Begin typing your search above and press return to search.

కేసీఆర్ వ్యూహం మామూలుగా లేదు

By:  Tupaki Desk   |   25 Dec 2015 10:05 AM GMT
కేసీఆర్ వ్యూహం మామూలుగా లేదు
X
వ‌రుస విజ‌యాలు, ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ జోరుతో ఉన్న‌ప్ప‌టికీ టీఆర్ ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాజ‌కీయంగా అడుగులు వేస్తున్నారా? ఆచితూచి త‌న పావులు క‌దుపుతున్నారా? అన్నీ ఒకేసారి ముందు వేసుకొని ఆగ‌మాగం అయ్యే బ‌దులుగా ఒక్కొక్క‌టిగా విడ‌దీసుకొని టార్గెట్ సాధించాల‌నుకుంటున్నారా? వ‌రుస విజ‌యాల‌తో టార్గెట్ సాధించాల‌ని చూస్తున్నారా? అంటే గులాబీ శ్రేణుల నుంచి అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.

వరంగల్ జిల్లాలో వరుస విజయాలతో టీఆర్‌ ఎస్‌ పార్టీ మాంచి ఊపు మీదుంది. వ‌రంగ‌ల్ పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లో రికార్డు స్థాయి మెజార్టీతో కారు దుమ్మురేపే విజ‌యం సాధించింది. అనంత‌రం జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో త‌మ అభ్య‌ర్థిని ఏక‌గ్రీవంగా ఎన్నుకొని ఓరుగ‌ల్లుపై గులాబీ జెండా ఎగ‌రేసింది. అయితే త్వ‌ర‌లో జ‌ర‌గాల్సి ఉన్న గ్రేటర్‌ వరంగల్ ఎన్నికలపై పార్టీ వెన‌క‌డుగు వేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి. కానీ టీఆర్ ఎస్ వ‌ర్గాలు మాత్రం ఇది సీఎం కేసీఆర్ వ్యూహ‌మ‌ని విశ్లేషిస్తున్నాయి.

ఇప్పటి నుంచే దృష్టి సారిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతోపాటు, గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తున్నారు.

వాస్తవానికి జీహెచ్ఎంసీ ఎన్నికలతోపాటు, గ్రేటర్ వరంగల్ ఎన్నికలూ ఒకేసారి నిర్వహించాలని ఎన్నికల సంఘం యోచిస్తోంది. అయితే.. దీనివల్ల రెండు ప్రాంతాల్లోనూ దృష్టిసారించడం కష్టమవుతుందని టీఆర్ ఎస్ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. అందువల్లే.. మేడారం జాతరను సాకుగా చూపుతూ.. గ్రేటర్ వరంగల్ ఎన్నికలను ఏప్రిల్ వరకు వాయిదా వేయించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. వాయిదా వ‌ల్ల జీహెచ్ ఎంసీ ఎన్నికలు ముగియడంతో వరంగల్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించవచ్చని గులాబీ దళం యోచిస్తున్నట్టు సమాచారం.

పనిలోపనిగా.. ఈ సమయంలో వలసలను ప్రోత్సహించడం ద్వారా బలం మరింతగా పెంచుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. మొత్తంగా ఉప ఎన్నికలో దుమ్మురేపే ఫ‌లితంతోపాటు, ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకున్న టీఆర్ ఎస్.. గ్రేటర్ వరంగల్ పై గురిపెట్టింది. మరి, గులాబీ దళం హ్యాట్రికి టార్గెట్ ఫ‌లిస్తుందో లేదో చూడాలి మ‌రి.