Begin typing your search above and press return to search.

నాలుగు సీట్లు పోయినా ఫ‌ర్లేదు..రేవంత్ ఓడాలె!

By:  Tupaki Desk   |   3 Oct 2018 7:41 AM GMT
నాలుగు సీట్లు పోయినా ఫ‌ర్లేదు..రేవంత్ ఓడాలె!
X
తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయం హాట్ హాట్ గా మారింది. తెలంగాణ ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి.. ఆయ‌న స్థాయిలో ఘాటుగా వ్యాఖ్య‌లు చేయ‌గ‌లిగిన‌వాడు.. ప్ర‌జ‌ల దృష్టిని త‌న మాట‌ల‌తో ఇట్టే ఆక‌ర్షించే స‌త్తా ఉన్న నేత రేవంత్ రెడ్డి మాత్ర‌మే. ఇప్ప‌టికే రేవంత్ ను ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ చేసిన కేసీఆర్ పైచేయి సాధిస్తే.. తాజాగా అత‌ని ఇంట్లో సోదా ఎపిసోడ్ తో రేవంత్ కి సానుభూతి వెల్లువ‌లా మారింది.

ఇదిలా ఉంటే.. ఎట్టి ప‌రిస్థితుల్లో రేవంత్ అసెంబ్లీలోకి అడుగు పెట్ట‌కుండా చేయాల‌న్న‌దే టీఆర్ఎస్ అధినేత లక్ష్య‌మ‌ని చెబుతున్నారు. అసెంబ్లీలో ఏ విధంగా అయితే.. రేవంత్ మాట్లాడ‌నీయ‌కుండా పావులు క‌దిపారో.. తాజా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రేవంత్‌ను అలానే ఫిక్స్ చేయాల‌ని.. ఎంత ఖ‌ర్చు అయినా.. నాలుగు సీట్లు త‌గ్గినా ఫ‌ర్లేదుకానీ రేవంత్ మాత్రం ఓడిపోవాల్సిందేన‌న్న ప‌ట్టుద‌ల‌తో కేసీఆర్ ఉన్న‌ట్లు చెబుతున్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో ఉన్న కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం.. కొత్త జిల్లాల ఏర్పాటు త‌ర్వాత వికారాన‌బాద్ జిల్లా ప‌రిధిలోకి వెళ్లింది. కొండ‌గ‌ల్ సీటు నుంచి బ‌రిలోకి దిగ‌నున్న రేవంత్‌కు పోటీగా టీఆర్ ఎస్ అభ్య‌ర్థిగా ప‌ట్నం న‌రేంద్ర రెడ్డిని ప్ర‌క‌టించారు. తెలంగాణ రాష్ట్ర తాజా మాజీ మంత్రి ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి సోద‌రుడైన న‌రేంద్ర రెడ్డిని రంగంలోకి దింప‌టం ద్వారా.. రేవంత్ కు గ‌ట్టి స‌వాల్‌ను విసిరిన‌ట్లుగా చెప్పాలి.

సిట్టింగ్ ఎమ్మెల్యేగా బ‌రిలోకి దిగ‌నున్న రేవంత్ రెడ్డి గెలుపు విష‌యంలో కాంగ్రెస్ న‌మ్మ‌కంగా ఉన్న‌ప్ప‌టికీ.. త‌మ‌కున్న బ‌ల‌గాల్ని త‌ర‌లించి అయినా స‌రే.. రేవంత్ కు ఓట‌మి రుచి చూపించాల‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ అండ్ కో ఉన్న‌ట్లు చెబుతారు. దీనికి త‌గ్గ‌ట్లే త‌న ఓట‌మి కోసం సీఎం కేసీఆర్‌.. తెలంగాణ రాష్ట్ర డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి సైతం ప్ర‌య‌త్నిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు చేయ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

న‌రేంద్ర‌రెడ్డి గెలుపు కోసం టీఆర్ ఎస్ కు చెందిన ప‌లువురు నేత‌లు కొండంగ‌ల్‌ ను మొహ‌రించిన‌ట్లుగా చెబుతున్నారు. రేవంత్ మాత్రం వ‌న్ మ్యాన్ ఆర్మీగా ప‌ని చేస్తున్నార‌ని చెబుతున్నారు. రేవంత్ త‌న‌కు తానుగా త‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని చూసుకుంటున్నారు. తెలంగాణ‌లోని అన్ని వ‌ర్గాల వారి దృష్టిని ఆక‌ర్షిస్తోన్న అతి కొద్ది అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో కొండంగ‌ల్ ఒక‌ట్రెండు స్థానాల్లో ఉంటుంద‌ని చెబుతున్నారు. మ‌రి.. కొండంగ‌ల్ ఓట‌ర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.