Begin typing your search above and press return to search.

కంచుకోట కూలుతుందని కేసీఆర్‌ కు టెన్షన్....

By:  Tupaki Desk   |   7 Aug 2019 1:30 AM GMT
కంచుకోట కూలుతుందని కేసీఆర్‌ కు టెన్షన్....
X
తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ ఎస్ పార్టీకి సరికొత్త టెన్షన్ పట్టుకుంది. ఆ పార్టీకి ముందు నుంచి కంచుకోటగా ఉన్న ఉత్తర తెలంగాణ ప్రాంతం ఇప్పుడు బీజేపీకి మద్ధతు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల వెలువడిన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 17 స్థానాల్లో టీఆర్ ఎస్ 9 గెలిస్తే, కాంగ్రెస్ 3, ఎం‌ఐ‌ఎం 1 గెలుచుకుంది. ఇక ఎవరు ఊహించని విధంగా బీజేపీ 4 స్థానాలని కైవసం చేసుకుంది. పైగా ఈ నాలుగు స్థానాల్లో ఒకటి సికింద్రాబాద్ తీసేస్తే....మిగిలిన మూడు ఉత్తర తెలంగాణ ప్రాంతంలోవే.

నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్ స్థానాలని కైవసం చేసుకుంది. అలాగే పెద్దపల్లి స్థానంలో టీఆర్ ఎస్, కాంగ్రెస్ కి గట్టిగానే పోటీ ఇచ్చింది. దీనికి తోడు నిజామాబాద్ లో సీఎం కుమార్తె కవిత కూడా ఓటమి పాలవ్వడం పెద్ద మైనస్. ఇక కేంద్రంలో కూడా అధికారంలోకి రావడంతో..బీజేపీ రాష్ట్రంలో బలోపేతం అవుతోంది. అందులో భాగంగానే ఇతర పార్టీల నాయకులని చేర్చుకుంటూ ముందుకు వెళుతున్నారు.

అలాగే ఇటీవల వెలువడిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ మునుపెన్నడూ లేని విధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలని కైవసం చేసుకుంది. ఆ పార్టీ గెలిచిన సీట్లు త‌క్కువే అయినా ఓట్ల శాతం పెరిగింది. ఈ క్రమంలోనే త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి కొంతమేర పట్టుంది. అందులో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో కరీంనగర్- నిజామాబాద్- ఆదిలాబాద్- రామగుండం కార్పొరేష‌న్ / మున్సిపాలిటిల్లో గులాబీ పార్టీకి చెక్ పెట్టి కాషాయ జెండా ఎగురవేయాలని చూస్తున్నారు.

ఎలా లేదన్న తమ కంచుకోటలో బీజేపీ బలపడటం టీఆర్ ఎస్ ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే దక్షిణ ప్రాంతంలో నల్గొండ, భువనగిరి, మల్కాజిగిరి స్థానాలని కాంగ్రెస్, సికింద్రాబాద్ ని బీజేపీ కైవసం చేసుకుంది. ఇక్కడ కూడా మున్సిపాలిటీల్లో టీఆర్ ఎస్ కు కాంగ్రెస్- బీజేపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా కేసీఆర్ ఉత్త‌ర తెలంగాణ‌ను ఎప్పుడూ టీఆర్ఎస్‌కు కంచుకోట‌గా చెపుతుంటారు. ఇప్పుడు అలాంటి చోట బీజేపీ దూసుకు పోతుండ‌డం కేసీఆర్‌కు టెన్ష‌న్ టెన్ష‌న్‌గా మారింది.

అలాగే ఖమ్మంలో మొన్న టీఆర్ ఎస్ తరుపున నామా నాగేశ్వరావు గెలిచారు. ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వచ్చిన ఆయనకు లోక్ సభ ఎన్నికల్లో...టీడీపీ ఓటర్ల మద్ధతు దొరికింది. ఇక్క‌డ వ‌ర‌కు బాగానే ఉన్నా ఇక్క‌డ కూడా బీజేపీ కోనేరు స‌త్య‌నారాయ‌ణ లాంటి నేత‌ల‌ను త‌మ పార్టీలోకి లాక్కుని బ‌ల‌ప‌డేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. మొత్తం మీద తమకు అండగా ఉండే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో టీఆర్ ఎస్ కొంత పట్టు కోల్పోవడం ఆ పార్టీ అధినాయకత్వానికి షాకే అని చెప్పాలి. చూడాలి మరి మున్సిపాలిటీ ఎన్నికల్లో సత్తా చాటి కంచుకోటని నిలబెట్టుకుంటుందో లేక మ‌రింత దిగ‌జారుతుందో ?