Begin typing your search above and press return to search.

ప్ర‌త్యేక ట్రైన్‌లో తిరుప‌తికి కేసీఆర్‌​

By:  Tupaki Desk   |   30 March 2016 5:51 AM GMT
ప్ర‌త్యేక ట్రైన్‌లో తిరుప‌తికి కేసీఆర్‌​
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు మ‌రో కొత్త సంప్ర‌దాయానికి తెర‌తీయ‌నున్నారు. ఏది చేసిన భారీగా, అద్భుతంగా ఉండాల‌ని త‌పించే కేసీఆర్ త‌న కోరిక సిద్ధించిన క్ర‌మాన్ని పుర‌స్క‌రించుకున్న స‌మ‌యంలోనూ అదే రీతిని పాలో అవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డితే తాను మొక్కులు తీర్చుకుంటాన‌ని కేసీఆర్ ఉద్య‌మ‌కారుడిగా ఉన్న స‌మ‌యంలో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా మొక్కు చెల్లించుకోవడానికి తిరుపతికి ప్రత్యేక ట్రైన్‌లో కేసీఆర్‌ వెళ్లనున్నారు. తాజాగా ఆయ‌నే స్వ‌యంగా ఈ మాట చెప్పారు.

శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ, మొక్కులు చెల్లించుకోవడానికి తిరుపతికి తాను ఒక్కడినే కాకుండా పది జిల్లాల నుంచి ప్రజలను తీసుకెళ్తానని, అందుకోసం ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేయనున్నట్టు ప్ర‌క‌టించారు. తిరుపతికే కాకుండా అజ్మీర్‌కు కూడా వెళ్లి మొక్కులు చెల్లించుకుంటామన్నారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అజ్మీర్ వెళ్లి వసతి సౌకర్యాలపై చర్చించి వచ్చారని ముఖ్యమంత్రి చెప్పారు.

తెలంగాణ ఉద్యమం సమయంలోని మొక్కులన్నీ చెల్లించాలని నిర్ణయించినట్టు సీఎం కేసీఆర్ గతంలోనే వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే తిరుమల శ్రీవారికి కానుకలు ఇస్తానని మొక్కుకున్నానని పేర్కొంటూ శ్రీవారికి రూ. 5 కోట్లు విలువ చేసే కానుకలు స్వయంగా సమర్పిస్తానని ఆ సమయంలోనే కేసీఆర్ తెలిపారు. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ మొక్కులు చెల్లించుకునేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీచేసింది. ఈ జీవో ప్ర‌కారం తిరుమ‌ల వెంక‌న్న‌కు ఏడు కోట్ల ఆభ‌ర‌ణాలు కాగా...వరంగ‌ల్ భ‌ద్ర‌కాళి అమ్మ‌వారికి ఆభ‌ర‌ణాలు చేయించేందుకు రూ.57 ల‌క్ష‌ల‌తో బంగారు కిరిటం, తిరుచానురు అమ్మ‌వారికి 15 గ్రాముల‌తో ముక్కుపుడ‌క‌, క‌న‌క‌దుర్గ అమ్మ‌వారికి 15 గ్రాముల‌తో ముక్కుపుడ‌క‌, కురువ వీర‌భ‌ద్ర‌స్వామికి 25 గ్రాములతో బంగారు మీసాలు స‌మ‌ర్పించ‌నున్నారు. మొత్తం విలువ రూ.59 ల‌క్ష‌లుగా అంచ‌నా.