Begin typing your search above and press return to search.

నేడు ఢిల్లీకి కేసీఆర్.. రాష్ట్రపతి ప్రమాణం అయిపోయాక పనేంటబ్బా...?

By:  Tupaki Desk   |   25 July 2022 8:03 AM GMT
నేడు ఢిల్లీకి కేసీఆర్.. రాష్ట్రపతి ప్రమాణం అయిపోయాక పనేంటబ్బా...?
X
తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిసింది. అకస్మాత్తుగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఆదివారం వరకు వర్షాలు కురిశాయి. శనివారం సీఎం కేసీఆర్ సీరియస్ రివ్యూ చేశారు. మరోవైపు మంత్రి కేటీఆర్ కాలి గాయంతో ఇంటికే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ ఎందుకబ్బా అనేది తెలియడం లేదు. మరోవైపు రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. ప్రతిపక్ష పార్టీలన్నీ ఓటమితో చల్లబడ్డాయి. ముర్ము ప్రమాణ స్వీకారానికి వాస్తవానికి సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. కాగా, అంతకుముందు రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ కు ప్రధాని మోదీ ఇచ్చిన విందుకు కూడా సీఎం కేసీఆర్ కు పిలుపు రాలేదు. ఆశ్చర్యకరంగా ఏపీ సీఎం జగన్ కు ఆహ్వానం అందింది. మరి అయితే.. కేసీఆర్ ఢిల్లీ టూర్ ఎందుకని సందేహం కలుగుతోంది.

ఫెడరల్ ఫ్రంట్ ను కదిలిస్తారా?

కేసీఆర్ అట్టహాసంగా ప్రకటించిన ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తుతం కార్యరూపం దాల్చాల్సి ఉంది. అసలు ఈ ఫ్రంట్ ఉంటుందా? కలిసొచ్చేదెవరు? అనే సందేహాలు ఇప్పటికే ఉన్నాయి. మరోవైపు అసలు ఫ్రంట్ ను పక్కనపెట్టి కేసీఆర్ రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తారనే వార్తలు వచ్చాయి. అంతేగాక.. ఘనంగా ప్రకటించి ఇప్పటికీ గాడిన పడని పథకాలను చేపడతారనే వార్తలు వచ్చాయి.

ఉదాహరణకు పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డులు, కొత్త పింఛన్ల మంజూరు తదితర ప్రజాకర్షక పథకాలను అమల్లోకి తెస్తారని అంచనా వేశారు. దీనికితోడు డబుల్ బెడ్ రూం ఇళ్లలో నెలకొన్న స్తబ్ధతను తొలగిస్తారని చెప్పుకొచ్చారు. వీటన్నిటికీ తోడు.. సీఎం కేసీఆర్ ఏకంగా జిల్లాల పర్యటన చేపట్టి ఒకటి రెండు రోజులు అక్కడే మకాం వేస్తారని, నియోజకవర్గాల వారీగా సమీక్ష చేస్తారని.. నాయకత్వ సమస్యలు, వర్గ విభేదాలను తీర్చేస్తారని రకరకాల అంచనాలు వేశారు. కానీ, వీటన్నిటికీ కార్య రూపం రాలేదు.

మరి ఢిల్లీకి ఎందుకు?

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అప్పులపై కఠినంగా వ్యవహరిస్త్తున్నది. ఎడాపెడా రుణాలు తీసుకోవడాన్నివీల్లేకుండా చేసింది. దీంతో చాలా రాష్ట్రాలకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తెలంగాణ, ఏపీ వంటి భారీ సంక్షేమ రాష్ట్రాలకు అప్పు లేనిది రోజు గడవని పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్ర పెద్దలను కలిసి కేసీఆర్ ఏమైనా మినహాయింపులు కోరతారా? అనేది చూడాలి. ఇక ప్రధాని మోదీతో కేసీఆర్ భేటీకి అవకాశమే లేదు.

అప్పాయింట్ మెంట్ ఇస్తారన్న ఆశా లేదు. ఎందుకంటే.. గతంలో రెండు రోజులు పాటు ఎదురుచూసినా కనీసం తెలంగాణ మంత్రులకు కేంద్ర మంత్రి అప్పాయింట్ మెంటే దక్కలేదు. అదేమంటే.. అసలు ముందస్తుగా సమాచారం లేకుండా ఎవరు రమ్మన్నారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇప్పటికిప్పుడు ఢిల్లీ టూర్ ఎందుకు పెట్టుకున్నారన్న ప్రశ్న తలెత్తింది.

ప్రతిపక్ష నాయకులను కలుస్తారా?

ఫెడరల్ ఫ్రంట్ నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీలో ప్రతిపక్ష నేతలను కలిసే అవకాశం ఉందని భావించినా.. రాష్ట్రపతి ఎన్నికల్లో నామామాత్ర పోటీతో నిరుత్సాహంగా ఉన్న ప్రతిపక్ష నేతలు అందుకు ఉత్సాహం చూపుతారా? అనేది చెప్పలేం. ఇక వచ్చే నెలలో జరుగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థిని మార్గరెట్ ఆల్వాకు గౌరవప్రద ఓట్లు సాధించే వ్యూహం ఏమైనా పన్నుతున్నారా? అనేది చూడాలి. కాగా, ఆల్వాకు ఇప్పటికే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఓటేయబోమని చెప్పారు. అంటే.. టీఎంసీ ఓట్లన్నీ ఆల్వాకు పడనట్లే. ఇక మిగిలిన ప్రతిపక్షాలను కేసీఆర్ ఏమైనా ఒక్కతాటిపైకి తెస్తారేమో చూడాలి. వెరసి.. కేసీఆర్ ఢిల్లీ పర్యటన మర్మమేంటో చూడాలి.