Begin typing your search above and press return to search.

ఈ ఊపులోనే వారి చేత రాజీనామా చేయిస్తారా?

By:  Tupaki Desk   |   6 Feb 2016 4:20 AM GMT
ఈ ఊపులోనే వారి చేత రాజీనామా చేయిస్తారా?
X
రెండు ఎన్నికలు.. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ సత్తా ఏమిటో చెప్పేశాయి. వరంగల్ ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజార్టీతో దూసుకెళ్లిన కారు.. తాజాగా జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో తన స్పీడ్ ను ప్రదర్శించి విపక్షాల నోటి వెంట మాట రాకుండా చేసిన పరిస్థితి. గులాబీ నేతలు సైతం కలలో కూడా ఊహించని విజయాన్ని అందించిన గ్రేటర్ ప్రజల తీర్పుతో తెలంగాణ అధికారపక్షం కొత్త ఆలోచనల్లో ఉందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

బంగారు తెలంగాణ నిర్మాణం కోసం గెలిచిన పార్టీని వదిలేసి మరీ అధికారపక్షంతో జత కట్టిన పలువురు ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా విపక్షాల నుంచి తెచ్చిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించే ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారనే మాట టీఆర్ ఎస్ నేతల నోట వినిపిస్తోంది. తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా మారిన నేపథ్యంలో.. రానున్న మూడేళ్లలో మరింతగా దూసుకెళ్లేందుకు వీలుగా.. తనపై పడిన మచ్చను చెరుపుకోవటానికి వీలుగా తెలంగాణ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.

విపక్షాల నుంచి అధికారపక్షంలోకి వచ్చిన ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి.. వాటిని వెంటనే ఆమోదం పొందేలా చేసి.. ఉపఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది. తిరుగులేని అధిపత్యం చెలాయిస్తున్న నేపథ్యంలో ఇప్పుడే మరో ఉప ఎన్నికకు వెళ్లటం ద్వారా తమ శక్తిని మరింత పెంచుకోవటంతో పాటు.. విపక్షాల్ని మరింత బలహీన పర్చాలన్న భావనలో టీఆర్ ఎస్ అధినాయకత్వం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ఎన్నిక ఏదైనా టీఆర్ ఎస్ గెలుపు నల్లేరు మీద నడకే కానున్న నేపథ్యంలో.. అనర్హత వేటు వేలాడుతున్న ఎమ్మెల్యేల్ని సగౌరవంగా గెలిపించుకొని.. అధికారపార్టీ నేతలుగా పూర్తి స్థాయిలో మార్చేస్తే.. ఒక పని అయిపోతుందన్న వాదనను టీఆర్ ఎస్ నేతలు కొందరు వినిపిస్తున్నాయి. సంచలన నిర్ణయాలు తీసుకునే కేసీఆర్.. ఈ అంశం మీద ఫోకస్ పెట్టారని.. మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.