Begin typing your search above and press return to search.

కూటమిని దెబ్బకొట్టేందుకు కేసీఆర్ పెద్ద స్కెచ్!!

By:  Tupaki Desk   |   11 Oct 2018 6:21 AM GMT
కూటమిని దెబ్బకొట్టేందుకు కేసీఆర్ పెద్ద స్కెచ్!!
X
తెలంగాణాలో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. మరలా అధికారంలోకి రావాలని టీఆర్ ఎస్ ఎత్తులు వేస్తుంటే.. ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా పావులు కదుపుతోంది మహా కూటమి. వీరిద్దరి మధ్యలో తాను ఒక ప్రాంతానికే పరిమితం కాదంటూ అవకాశం ఉన్న అన్ని నియోజకవర్గాలు మావే అంటూ రంగంలోకి దిగబోతోందట ఎంఐఎం. ముస్లిం ఓటర్ల ప్రాబల్యం ఉన్న అన్ని చోట్ల పోటీ చేస్తానని అని అభ్యర్థులను రెడీ చేస్తున్నారు మజ్లిస్ పార్టీ నేతలు.

మొదటి నుంచి ఎంఐఎం - టీఆర్ ఎస్ ఒక అవగాహనతోనే ఉన్నాయంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కేసీఆర్ కూడా మజ్లిస్ పోటీచేసే సీట్లలో ఇంకా అభ్యర్థులనే ప్రకటించలేదు. కానీ, ఎన్నికల్లో మాత్రం పొత్తు పెట్టుకోకుండా ఎవరికీ వారు పోటీ చేస్తున్నారు. మజ్లిస్ కు పాతబస్తీలో మంచి పట్టుంది. ఇక్కడ నుంచే అభ్యర్థులు పోటీలో ఉండటానికి ఇష్టపడతారు. మిగతా ప్రాంతాల్లో పోటీ చేసినా - ప్రయెజనం ఉండవచ్చు. లేకపోనూవచ్చు. కానీ, ఓటు చీల్చడానికి మాత్రం పనికివస్తుందనడంలో సందేహం లేదు.

సాంప్రదాయ ఓటుతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటును పోగొట్టుకోకుండా అధికారం చేజిక్కించుకోవాలని ఉద్దేశంతో కాంగ్రెస్ - టీడీపీ - సీపీఐ - టీజేఎస్ కూటమిగా ఏర్పడ్డాయి. ఎంఐఎం-టీఆర్ ఎస్ కూడా తెరవెనుక ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లుంది. కూటమి కూడగట్టుకోవాలనుకుంటున్న ఓటును తన ఖాతాలో వేసుకుంటానని ఎంఐఎం స్కెచ్ గీస్తోందట.. ఓల్డ్ సిటీలోని 7 నియోజకవర్గాలతో పాటు మరో 20 స్థానాల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతుంది.

పాతబస్తీతో పాటు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ముస్లిం ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ రెండో స్థానంలో నిలిచింది ఎంఐఎం. ఇక్కడ ఈ సారి ఎన్నికల్లో గెలుపును పొందాలని ఉవ్విళ్లూరుతుందట మజ్లిస్. అలాగే, కరీంనగర్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - మహబూబ్ నగర్ - హైదరాబాద్ మీద ప్రధాన దృష్టి పెట్టారట మజ్లిస్ నేతలు.

మజ్లిస్ పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. కాంగ్రెస్ కు ఉన్న సంప్రదాయక ఓటర్లలో ముస్లింలు కూడా ఒకరు. అదే ఎంఐఎం కూడా పోటీ చేస్తే ఆ ఓట్లన్నీ తమకు పడతాయని భావిస్తున్నారు. దీనివల్ల కాంగ్రెస్ ను దెబ్బతీయడమే అంతర్గత వ్యూహంలా కనబడుతోంది. మరోవైపు బీజేపీ పోటీ చేసిన నియోజకవర్గాల్లో కొన్ని సంప్రదాయ ఓట్లు చీలిపోతాయి. దీనివల్ల ఓట్లు చాలా వరకు కాంగ్రెస్ కు పడనీయకుండా చేయడమే టీఆర్ ఎస్ ఎత్తుగడలా కనిపిస్తుంది. ఇలా కాంగ్రెస్ మహాకూటమిని దెబ్బతీయడానికి ఎంఐఎంతో కేసీఆర్ ఓ అవగాహనకు వచ్చినట్టు వార్తలొస్తున్నాయి. మరీ ఇది ఎంతవరకు పని చేస్తుందోనని వేచి చూడాల్సిందే.