Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు మాత్ర‌మే అంత‌టి ద‌మ్ముంది

By:  Tupaki Desk   |   6 Aug 2016 2:41 PM GMT
కేసీఆర్‌ కు మాత్ర‌మే అంత‌టి ద‌మ్ముంది
X
భార‌తీయ జ‌న‌తాపార్టీ. మ‌న‌దేశ సౌభ్ర‌తృత్వాన్ని గౌర‌విస్తూ భార‌తీయ మూలాలతో ముందుకు పోతున్న పార్టీ. ఏఐఎంఐఎం... పాత‌బ‌స్తీ వేదిక‌గా ఏర్పాటైన ఈ పార్టీ మ‌త‌ప‌ర‌మైన అజెండాతో ముందుకుపోతూ ఇపుడిపుడే విస్త‌ర‌ణ బాట ప‌డుతోంది. ఈ రెండు పార్టీల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేయ‌క‌పోయిన భ‌గ్గుమంటుంద‌నే విష‌యం రాజ‌కీయ నాయ‌కుల‌కే కాదు సామాన్యుల‌కు సైతం తెలుసు! ఈ పార్టీల నేత‌లు త‌మ‌కు ఒక‌రు ద‌గ్గ‌రైతే మ‌రొక‌రిని దూరం పెట్టేస్తారు. పైపెచ్చు ఏక‌కాలంలో బీజేపీ-ఎంఐఎంల‌కు చేరువ కావ‌డం సాధ్య‌మ‌య్యే ప‌నికాదు. కానీ విభిన్న‌మైన రాజ‌కీయ‌వేత్త‌గా నిలిచిన తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన‌ట్లుగా క‌నిపిస్తున్నారు.

తెలంగాణకు సంబంధించి హామీలను అమలు చేయమని డిమాండ్ చేయడం మినహా ఇప్పటివరకు కేసీఆర్ ప్రధానమంత్రిపై - కేంద్రంలో బీజేపీ పాలనపై పెద్దగా విమర్శలు చేయలేదు. అలాగ‌ని స‌ఖ్య‌త‌తో కూడా ఉండ‌రు. అంశాల వారీగా మద్దతు ఇస్తాం - అదే సమయంలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఒత్తిడి తీసుకు వచ్చి సాధించుకుంటామని చెబుతుంటారు. మ‌రోవైపు రాష్ట్రంలో ఎంఐఎంతో స్నేహాన్ని కొనసాగిస్తూనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పట్ల కేసీఆర్ సానుకూలంగా ఉంటున్నారు. తెలంగాణ ఏర్పడగానే ప్రభుత్వంలో చేరమని స్వయంగా కేసీఆర్‌ ఎంఐఎంను ఆహ్వానించిన సంగ‌తి తెలిసిందే. ఎంఐఎం దానికి ఒప్పుకోలేదనేది టాక్‌. ఇక బీజేపీ ప్రభుత్వం పట్ల కేసీఆర్ సానుకూలంగా ఉండడంతో ఎన్‌ డిఏలో టీఆర్‌ ఎస్ చేరుతుందని రెండేళ్లనుంచి ప్రచారం సాగుతూనే ఉంది. దాన్ని అలాగే కొన‌సాగిస్తూ కూడా ఎంఐఎంతో దోస్తీని న‌డిపించ‌గ‌లుగుతున్నారు. తాజాగా ప్ర‌ధాన‌మంత్రిని రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు ర‌ప్పించ‌డ‌మే కాదు. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో మాన‌స పుత్రిక అయిన మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కాన్ని ప్రారంభింప‌చేస్తున్నారు. త‌ద్వారా బీజేపీ ర‌థ‌సార‌థి త‌న‌కెంత ప్రాధాన్యం ఇస్తున్నారో చెప్ప‌క‌నే చెప్తున్నారు. మొత్తంగా ఏక‌కాలంలో ఉప్పు-నిప్పులాగా ఉన్న పార్టీల‌కు చేరువ కావ‌డం కేసీఆర్‌ కే సాధ్య‌మైన విష‌యమ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది.