Begin typing your search above and press return to search.

ఉత్తమ్ పై గుత్తా..కేసీఆర్ ప్లాన్ సక్సెస్ అయ్యేనా?

By:  Tupaki Desk   |   8 Sep 2018 9:04 AM GMT
ఉత్తమ్ పై గుత్తా..కేసీఆర్ ప్లాన్ సక్సెస్ అయ్యేనా?
X
కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. అప్పుడే మొత్తం కుప్ప కూలిపోతుంది. ఇప్పుడిదే ఐడియాను కాంగ్రెస్ పై ప్రయోగిస్తున్నాడు టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్. అందుకే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 105 సీట్లలో అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. రాష్ట్రంలో కాంగ్రెస్ కు నాయకత్వం వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్ నగర్ అభ్యర్థిని మాత్రం ప్రకటించలేదు. ఆయన భార్య గెలిచిన కోదాడ నుంచి కూడా ఎవరినీ ఎంపిక చేయలేదు. దీనివెనుక కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఉందని జిల్లాలో గుసగుసలాడుకుంటున్నారు..

పీసీసీ అధ్యక్షుడిగా.. తెలంగాణ కాంగ్రెస్ కు చుక్కానిగా ఉత్తమ్ ఉన్నాడు. ఆయన్ను హుజూర్ నగర్ లో ఓడిస్తే కాంగ్రెస్ ఢీలా పడడం ఖాయం. కాంగ్రెస్ కెప్టెనే ఓడిపోతే ఇక ఆ పార్టీని తెలంగాణలో దేవుడు కూడా రక్షించలేడని కేసీఆర్ భావిస్తున్నాడు. అందుకే గత 2014 ఎన్నికల్లో ఉత్తమ్ పై పోటీచేసి ఓడిపోయిన దాసోజు శంకరమ్మకు ఈసారి టిక్కెట్ ఇవ్వలేదు. ఆమెకు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చి హోల్డ్ లో పెట్టాడు.

ఉత్తమ్ కు సరైన పోటీ అభ్యర్థి గుత్తా సుఖేందర్ రెడ్డి అని కేసీఆర్ బలంగా నమ్ముతున్నారు. గుత్తాకు ఎమ్మెల్యే అయ్యి మంత్రిని కావాలని ఎప్పటి నుంచో ఆశ ఉంది. అంతేకాకుండా బడా పారిశ్రామికవేత్త కావడంతో ఆయన వద్ద పుష్కలంగా ఆర్థిక వనరులున్నాయి. ఉత్తమ్ ను ఢీకొట్టే బలం, బలగం కార్యకర్తల సపోర్టు నల్గొండ జిల్లాలో ఉంది. అందుకే ఉత్తమ్ పై గుత్తాను పోటీచేయించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయనకు చెబితే నో అన్నాడట.. ఉత్తమ్ పై పోటీచేయనని.. కానీ ఆయన భార్య పద్మావతిపై కోదాడలో బరిలోకి దిగుతానని చెప్పినట్టు వార్తలు వెలువడుతున్నాయి.

కానీ కోదాడలో ఇప్పటికే ఇద్దరు టీఆర్ఎస్ నేతలు చురుగ్గా ఉన్నారు. కోదాడ టీఆర్ ఎస్ ఇన్ చార్జిగా ఉన్న శశిధర్ రెడ్డి గడిచిన ఎన్నికల్లో పద్మావతి చేతిలో ఓడిపోయారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మాజీ ఎమ్మెల్యే చందర్ రావు గులాబీ కండువా కప్పుకొని కోదాడ సీటు ఆశిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరినీ కాదని గుత్తాకు సీటు కేసీఆర్ ఇస్తాడా ఇవ్వడా అనేది సస్పెన్స్ గా మారింది.

కేసీఆర్ టార్గెట్ ఒక్కటే.. ఉత్తమ్ ను కొట్టాలి. కానీ గుత్తా మాత్రం ఉత్తమ్ భార్యపై పోటీచేస్తానని అంటున్నాడట.. దీంతో ఈ రెండు స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనను కేసీఆర్ పెండింగ్ లో పెట్టారు. ఉత్తమ్ ను ఓడించాలన్న కేసీఆర్ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి మరి.