Begin typing your search above and press return to search.

భారత్ రాష్ట్ర సమితి : ఫోకస్ అంతా ఏపీ మీదేనా...?

By:  Tupaki Desk   |   12 Jun 2022 10:33 AM GMT
భారత్ రాష్ట్ర సమితి : ఫోకస్ అంతా ఏపీ మీదేనా...?
X
ఎక్కడైనా ఇంట గెలిచి రచ్చ గెలవమని అంటారు. ఆ విధంగా కనుక ఆలోచిస్తే మాత్రం తెలుగు రాష్ట్రాలలో పుట్టిన పార్టీకి మొదట అక్కడే ఆదరణ దక్కాలి. తెలంగాణా సీఎం కేసీయర్ భారత రాష్ట్ర సమితి పేరిట కొత్త జాతీయ పార్టీని ప్రకటిస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే ఈ నెల 19న ఆ పార్టీకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడడం ఖాయం. మొత్తం 28 రాష్ట్రాల్లో గులాబీ జెండా ఎగరాలని కేసీయార్ తపన పడుతున్నారు. అయితే సౌతిండియాలో పుట్టిన పార్టీ నార్త్ ఇండియాలో రెపరెపలు ఆడడం అంటే చాలా కష్టమైన విషయమే.

ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారత దేశంలో ఈ దేశాన్ని ఎక్కువగా ఏలింది ఉత్తరాదివారే. అక్కడ పుట్టిన పార్టీలే. ఆ భావం మాత్రం ఈ రోజుకీ గట్టిగానే ఉంది. అవసరం అయితే తమ రాజకీయాల కొరకు దక్షిణాది వారి సాయం తీసుకుంటారు కానీ అధికారం మాత్రం తమ చేతులలోనే ఉత్తరాది నేతలు ఉంచుకుంటారు అని ప్రచారంలో ఉంది.

అలా లెక్క వేస్తే భారత్ రాష్ట్ర సమితి ఉత్తరాదిన ప్రభావం చూపించడం బహు కష్టం. పైగా బలమైన ప్రాంతీయ పార్టీలు, హిందీ పార్టీలు ఉన్న చోట బీయారెస్ అనే కొత్త పార్టీ ఎంతవరకూ నిలదొక్కుకుంటుంది అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే. దీంతో అసలు కేసీయార్ ప్లాన్ ఏంటి అన్నదే ఆసక్తికరమైన చర్చగా ఉంది.

అయితే కేసీయార్ కి కూడా ఈ లెక్కలు వ్యవహారాలు తెలియనివి కావు అంటున్నారు. ఆయన బీయారెస్ పెట్టడం వెనక ఒక బ్రహ్మండమైన ప్లాన్ ఉంది అంటున్నారు. ఉమ్మడి ఏపీ టైమ్ లో 42 ఎంపీ సీట్లు ఉన్నాయి. అదే విభజన ఏపీలో తెలంగాణాకు 17 మాత్రమే దక్కాయి. మరి ఈ తక్కువ సీట్లతో రేపటి రోజున ఢిల్లీలో రాజకీయ బేరాలు ఆడడం చాలా కష్టం.

అందుకే ఆయన ఫోకస్ ఇపుడు అంధ్రా మీద పెట్టారా అన్న చర్చ సాగుతోంది. టీయారెస్ పేరు మీద ఆంధ్రాలో పోటీ చేయలేరు. తెలంగాణా అంటే అక్కడ ఓట్లు అడగలేరు. అదే భారత రాష్ట్ర సమితి అని కొత్త పార్టీ పేరిట ఒక జాతీయ పార్టీగా ఏపీకి వచ్చి రాజకీయం చేసినా సబబుగా ఉంటుంది. అంతే కాదు ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులను తనకు అనువుగా మార్చుకునే వీలు ఉంటుంది అన్నదే కేసీయార్ మాస్టర్ ప్లాన్ అంటున్నారు.

ఏపీలో టీడీపీ రాజకీయంగా ఇబ్బందుల్లో ఉంది. జనసేన ఇంకా గట్టిగా జనాల్లోకి వెళ్ళాలి. వైసీపీ మీద మోజు క్రమేణా తగ్గుతోంది. వీటితో పాటు ఇక ఏపీ జనాల్లో ఒక పెద్ద బాధ ఉంది. అదేంటి అంటే కేంద్రంలోని బీజేపీ అన్ని రకాలుగా మోసం చేస్తున్నా ధీటుగా నిలదీసే నాయకుడు లేడు అని. ఏపీలో ఉన్న అన్ని పార్టీలూ బీజేపీకి దాసోహం అనే తీరునే వ్యవహరిస్తున్నాయి. దాంతో బీజేపీని ఎదిరిస్తూ ఏపీకి చేస్తున్న అన్యాయాన్ని జనంలో చర్చకు పెడుతూ కేసీయార్ లాంటి లీడర్ బీయారెస్ పార్టీతో వస్తే ఏపీ జనాలు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది అని అంటున్నారు.

పైగా కేసీయార్ పూర్వీకులు కూడా విజయనగరం జిల్లా బొబ్బిలి వాస్తవ్యులే. ఇక ఆయన సామాజికవర్గం కూడా ప్లస్ కానుంది. ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో ఆ సామాజిక వర్గం చురుకుగా ఉన్నా ద్వితీయ శ్రేణిగానే ఉండాల్సి వస్తోంది. అలాగే బీసీలు, మైనారిటీలను కూడా కలుపుకుని పోతే ఏపీలో బీయారెస్ రాజకీయం రక్తి కడుతుంది అని అంచనా వేస్తున్నారు. ఇక మజ్లీస్ పార్టీ కూడా ఏపీ వైపు చూస్తుంది అన్న ప్రచారం కూడా ఉంది.

ఇలా బీయారెస్ కి తోడుగా మజ్లీస్, వామపక్షాలను కలుపుకుని ఏపీలో కాలు మోపితే మంచి నంబర్ తో సీట్లు గెలుచుకోవచ్చు అన్న లెక్క అయితే ఉందిట. అంటే తెలంగాణాలో వచ్చే సీట్లకు ఏపీ సీట్లు యాడ్ అయితే కేసీయార్ జాతీయ రాజకీయం బాగానే పండుతుంది అన్న భావనతోనే జాతీయ పార్టీ అంటున్నారు అని చెబుతున్నారు. రేపటి రోజున ఫ్రంటుల రాజకీయం ముందుకు వస్తే ఎక్కువ సీట్లు ఉన్న వారికే డిమాండ్ ఉంటుంది.

అలా తన సీట్ల సంఖ్యను పెంచుకోవడం, జాతీయ నేతగా ఫోకస్ కావడం, బంపర్ చాన్స్ తగిలితే ఢిల్లీ పీఠానికే గేలం వేయడం వంటి బహుళ ల‌క్ష్యాలతోనే కేసీయార్ బీయారెస్ రాగం అందుకున్నారు అని అంటున్నారు. సో బీయారెస్ తో తొలి దెబ్బ ఏపీ రాజకీయానికే అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నారు.