Begin typing your search above and press return to search.

పరేడ్ గ్రౌండ్స్ లో బాబును బాదేశాడు

By:  Tupaki Desk   |   31 Jan 2016 11:30 AM GMT
పరేడ్ గ్రౌండ్స్ లో బాబును బాదేశాడు
X
గ్రేటర్ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకున్న వేళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ పెట్టారు. శనివారం రాత్రి నిర్వహించిన సభకు రెండు రోజుల ముందు మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై గురి పెట్టిన ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఓ మోస్తరు వ్యాఖ్యలు మాత్రమే చేశారు. మొత్తంగా మీడియా సమావేశాన్ని తన స్టైల్ కు భిన్నంగా ముగించారనే చెప్పాలి.

ఎన్నికల వేళ.. కేసీఆర్ లాంటి నేత నోరు విప్పితే పంచ్ ల మీద పంచ్ లు పడాలి. చరిత్ర చెప్పాలి. జరిగిన నష్టాన్ని వెల్లడించాలి. తెలంగాణ సమాజానికి జరిగిన ద్రోహాన్ని చెప్పుకోవాలి. దాన్ని చెక్ చెప్పేందుకు తాను ఎంతగా కష్టపడింది వివరించాలి. వీటన్నింటితో పాటు.. పలువురు నేతల్ని వ్యక్తిగతంగా ప్రస్తావిస్తూ నిప్పులు చెరగాలి. కానీ.. ఇలాంటివేమీ మొన్న నిర్వహించిన మీడియా సమావేశంలో కనిపించవు.

ఆ లోటును తీర్చినట్లుగా తాజా పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభ కనిపిస్తుంది. బండకేసి బాదినట్లుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విభజన సమయంలో తెలంగాణకు చేటు చేసేలా చంద్రబాబు మోసం చేసే ప్రయత్నం చేశారని.. తాను అడ్డుకున్నానని చెప్పిన ఆయన.. బాబు పాలనలో హైదరాబాద్ లో ఎలాంటి వృద్ధి జరగలేదన్న విషయాన్ని తేల్చేయటమే కాదు.. బాబు పాలన అనగానే బషీర్ బాగ్ కాల్పుల ఘటన.. అంగన్ వాడీల్ని గుర్రాలతో తొక్కించటం మాత్రమేనన్నట్లుగా విరుచుకుపడ్డారు.

ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు సతీమణిని సైతం తన ప్రసంగంలోకి తీసుకొచ్చి.. ఆమె ఓటు తమకే వేస్తుందని తమ కార్యకర్తకు చెప్పినట్లుగా లక్షలాది ప్రజల సమక్షంలో చెప్పుకోవటం గమనార్హం. ఇలా చంద్రబాబు పాలనే కాదు.. వ్యక్తిగతంగా ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉన్నట్లుండి బాబు మీద కేసీఆర్ అంత గుస్సా ఎందుకు ప్రదర్శించారన్న ప్రశ్న వేసుకుంటే ఆసక్తికర సమాధానం లభిస్తుంది.

మీడియాతో కేసీఆర్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సమయంలోనే ఏపీ ముఖ్యమంత్రి గ్రేటర్ ప్రచారాన్ని షురూ చేశారు. రెండు రోజుల పాటు హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్ని కవర్ చేసిన బాబు.. తన ప్రసంగంలో టీఆర్ఎస్ సర్కారు మీద విమర్శలు చేశారు. అప్పుడెప్పుడో తాను చేసిన అభివృద్ధిని ప్రస్తావించిన చంద్రబాబు.. అప్పటి నుంచి ఇప్పటివరకూ అభివృద్ధి అన్నదేమీ జరగలేదని తేల్చేశారు. ఇప్పటికి తాను చేసిన అభివృద్ధి తప్పించి హైదరాబాద్ నగరానికి మరింకేమీ జరగలేదని పదే పదే చెప్పే ప్రయత్నం చేశారు.

బాబు మాటలు.. ఆ సందర్భంగా వచ్చిన స్పందనతో పాటు.. బాబు మీటింగులకు వచ్చిన జన సందోహమే.. కేసీఆర్ తాజా గుస్సాకు కారణంగా చెప్పొచ్చు. తాను ఊహించిన దాని కంటే బాబు సభలకు ఆదరణ రావటంతో కేసీఆర్ తన స్వరాన్ని పెంచినట్లుగా చెబుతున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో సునాయస విజయాన్ని అంచనా వేసిన తెలంగాణ అధికారపక్షం.. అందుకు భిన్నమైన పరిస్థితులు ఎదురుకావటంతో కేసీఆర్ ఎదురుదాడి మొదలెట్టారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసీఆర్ తాజాగా చేసిన విమర్శల తీరు చూస్తే.. గ్రేటర్ లో ఆయనకు వైరిపక్షం ఎవరన్నది ఇట్టే అర్థమైపోతుంది.