Begin typing your search above and press return to search.

బీజేపీపై కేసీఆర్ యుద్ధం.. అనూహ్య స్పంద‌న.. ఏం జ‌రుగుతుంది?

By:  Tupaki Desk   |   16 Feb 2022 3:30 PM GMT
బీజేపీపై కేసీఆర్ యుద్ధం.. అనూహ్య స్పంద‌న.. ఏం జ‌రుగుతుంది?
X
తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంపై కాలుదువ్వారు. బీజేపీపై క‌త్తి ప‌ట్టారు. ప్ర‌ధాని మోడీపై విమ‌ర్శ‌ల బాణాలు ఎక్కుపెట్టారు. వెర‌సి.. ఆయ‌న రాజ‌కీయ వ్యూహం పూర్తిగా మార్చుకున్నారు. మ‌రి ఇప్పుడు ఏం జ‌రుగుతుంది? జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్పాల‌ని.. ఒక వెలుగు వెలగాల‌ని భావిస్తున్న కేసీఆర్ అడుగులు స‌క్సెస్ అవుతాయా? ఆయ‌న అడుగుల‌కు క‌లిసి వ‌చ్చేదెవ‌రు? ఇవీ.. ఇప్పుడు రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారితీస్తున్న అంశాలు. కేసీఆర్ పొలిటిక‌ల్ లైఫ్‌ను తీసుకుంటే.. ఆయ‌న ప‌ట్టుబ‌డితే.. సాధించ‌డమే త‌ప్ప‌.. వెన్ను చూపింది క‌నిపించ‌దు. గ‌తంలో ప్ర‌త్యేక రాష్ట్రం కోసం.. ఏళ్ల త‌ర‌బ‌డి కొట్లాడి సాధించారు. గ‌ల్లీ నుంచి ఢిల్లీ ని క‌దిలించారు. రాష్ట్రాన్ని సాధించారు.

ఇక‌, ఇప్పుడు వ‌రుస‌గా తెలంగాణ ముఖ్య‌మంత్రిగా ఆయ‌న రెండు సార్లు పీఠం ఎక్కారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎదుర‌వుతున్న అనేక స‌మ‌స్య‌ల‌కు కేంద్రం ప‌రిష్కారం చూపించ‌క‌పోవ‌డంతో ఆయ‌న దృష్టి ఏకంగా కేంద్రంపైనే ప‌డింది. నిజానికి రెండో సారి ముఖ్య‌మంత్రిగా ఆయ‌న బాధ్య‌త‌లు తీసుకున్న తొలినాళ్ల‌లోనే.. కేంద్రంపై దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప‌లు ప్రాంతీయ పార్టీల‌ను ఏకం చేసే ప‌ని పెట్టుకున్నారు. అప్ప‌ట్లోనే ప‌లు రాష్ట్రాల్లో ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో ప‌ర్య‌టించి నేత‌ల‌ను క‌లిసారు. కానీ. ఇంత‌లోనే ఆయ‌న విర‌మించుకున్నారు. ఇక‌, ఇప్పుడు మాత్రం రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. దీనికి ప‌లు కార‌ణాలు కూడా క‌నిపిస్తున్నాయి.

ఇంటా బ‌య‌టా కూడా.. బీజేపీ నుంచి ఎదుర‌వుతున్న ప‌రిస్థితులు.. కేసీఆర్‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ తీసుకుంటున్న నిర్ణ‌యాలు.. రాష్ట్రంలో త‌న పాల‌న‌పై ప్ర‌భావం చూపుతు న్నాయి. ముఖ్యంగా రైతుల‌కు ద‌న్నుగా నిల‌వాలంటే.. ఖ‌చ్చితంగా వారికి ఉప‌యోగ‌క‌ర‌మైన అనేక అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి. కానీ, కేంద్రం ధాన్యం నుంచి మొద‌లు పెట్టి విద్యుత్ వ‌ర‌కు కూడా అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చింది. దీంతో రాష్ట్రంలో రైతుల‌కు స‌ర్దిచెప్పుకోలేని ప‌రిస్థితిఏర్ప‌డింది. ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో యుద్ధం చేసే ప‌రిస్థితి వ‌చ్చింది. దీంతో వెర‌వకుండా త‌నే రంగంలోకి దిగి.. దీక్ష‌లు కూడా చేశారు.

ఇక‌, ఇంత‌లోనే విద్యుత్ విష‌యం కల‌వ‌ర‌పెడుతోంది. రైతులు వినియోగించే విద్యుత్‌కు మీట‌ర్లు పెట్టాల‌ని.. కేంద్రం నుంచి సంకేతాలు అంద‌డంతో కేసీఆర్ ఆగ్ర‌హోద‌గ్రుల‌య్యారు. ఇక‌, ఐఏఎస్‌, ఐపీఎస్‌ల విష‌యంలోనూ స‌వ‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చేందుకు కేంద్రం ప్ర‌తిపాదించింది.

ఇలా.. ఇవ‌న్నీ కూడా రాష్ట్రాల హ‌క్కుల‌ను కేంద్రం లాక్కుంటోంద‌నే భావ‌న రాష్ట్రాల‌కు ఉంది. అయితే.. కొంద‌రు బ‌య‌ట‌ప‌డుతుంటే.. మ‌రికొంద‌రు మాత్రంమౌనంగా ఉంటున్నారు. ఇలాంటి స‌మ‌యంలోనే రాష్ట్రంలో బీజేపీ మ‌రింత రెచ్చిపోయింది. రాష్ట్రంలో బీజేపీకి ముకుతాడు వేయ‌క‌పోతే.. మొత్తానికే మోసం వ‌స్తుంద‌ని భావించిన కేసీఆర్ ఇటు, రాష్ట్రం, అటు కేంద్రంలోని బీజేపీల‌ను ఒకే సారి టార్గెట్ చేశారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌త్యేక కూట‌మికి పావులు క‌దుపుతున్న బెంగాల్ సీఎం మ‌మ‌తా బెనర్జీతో జ‌ట్టుకు రెడీ అయ్యారు. తాను ఇప్ప‌టికే చేసిన ప్ర‌య‌త్నాల‌ను కూడా ఆయ‌న మ‌రోసారి తెర‌మీదికి తెచ్చారు. బిహార్ ప్ర‌తిప‌క్షం ఆర్జేడీని, ఒడిసా,త‌మిళ‌నాడు, జార్ఖండ్ ఇలా.. క‌లిసి వ‌చ్చే బీజేపీయేత‌ర ప్రాంతీయ పాల‌కుల‌ను క‌లుపుకొని ముందుకు సాగి.. కేంద్రంలోని మోడీకి దిమ్మ‌తిరిగే షాక్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

అంతేకాదు.. అవ‌స‌ర‌మైతే.. నేను కొత్త‌పార్టీ కూడా పెడ‌తాన‌ని ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. ఇక‌, మోడీ ప్ర‌క‌ట‌న‌కు స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం కావ‌డంతోపాటు.. అంద‌రూ క‌లిసి వ‌చ్చే అవ‌కాశం కూడా క‌నిపిస్తుండ‌డాన్ని బ‌ట్టి.. కేసీఆర్ వ్యూహం స‌క్సెస్ అవుతుంద‌నే అంటున్నారుప‌రిశీల‌కులు.