Begin typing your search above and press return to search.

విప‌క్షం లేని తెలంగాణే కేసీఆర్ ధ్యేయం!

By:  Tupaki Desk   |   24 Dec 2018 11:00 AM GMT
విప‌క్షం లేని తెలంగాణే కేసీఆర్ ధ్యేయం!
X
తెలంగాణలో అధికార టీఆర్ ఎస్ పార్టీ ఫుల్ స్వింగులో ఉంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బంప‌ర్ విజ‌యంతో వ‌చ్చిన ఉత్సాహం ఇంకా పార్టీ నేత‌లు - శ్రేణుల్లో తొణికిస‌లాడుతోంది. శాస‌న‌మండ‌లిలో ప్ర‌త్య‌ర్థి పార్టీల ఎమ్మెల్సీల‌ను త‌మ గూటికి ర‌ప్పించుకొని విప‌క్షాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయ‌డం టీఆర్ ఎస్ జోష్ ను రెట్టింపు చేస్తోంది.

అదే బాట‌లో లెజిస్లేటివ్ అసెంబ్లీలోనూ ప్ర‌తిప‌క్ష ర‌హితంగా చేయాల‌ని గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ముక్త్ భార‌త్ ను సాకారం చేసేందుకు కేంద్రంలో బీజేపీ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లే ప్ర‌తిప‌క్ష ర‌హిత తెలంగాణ సాకారం దిశ‌గా కేసీఆర్ వ్యూహ ర‌చ‌న చేస్తున్న‌ట్లు స‌మాచారం. శాస‌న‌మండ‌లిలో రెండు రోజుల క్రితం టీఆర్ ఎస్ లో కాంగ్రెస్ విలీన ప్ర‌క్రియ విజ‌య‌వంతంగా పూర్త‌యిన సంగ‌తి తెలిసిందే.

అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. కొత్త అసెంబ్లీ తొలి స‌మావేశాలు ఏ చిన్న ఆటంకం లేకుండా - వాయిదా ప‌ర్వాలు లేకుండా స‌జావుగా సాగాల‌ని కేసీఆర్ భావిస్తున్నారు. అలా జ‌ర‌గాలంటే స‌భ‌లో ప్ర‌తిప‌క్షం ఉండ‌కూడ‌దు. అందుకే ప్ర‌తిప‌క్ష ర‌హితంగా స‌భ మారిన‌ప్పుడే స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని ముఖ్య‌మంత్రి అనుకుంటున్నార‌ట‌. స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌లో జాప్యానికి అదే కార‌ణ‌మ‌ట‌.

అసెంబ్లీలో కాంగ్రెస్ - టీడీపీల‌ను త‌మ పార్టీలో విలీనం చేసే దిశ‌గా కేసీఆర్ ఇప్ప‌టికే ప‌థ‌క ర‌చ‌న చేశార‌ట‌. శాస‌న మండ‌లిలో అనుస‌రించిన వ్యూహాన్నే ఇక్క‌డ కూడా అనుస‌రించ‌నున్నార‌ట‌. అందులో భాగంగా ముందుగా టీడీపీ నుంచి ఎన్నికైన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు స్పీక‌ర్ ను క‌లుస్తార‌ట‌. గులాబీ పార్టీలో త‌మ ప‌క్షాన్ని క‌లిపెయ్యాల‌ని కోరుతార‌ట‌. అనంత‌రం కాంగ్రెస్ త‌ర‌ఫున ఉన్న మొత్తం 19 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది కూడా ఇదే త‌ర‌హాలో త‌మ ప‌క్షాన్ని టీఆర్ ఎస్ లో విలీనం చేయాలంటూ స్పీక‌ర్ కు విన‌తి ప‌త్రం అంద‌జేస్తార‌ట‌. ఆపై విలీన ప్ర‌క్రియ లాంఛ‌న‌ప్రాయ‌మేన‌ట‌. అదే జ‌రిగితే అసెంబ్లీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదాను కాంగ్రెస్ కోల్పోతుంది. టీడీపీ త‌ర‌ఫున ప్రాతినిధ్య‌మే ఉండ‌దు.

కేసీఆర్ వ్యూహం కార్య‌రూపం దాల్చితే ఆయ‌న ఓ అద్భుత రికార్డు సృష్టించిన‌ట్ల‌వుతుంది. ప్ర‌తిప‌క్ష ర‌హిత తెలంగాణ‌ను సాధించి.. మండ‌లి, అసెంబ్లీల‌ను ఏక‌ఛ‌త్రాధిప‌త్యంగా న‌డిపిన ఘ‌న‌త‌ను ఆయ‌న ద‌క్కించుకుంటారు. ప్ర‌జాస్వామ్య భార‌తంలో ఆయ‌న రికార్డును చెరిపేయ‌డం భ‌విష్య‌త్తు త‌రాల‌కు ఏమాత్రం సుల‌భం కాబోదు! మ‌రి కేసీఆర్ అనుకున్న‌ది సాధిస్తారా? విప‌క్ష ర‌హిత తెలంగాణ‌ను సాకారం చేస్తారా? అనే విష‌యాలు తెలియాలంటే మ‌రికొన్ని రోజులు వేచి చూడాల్సిందే!