఆరు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వారి వెనకబాటుతనం ఎలా ఉందనే దానిపై ప్రశ్నావళి రూపొందించారు. సంచార జాతుల ఆర్థిక స్థితిగతులపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. వారి వృత్తి - ఆదాయం - చదువు - కూలీ పనులు చేస్తున్నారా?వంటి వివరాలు సేకరిస్తారు. వారి కుల వృత్తి ద్వారా జీవనోపాధి ఏవిధంగా ఉందో అధ్యయనం చేస్తారు. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల నుంచి వివరాలు సేకరిస్తారు. శాస్ర్తియంగా వివరాలు సేకరించి స్థితిగతులపై నివేదిక ఇస్తారు. బీసీల్లో ఆక్షరాస్యతా శాతం, డ్రాపౌట్ల శాతం వివరాలు సేకరిస్తారు. బీసీ వర్గాలకు చెందినవారు ఇతర సమాచారం కూడా కమిషన్‌ కు అందించవచ్చు. ఆయా వర్గాలనుంచి సమాచారం సేకరించడంతోపాటు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలను కలుస్తారు. ఆరునెలల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని జీవోలో పేర్కొన్నారు.

ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును శాసన సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడిన సిఎం కెసిఆర్ - బీసీల రిజర్వేషన్లు కూడా పెంచనున్నట్టు ప్రకటించారు. శాస్ర్తియంగా అధ్యయనం చేసిన తరువాత రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. బీసీల జనాభా తెలంగాణలో 52శాతం వరకూ ఉందని, 52 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. శాసన సభలో వివిధపక్షాల నాయకులు సైతం 52శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం బీసీలు - ఎస్సీ - ఎస్టీ - మైనారిటీలకు కలిపి 50 శాతం వరకూ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదనే సుప్రీంకోర్టు తీర్పువల్ల రిజర్వేషన్ల పెంపు సాధ్యమా? అనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే సిఎం మాత్రం రాష్ట్రంలో పరిస్థితి వేరుగాఉందని, 90 శాతానికి పైగా బీసీ - ఎస్సీ - మైనారిటీ - ఎస్టీలు ఉన్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్ల అంశాన్ని రాష్ట్రానికే వదిలేయాలని అభిప్రాయపడుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/