Begin typing your search above and press return to search.

ఇంకో వార‌సుడిని తెర‌మీద‌కు తెస్తున్న కేసీఆర్

By:  Tupaki Desk   |   26 Jan 2018 10:31 AM GMT
ఇంకో వార‌సుడిని తెర‌మీద‌కు తెస్తున్న కేసీఆర్
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబం నుంచి మ‌రో వార‌సుడు అరంగేట్రం చేయ‌నున్నార‌ని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. ఆయ‌నే జోగిన‌ప‌ల్లి సంతోష్ రావు. రాజ‌కీయాల‌ను సాధారణంగా చూసే వారికి ఈ పేరు పెద్ద‌గా తెలియ‌దు! అయితే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురించి అవ‌గాహ‌న ఉన్న వారికి మాత్రం ఈ పేరు గురించి చాలా స్ప‌ష్ట‌త ఉంటుంది!! సీఎం కేసీఆర్ ద‌గ్గ‌ర పార్టీ - ప్ర‌భుత్వ ప‌ర‌మైన నిర్ణ‌యాలను `ప్ర‌భావితం` చేయ‌డానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ దొర‌కాలంటే సంప్ర‌దించాల్సింది జోగిన‌పల్లి సంతోష్ కుమార్‌ నే. అంత ప‌ట్టు సీఎం ద‌గ్గ‌ర ఉంద‌న్నమాట‌. త్వ‌ర‌లోనే ఆయ‌న్ను కేసీఆర్ కుటుంబం నుంచి వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి తీసుకురానున్న‌ట్లు తెలుస్తోంది. ఇంత‌కీ ఎందుకు కేసీఆర్ కుటుంబం నుంచి అంటే...ఈయన స్వయానా కేసీఆర్‌ మరదలి కొడుకు సంతోష్.

ఉద్య‌మ‌కాలం నుంచి త‌న‌ వెంట న‌డుస్తున్న సంతోష్‌ కుమార్‌ కు కేసీఆర్ త‌న రాజ‌కీయ పార్టీ త‌రఫున రాష్ట్ర స్థాయి క‌మిటీలో కొద్దికాలం క్రితం చోటు క‌ల్పించారు. సుదీర్ఘ‌కాలంగా పెండింగ్‌ లో ఉన్న రాష్ట్ర క‌మిటీ ప్ర‌క‌టించిన కేసీఆర్ ఆయ‌న‌కు రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. త‌ద్వారా కేసీఆర్ కుటుంబం నుంచి మ‌రో నాయ‌కుడు పార్టీలోకి వ‌చ్చిన‌ట్లయింది. అయితే తాజాగా ఆయ‌న్ను ప్ర‌జాప్ర‌తినిధిగా అవ‌కాశం క‌ల్పించ‌నున్న‌ట్లు స‌మాచారం. రాబోయే రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు చోటు క‌ల్పించనున్న‌ట్లు తెలుస్తోంది.

టీఆర్ ఎస్‌ కు ద‌క్కే మూడు స్థానాల్లో ఒక‌టి సంతోష్‌ కు కేటాయించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ కుటుంబం నుంచి ముగ్గురు ప్ర‌జా ప్ర‌తినిధులు ఉన్న సంగ‌తి తెలిసిందే. నిజామాబాద్ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి కేసీఆర్ త‌న‌య క‌విత‌ - సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి త‌న‌యుడు కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉండంటంతో పాటుగా కేబినెట్ మంత్రిగా కూడా ఉన్నారు. ఆయ‌న మేన‌ల్లుడు హ‌రీశ్‌ రావు సిద్ధిపేట నుంచి ఎమ్మెల్యేగా ఉండి కేబినెట్ మంత్రిగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా సంతోష్ నాలుగో వ్య‌క్తి కానున్నారు. కాగా, ఆ ముగ్గురు ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేసి చ‌ట్ట‌స‌భ‌ల్లోకి రాగా, సంతోష్ నామినేటెడ్ ప‌ద‌వి ద్వారా ఎంపీ కానున్నారు.