Begin typing your search above and press return to search.

అదేంది కేసీఆర్ మీలాంటి మేధావి ఇలా మాట్లాడితే ఎలా?

By:  Tupaki Desk   |   8 April 2019 6:31 AM GMT
అదేంది కేసీఆర్ మీలాంటి మేధావి ఇలా మాట్లాడితే ఎలా?
X
దేశంలో మరే రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని సాహసం తెలంగాణ సీఎం కేసీఆర్ చేయటం తెలిసిందే. అదేంటండి.. సాహసం ఏం చేశారో చెప్పకుండా.. ఏదో చేసినట్లు చెబుతారా? అక్కడికే వస్తున్నాం. తెలంగాణ సీఎం కేసీఆర్ చేయని సాహసం ఏముంది చెప్పండి. పెద్దనోట్ల రద్దు లాంటి సంచలన నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీని పొగడాలో? వద్దో? అర్థం కాక సొంత పార్టీ నేతలు సైతం కిందామీదా పడుతున్న వేళ.. అందుకు భిన్నంగా కేసీఆర్ మాత్రం ఆయన ధైర్యాన్ని నోరార పొగిడేసి.. కీర్తించారు కూడా.

అక్కడితో ఆగితే ఆయన కేసీఆర్ ఎందుకు అవుతారు? అందుకే.. ప్రత్యేకంగా ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ తీసుకొని మరీ.. ఢిల్లీకి వెళ్లి మరీ ఆయన్ను పొగడటమే కాదు.. ఆ సందర్భంలో మోడీకి చాలానే సలహాలు ఇచ్చినట్లుగా ఆయన చెప్పుకున్నారు. ప్రధాని మోడీ లాంటి నేతకు.. సలహాలు.. సూచనలు ఇచ్చే సాహసం కేసీఆర్ కు మాత్రమే సొంతమన్న మాటను పలువురు చెబుతుంటారు. అలా.. నోట్ల రద్దు వేళలోనే కాదు.. నీతి ఆయోగ్ సమావేశాల్లోనూ.. విడి వేళల్లోనూ ఢిల్లీకి వెళ్లి మోడీని పొగిడిన వారి జాబితాలో కేసీఆర్ పేరే ముందు ఉంటుంది.

అలాంటి కేసీఆర్.. గడిచిన కొద్ది రోజులుగా ప్రధాని మోడీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలే చేస్తున్నారు. ఘాటు విమర్శలు చేస్తూ.. రానున్నరోజుల్లో ఢిల్లీలో చక్రం తిప్పేది తానేనని.. ఫెడరల్ ఫ్రంట్ కుంపటిని గుర్తుకు తెస్తున్నారు. అదెంత వరకూ సాధ్యమవుతుందో తెలీదు కానీ.. మోడీపై విమర్శనాస్త్రాల్ని సంధించే క్రమంలో కేసీఆర్ ప్రస్తావిస్తున్న అంశాలపై పలువురు నోళ్లు వెళ్లబెడుతున్నారు.

2014 ఎన్నికల్లో విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని ప్రస్తావిస్తూ.. ఆ మొత్తాన్ని భారత్ కు తీసుకొస్తే.. ఒక్కో భారతీయుడి ఖాతాలో రూ.15 లక్షల చొప్పున జమ చేయొచ్చు? అంటూ.. నల్లధనం విశ్వరూపాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ మాటను వక్రీకరించి.. మోడీ ప్రధాని అయితే.. దేశ ప్రజల బ్యాంకు ఖాతాలో రూ.15లక్షలు వేస్తామని చెప్పారని.. ఒక్క పైసా అయినా వేశారా? అని ప్రశ్నిస్తుంటారు.

మిగిలిన వారి సంగతిని వదిలేయొచ్చు. కానీ.. కేసీఆర్ లాంటి మేధావి సైతం ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలా? విషయం తెలీని వారు నోటికి వచ్చినట్లు మాట్లాడతారు. కానీ.. కేసీఆర్ లాంటి విషయాల మీద పట్టు ఉన్న వారు కూడా.. మోడీ రూ.15లక్షల చొప్పున బ్యాంకు ఖతాలో వేస్తామని చెప్పారని.. కనీసం రూ.15 వేసారా? అని ప్రశ్నిస్తున్నారు.

మోడీని తిట్టేందుకు చాలానే అంశాలే ఉన్నా.. డబ్బు కోణాన్ని పట్టుకున్న కేసీఆర్ తీరును పలువురు ప్రశ్నిస్తున్నారు. మోడీ అనని మాటను అనేస్తున్న కేసీఆర్.. రేపొద్దున మోడీ చేతికి పవర్ వస్తే.. వెళ్లి సలహాలు.. సూచనలు ఇవ్వటానికి వీలు కాదన్న విషయాన్ని కేసీఆర్ ఎందుకు గుర్తించటం లేదన్నమాట వినిపిస్తోంది. నిజమే.. కేసీఆర్ జీ.. ఆ యాంగిల్ లో ఆలోచించి మాట్లాడితే బాగుంటుందేమో?