Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌కు అష్ట‌మి అడ్డొచ్చిందా?

By:  Tupaki Desk   |   12 May 2019 5:26 AM GMT
ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌కు అష్ట‌మి అడ్డొచ్చిందా?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు న‌మ్మ‌కాలు ఎంత ఎక్కువో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. జాత‌కాల‌కు.. ముహుర్తాల‌కు ఆయ‌నిచ్చే ప్రాధాన్య‌త అంతా ఇంతా కాదు. ప్ర‌తిది త‌న న‌మ్మ‌కాల‌కు అనుగుణంగా చేసే కేసీఆర్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల అభ్య‌ర్థుల ఎంపిక‌ను వాయిదా వేశారు. దీనికి కార‌ణం ఆయ‌న న‌మ్మ‌కాలతో పాటు ఊహించ‌ని విధంగా చోటు చేసుకున్న ప‌రిణామంగా చెప్ప‌క త‌ప్ప‌దు.

వ‌రంగ‌ల్.. న‌ల్గొండ‌.. రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ స్థానాల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల పేర్ల‌ను ఇప్ప‌టికే ఖ‌రారు చేశారు. అయితే.. ఆ పేర్లు బ‌య‌ట‌కు రాలేదు. ఇప్ప‌టికే రెండు స్థానాల‌కు అభ్య‌ర్థులు ఖ‌రారైన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. రంగారెడ్డి నుంచి మాజీ మంత్రి ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డిని.. వ‌రంగ‌ల్ నుంచి పోచంప‌ల్లి శ్రీ‌నివాస‌రెడ్డిని పోటీ చేయించాల‌ని డిసైడ్ అయ్యారు.

న‌ల్గొండ అభ్య‌ర్థిగా గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి పేరు చ‌ర్చ‌కు వ‌చ్చినా.. ఆయ‌న ఎమ్మెల్యే కోటా స్థానం నుంచి ఎమ్మెల్సీ కావాల‌ని భావిస్తున్న నేప‌థ్యంలో.. ఆయ‌న‌కు బ‌దులుగా వేరే వారిని ఎంపిక చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో.. బ‌రిలోకి తేరా చిన్న‌ప‌రెడ్డి.. నంద్యాల ద‌యాక‌ర్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే చంద‌ర్ రావు.. చ‌కిలం అనిల్ కుమార్.. సుంక‌రి మ‌ల్లేశ్ గౌడ్‌.. వై వెంక‌టేశ్వ‌ర్ల‌లో ఒక‌రికి అవ‌కాశం ఇవ్వాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

అభ్య‌ర్థుల ఎంపిక విష‌యానికి సంబంధించి ఆయా జిల్లాల మంత్రుల‌తో క‌లిసి కేసీఆర్ చ‌ర్చ‌లు జ‌రిపారు. అభ్య‌ర్థుల ఎంపిక బాధ్య‌త‌ను కేసీఆర్ కు అప్ప‌గించారు. ఆయ‌న ఏ నిర్ణ‌యం తీసుకున్నా త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు. వాస్త‌వానికి శ‌నివారం అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న జ‌ర‌గాల్సి ఉన్నా.. అష్ట‌మి కావ‌టంతో ఆగింది. అదే స‌మ‌యంలో శ‌నివారం సాయంత్రం టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే క‌న‌కారెడ్డి మ‌ర‌ణించ‌టంతో అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌ను ఆదివారానికి వాయిదా వేశారు.

కేసీఆర్ చెన్నై టూర్ నేప‌థ్యంలో అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌.. వారికి బీఫారాలు ఇచ్చే బాధ్య‌త‌ను టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అప్ప‌జెప్పారు. ఇదిలా ఉంటే.. అభ్య‌ర్థుల పేర్లను శ‌నివార‌మే డిసైడ్ చేస్తార‌న్న మాట‌తో.. టికెట్ల ఆశావాహులు.. వారి అనుచ‌ర వ‌ర్గం తీవ్ర ఉత్కంట‌కు గురైంది. ప్ర‌క‌ట‌న వాయిదా ప‌డింద‌న్న సమాచారంతో కూసింత నిరుత్సాహానికి గురైనట్లుగా తెలుస్తోంది.