Begin typing your search above and press return to search.

మూడోసారి సేమ్ టు సేమ్ గా కేసీఆర్?

By:  Tupaki Desk   |   6 May 2019 8:55 AM GMT
మూడోసారి సేమ్ టు సేమ్ గా కేసీఆర్?
X
కొన్ని విష‌యాల మీద కేసీఆర్ చాలా సీరియ‌స్ గా మాట్లాడ‌తారు. కొత్త కొత్త విష‌యాల్ని తెర మీద‌కు తెస్తుంటారు. అలాంటి కోవ‌లోకే వ‌స్తుంది ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ వ్య‌వ‌హారం. దేశంలో థ‌ర్డ్ ఫ్రంట్ గురించి చ‌ర్చ జ‌రుగుతున్న వేళ‌.. దానికి భిన్నంగా కేసీఆర్ మ‌దిలో పుట్టింది ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌. తాను జాతీయ రాజ‌కీయాల్లో కీల‌క‌భూమిక పోషిస్తాన‌ని చెప్పే ఆయ‌న‌.. అందుకు త‌గ్గ‌ట్లుగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయ‌రు.

జాతీయ రాజ‌కీయాల మీద త‌న గ‌ళాన్ని వినిపించాల‌న్న‌దే కేసీఆర్ లక్ష్య‌మైతే.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారానికి మించిన వేదిక మ‌రొక‌టి దొర‌క‌దు. కానీ.. నాలుగు విడ‌త‌ల పోలింగ్ ముగిసి.. ఐదో విడ‌త పోలింగ్ ఒక‌ప‌క్క జ‌రుగుతున్న వేళ‌.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ మాట కేసీఆర్ నోటి నుంచి మ‌రోసారి వ‌చ్చింది. తాజాగా ఆయ‌న కేర‌ళ ట్రిప్ కు వెళుతున్నారు. ఎందుక‌న్న మాట అడ‌గ‌కుండానే.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంశ‌మై చ‌ర్చ కోస‌మ‌ని ఆయ‌న చెబుతున్నారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ చ‌ర్చ‌ల కోసం కేర‌ళ‌కు వెళ్ల‌టానికి ముందు ఆయ‌న ఒడిశా.. ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రాల‌కు వెళ్లారు. ఆయా రాష్ట్రాల్లో ఆయ‌న ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా మ‌మ‌త కానీ.. న‌వీన్ ప‌ట్నాయ‌క్ కానీ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేసింది లేదు. అదే స‌మ‌యంలో చ‌ర్చ‌ల‌తో పాటు.. ఆయా రాష్ట్రాల్లోని ప్ర‌ఖ్యాత దేవాల‌యాల్ని సంద‌ర్శించ‌టాన్ని మ‌ర్చిపోలేం.

తాజాగా కేర‌ళ ట్రిప్ లోనూ ఆయ‌న పాత‌విధానాన్నే పాటిస్తున్నారు. కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ తో చ‌ర్చ‌ల అనంత‌రం రామేశ్వ‌రం.. శ్రీ‌రంగం ఆల‌యాల్ని సంద‌ర్శించే ప్రోగ్రాం పెట్టుకున్నారు. ప‌శ్చిమ‌బెంగాల్ వెళ్లిన‌ప్పుడు అమ్మ‌వారి దేవాల‌యాన్ని సంద‌ర్శించారు. ఒడిశాలో పూరీ జ‌గ‌న్నాథ టెంపుల్ కు వెళ్లారు. కేసీఆర్ టూర్ పై అప్ప‌ట్లో న‌వీన్ ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ గురించి తాము చ‌ర్చించ‌లేద‌ని.. గుళ్లు ద‌ర్శించుకోవ‌టానికి వ‌చ్చిన‌ట్లుగా ఆయ‌న మాట్లాడారు. తాజాగా కేసీఆర్ షెడ్యూల్ చూస్తే.. సీఎంతో చ‌ర్చ‌తో పాటు.. గుళ్ల ద‌ర్శ‌నం ఉండ‌టం యాదృశ్చిక‌మా లేదంటే.. సీరియ‌స్ చ‌ర్చ‌లా అన్న‌ది చూడాలి.