Begin typing your search above and press return to search.

మంత్రుల‌కు ఆ స్వేచ్ఛ కూడా ఇవ్వ‌ని కేసీఆర్‌!

By:  Tupaki Desk   |   20 Feb 2019 8:55 AM GMT
మంత్రుల‌కు ఆ స్వేచ్ఛ కూడా ఇవ్వ‌ని కేసీఆర్‌!
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అంటే మాట‌లు కాదు. ఆయ‌న మ‌ర మేధావిగా ప‌లువురు అభివ‌ర్ణిస్తుంటారు. తెలివితేట‌లు ఉంటే ఫ‌ర్లేదు కానీ.. మ‌రీ ఈ స్థాయిలోనా అంటూ కొత్త‌గా మంత్రులుగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన వారు లోగుట్టుగా వాపోతున్నారు.

69 రోజుల పాటు ఊరించి.. ఊరించి మ‌రీ మంత్రి ప‌ద‌వులు ఇచ్చిన కేసీఆర్‌.. ఆ సంబ‌రంలో ఉన్న మంత్రుల‌కు స‌రికొత్త షాకిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. మంత్రులుగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వారు.. వారికి న‌మ్మ‌క‌స్తులు.. ఇష్ట‌మైన వారిని పీఎస్ గా.. మ‌రో ఇద్ద‌రు పీఆర్వోలుగా ఎంపిక చేసుకోవ‌టం అల‌వాటే.

కానీ.. అందుకు చెక్ చెబుతూ కేసీఆర్ ఊహించ‌ని రీతిలో నిర్ణ‌యం తీసుకున్నారు. మంత్రుల‌కు వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శులుగా వ్య‌వ‌హ‌రించే పీఎస్ ను తానే ఎంపిక చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. కావాలంటే పీఆర్వోల విష‌యంలో మీ ఇష్టం అంటూ సంకేతాలు ఇచ్చారు. మంత్రి ఎవ‌రైనా.. వారి పేషీ ఏదైనా స‌ర్వం చ‌క్రం తిప్పేది పీఎస్ లే.

అలాంటి పీఎస్ ల‌ను తాను ఎంపిక చేసిన వారిని నియ‌మిస్తూ కేసీఆర్ నిర్ణ‌యం తీసుకోవ‌టంతో.. ప్ర‌తి మంత్రి పేషీలో ఏం జ‌రుగుతుంద‌న్న విష‌యం లైవ్ లో తెలిసే ప‌రిస్థితి. మంత్రులు ఎక్క‌డ‌కు వెళ్లారు? ఏం చేస్తున్నారు? ఎవ‌రిని క‌లిశారు? ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు? ముఖ్య‌మంత్రి నోటీస్ లేకుండా ఏదైనా గూఢ‌పుఠాణి చేస్తున్నారా? లాంటి విష‌యాలే కాదు.. చిన్న చిన్న అంశాలు సైతం ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకునేలా కేసీఆర్ నిర్ణ‌యం ఉంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

రెండోసారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటినుంచి కేసీఆర్ ప్ర‌తి అంశం విష‌యంలోనూ ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌తి నిర్ణ‌యం వెనుక మ‌రో లెక్క ఏదో ఉండేలా ఆయ‌న నిర్ణ‌యాలు ఉంటున్నాయి. ఈ వాద‌న‌కు బ‌లం చేకూరేలా తాజా నిర్ణ‌యం ఉంద‌ని చెబుతున్నారు. మంత్రులుగా త‌మ‌కు అవ‌కాశం ల‌భిస్తే.. పీఎస్ లు.. పీఆర్వోలుగా ఎంపిక చేసుకుంటామ‌ని మాట ఇచ్చిన ప‌లువురు మంత్రులకు.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం షాకింగ్ గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.