Begin typing your search above and press return to search.

ఈ ఎపిసోడ్ లో కేసీఆర్ ది మాస్టర్ స్ట్రోక్!

By:  Tupaki Desk   |   20 Jun 2020 5:30 AM GMT
ఈ ఎపిసోడ్ లో కేసీఆర్ ది మాస్టర్ స్ట్రోక్!
X
కలలు కనటం అందరూ చేసేదే. కానీ.. కన్నకలల్ని సొంతం చేసుకోవటం అందరికి సాధ్యం కాదు. ప్రజాస్వామ్య భారతంలో ఉద్యమ నాయకుడి వ్యవహరిస్తూ రాజకీయ పార్టీని నడపటం అంటే తమాషా కాదు. నిప్పుల మీద నడకను నిబ్బరంగా.. నిబద్ధతతో నడిపిన కేసీఆర్ తాను అనుకున్నట్లు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటమే కాదు.. అధికారాన్ని సొంతం చేసుకున్నారు.

తనను తాను గొప్పగా చెప్పుకునే అలవాటు కేసీఆర్ లో కనిపిస్తుంటుంది. కేసీఆర్ తోనే ఆటలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు ఆయన ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందే కానీ అతిశయంగా అనిపించదు. కేసీఆర్ తో పెట్టుకుంటే తగిన ఫలితం చూస్తారంటూ వార్నింగ్ ఇచ్చినప్పుడు.. బడాయి మాటలు భలే చెబుతారన్న స్థానే.. భయం కలిగించేలా మాటలు ఉండటం కేసీఆర్ కు మాత్రమే సాధ్యం.

మిగిలిన వారికి కేసీఆర్ కు తేడా ఏమిటంటే.. అవకాశం లభించాలే కానీ.. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా నిర్ణయాలు తీసుకోవటం. ఎవరేమైనా అనుకుంటారన్న జంకు ఆయనలో అస్సలు ఉండదు. తాను ప్రకటించే నిర్ణయాన్ని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవటం.. ఒకసారి డిసైడ్ అయితే ముందుకే తప్పించి వెనకడుగు వేయని లక్షణంలో ఆయనలోకనిపిస్తుంది. నిజానికి అదే ఆయనకు తిరుగులేని అధినేతగా మార్చిందని చెప్పాలి.

చైనా దురాగతంతో ప్రాణాలు విడిచిన ఇరవై మంది సైనికుల విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చూస్తే.. ప్రధాని హోదాలో ఉండి మోడీ చేయలేనిది ఏమిటో అర్థమయ్యేలా చేస్తుంది. దేశం కోసం వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ తో పాటు ఇరవై మంది త్యాగాలకు దేశం కన్నీరు పెట్టింది. వారి కుటుంబాలను గుర్తుకు తెచ్చుకొని వేదన చెందినోళ్లు కోట్లాది మంది ఉన్నారు. ఇలాంటివేళ.. ఈ కుటుంబాలకు సంబంధించిన ప్రధాని మోడీ నుంచి ఏదైనా కీలక ప్రకటన వెలువడుతుందని వెయిట్ చేసినోళ్లు లేకపోలేదు. కానీ.. అలాంటిదేమీ జరగలేదు.

అందుకు భిన్నంగా ఎవరి అంచనాలకు చిక్కకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన చాలామందిని విస్తుపోయేలా చేసింది. అఖిలపక్షంతో ప్రధాని మోడీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. ప్రాణత్యాగం చేసిన సైనికుల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రూ.5కోట్ల నగదు.. ఇంటి స్థలంతో పాటు ఆయన భార్యకు గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించి చాలామంది ఆశ్చర్యపోయేలా చేశారు.

ఇలాంటి సమయాల్లో అందరి కంటే ముందు కేసీఆర్ స్పందిస్తారని తెలుసు కానీ.. మరీ ఇంతలా అన్నది మాత్రం ఎవరూ ఊహించలేదు. ఇక్కడితో ఆగని కేసీఆర్.. వీర మరణం పొందిన మిగిలిన సైనికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి రూ.10లక్షలుచొప్పున అందజేస్తామన్నారు. ఇంతా చేసిన తనపై విమర్శలు రాకుండా ఉండేందుకు ఆయన చాలా తెలివిగా వ్యవహరించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారి కుటుంబాలకు ఇచ్చే మొత్తాన్ని కేంద్రమంత్రి ద్వారా అందిస్తామని చెప్పటం ద్వారా.. ఎవరూ నొచ్చుకోకుండా జాగ్రత్త పడ్డారు. ఇదంతా చూసినప్పుడు.. కేసీఆర్ నోటి నుంచి వచ్చిన ప్రకటన.. ప్రధాని మోడీ నుంచి రావాలన్న భావన దేశ ప్రజల్లో కలిగేలా చేయటమే కేసీఆర్ మార్క్ అని చెప్పక తప్పదు.