Begin typing your search above and press return to search.

కేసీఆర్ మెడకు ‘సహారా’ చుట్టుకుంటుందా?

By:  Tupaki Desk   |   29 Oct 2015 4:48 AM GMT
కేసీఆర్ మెడకు ‘సహారా’ చుట్టుకుంటుందా?
X
కేంద్రమంత్రిగా వ్యవహరించిన టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆయనకు కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి. యూపీఏ 1లో కార్మిక మంత్రిగా వ్యవహరించిన ఆయన.. ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఈ మధ్యనే సీబీఐ అధికారులు పలు ప్రశ్నలు వేసిన విషయం తెలిసిందే. ఈఎస్ ఐ ఆసుపత్రి భవనాన్ని మత్య్స శాఖ చేత నిర్మించటం.. ఈ నిర్ణయం కారణంగా దాదాపుగా కోటికి పైగా నిధులు దారి తప్పినట్లుగా సీబీఐ గుర్తించి విచారిస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా సహారా వివాదం కేసీఆర్ మెడకు చుట్టుకునేలా ఉందంటున్నారు.

​నాడు కేంద్రమంత్రి హోదాలో సహారా కంపెనీకి ​కేసీఆర్ అనుచిత ల​బ్దిచేకూ​​రేలా వ్యవహరించారని.. ఈ నిర్ణయం కారణంగా వేలాదిమంది ఉద్యోగులకు నష్టం వాటిల్లిందన్నది ప్రధాన ఆరోపణ. ఒకటి తర్వాత ఒకటిగా కేసీఆర్ మీద వస్తున్న ఆరోపణలు ఆయనకు ఇబ్బంది కలిగించేవే. పుష్కరకాలానికి పైగా తెలంగాణ ఉద్యమంలో ఉన్న కేసీఆర్ పై అవినీతి ఆరోపణలు చేసే పరిస్థితి లేదు. ఆయన నిర్ణయాల్ని ప్రశ్నించింది లేదు. అలాంటిది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గడిచిన 16 నెలల్లో తిరుగులేని సీఎంగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకుంటున్న సమయంలో ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా తాజా ఆరోపణలు ఒకటి తర్వాత ఒకటిగా బయటకు రావటం సంచలనం సృష్టిస్తోంది. తాజాగా కలకలం రేపుతున్న సహారా వివాదం చూస్తే.. కేంద్రమంత్రిగా వ్యవహరించిన సమయంలో కేసీఆర్ తీసుకున్న మరిన్ని నిర్ణయాలు భవిష్యత్తులో ఆయనకు కొత్త తలనొప్పులు తీసుకొస్తాయా? అన్న సందేహం కలగక మానదు.

ఇంతకీ ఈ సహారా వివాదం ఏమిటి? ఇందులో కేసీఆర్ పాత్రమేటి? ఆయన తీసుకున్న నాటి నిర్ణయం నేడు ఎందుకు బయటకు వచ్చింది? దీని వల్ల వచ్చే ఇబ్బందులేమిటి? లాంటి అంశాల్నిచూ​ద్దాం.​

అసలు సహారా వివాదం ఏమిటి?

ఇన్వెస్టర్లు.. డిపాజిటర్ల దగ్గర నుంచి దాదాపు రూ.24వేల కోట్లను సహారా కంపెనీ సేకరించింది. అయితే.. వీటిని చట్టవిరుద్ధంగా సేకరించటం.. ఆ తర్వాత నష్టాల్లో కూరుకుపోవటంతో ఆ సంస్థలో పెట్టుబడి పెట్టిన లక్షలాది మంది భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందన్నది ఆరోపణ. చట్టవిరుద్ధంగా వేలాది కోట్ల రూపాయిలు సేకరించిన నేరానికి ఆ సంస్థ ఛైర్మన్ సుబ్రతోరాయ్ ఏడాదిగా తీహార్ జైల్లో ఉంటున్నారు.

సహారాకు.. కేసీఆర్ కు సంబంధం ఏమిటి?

సహారాకు చెందిన నాలుగు కంపెనీలకు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా నాడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు వివాదం అవుతోంది. సహారా సంస్థకు చెందిన నాలుగు కంపెనీల్లో పని చేసే ఉద్యోగుల పీఎఫ్ సొంతంగా నిర్వహించుకునేందుకు సదరు కంపెనీకి అనుమతి ఇవ్వటం ఇప్పుడు వివాదంగా మారింది.​ అంటే పీఎఫ్ సొమ్ము అన్ని కంపెనీల ఉద్యోగులది గవర్నమెంటు దగ్గర ఉంటే...సహారా కంపెనీ ఉద్యోగులది మాత్రం ఆ కంపెనీ దగ్గరే ఉందన్నమాట.​

కేసీఆర్ మినహాయించిన కంపెనీలేమిటి?

సహారాకు చెందిన నాలుగు కంపెనీలు 1. సహారా ఇండియా ఫైనాన్షియల్ కార్పొరేషన్ 2. సహారా ఇండియా మాస్ కమ్యూనికేషన్ 3. సహారా ఇండియా కమర్షియల్ కార్పొరేషన్ 4. సహారా ఎయిర్ లైన్స్ లిమిటెడ్ కంపెనీలకు చెందిన ఉద్యోగులకు సంబంధించి పీఎఫ్ ఖాతాల్ని సహారా సంస్థే సొంతంగా నిర్వహించేలా కేంద్రమంత్రి హోదాలో కేసీఆర్ నాడు అనుమతి ఇచ్చారు.

కేసీఆర్ మినహాయింపుతో నష్టమేంది?

ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్)కి సంబంధించి కార్మిక శాఖ పర్యవేక్షణలో ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ను నిర్వహిస్తుంది. నిర్దిష్ట సంఖ్యలో ఉద్యోగులున్న ప్రతి సంస్థా పీఎఫ్ ఖాతాలు ​ నిర్వహించడం​ తప్పనిసరి. ప్రతి ఉద్యోగి.. యాజమాన్యం ప్రతి నెలా ఉద్యోగుల నుంచి సేకరించిన పీఎఫ్ మొత్తానికి.. తన వాటా కింద కంపెనీ కొంత మొత్తాన్ని జమ చేయాల్సి ఉంటుంది.

అయితే.. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రభుత్వ రంగ సంస్థలు.. దశాబ్దాలుగా ఆర్థిక క్రమశిక్షణను పాటించే సంస్థలకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ తోసంబంధం లేకుండా సొంతంగా పీఎఫ్ ఖాతాలను నిర్వహించుకునే వెసులుబాటు ఉంటుంది. ఈపీఎఫ్ నుంచి కార్మిక శాఖ మినహాయింపు ఇస్తుంది. అయితే.. సదరు సంస్థ నిర్వహించే పీఎఫ్ ఖాతాలపై ఈపీఎఫ్ ట్రస్ట్ బోర్డు నిరంతరం నిఘా వేస్తుంది. దీనికి సంబంధించి ఫిర్యాదులు ఏమైనా వచ్చినా.. నిర్వహణ లోపాలు కనిపిస్తే ఈ అనుమతుల్ని రద్దు చేస్తుంది.

కేసీఆర్ చేసిన తప్పేంటి?

సహారాకు చెందిన నాలుగు సంస్థలకు సంబంధించిన పీఎఫ్ ఖాతాల నిర్వహణను ఆ సంస్థలే నిర్వహించుకునేలా అనుమతులు ఇవ్వటం. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం కారణంగా.. సహారా సంస్థలు తమ ఉద్యోగుల పీఎఫ్ మొత్తాన్ని (ఉద్యోగుల జీతం నుంచి సేకరించిన మొత్తాన్ని).. కంపెనీ తనకు తానుగా ఇవ్వాల్సిన మొత్తాన్ని తానే నిర్వహించుకునే అవకాశం కలిగింది. ఈ మినహాయింపు కారణంగా సహారా గ్రూపులోని 11 లక్షల మంది ఉద్యోగుల పీఎఫ్ మొత్తం సహారానే నిర్వహించుకునే అవకాశం కలిగింది. ఉద్యోగుల వాటాను.. కంపెనీ చెల్లించాల్సిన వాటాను జమ చేసినా చేయకున్నా అడిగే వాళ్లు లేకుండా పోయారన్నది ఒక ఆరోపణ అయితే.. మరొక అంశం సహారా గ్రూప్ తర్వాతి కాలంలో నష్టాల్లో కూరుకుపోవటం.. ఉద్యోగులకు రావాల్సిన పీఎఫ్ మొత్తాలు నిలిచిపోవటం ఇప్పుడు వివాదంగా మారింది. ఉద్యోగుల పీఎఫ్ లకు సంబంధించి సహారాకు మినహాయింపు ఇవ్వటమే ఇప్పుడు తప్పుగా చెబుతున్నారు.

కేసీఆర్ మీద ఆరోపణలేంటి?

సహారా కంపెనీకి లబ్థి చేకూరేలా కేసీఆర్ వ్యవహరించారన్నది ఆరోపణ. కార్మిక మంత్రిగా సహారా సంస్థ విషయంలో తీసుకుంటున్న నిర్ణయాన్ని.. నాటి సీపీఎఫ్సీగా ఉన్న విశ్వనాథన్ ఏ మాత్రం అంగీకరించలేదు. సహారాకు మినహాయింపు ఇవ్వొద్దని తేల్చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆయన్ను తన వద్దకు పిలిపించుకొని మందలించినట్లుగా చెబుతున్నారు. అయినప్పటికీ కేసీఆర్ చెప్పినట్లుగా విశ్వనాధన్ పని చేయలేదంట. దీంతో.. నాటి కార్మిక శాఖ కార్యదర్శి కేఎం సాహ్నిని సీన్లోకి తీసుకొచ్చి.. ఆగమేఘాల మీద సాహ్ని చేత ఫైల్ తయారు చేసి కేసీఆర్ ఓకే చెప్పటాన్ని ప్రశ్నిస్తున్నారు. సహారా విషయంలో కేసీఆర్ ఎందుకంత ఉత్సాహాన్ని ప్రదర్శించారన్నది ఒక ప్రశ్నగా మారితే.. కేంద్రమంత్రి హోదాలో సహారా విమానాల్లో ఆయన పర్యటించారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఇప్పుడే ఎందుకు బయటకొచ్చింది?

సహారా కంపెనీ దివాళా తీయటం.. లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడటం తెలిసిందే. వారి జీతాల నుంచి మినహాయించిన పీఎఫ్ మొత్తం సహారా కంపెనీలో జమయ్యాయి. ఇప్పుడు ఆ డబ్బుల ఏమయ్యాయన్నది ఒక ప్రశ్న అయితే.. ఉద్యోగులకు కంపెనీ వాటా కింద ఇవ్వాల్సిన మొత్తం మాటేమిటన్నది మరో ప్రశ్నగా మారింది. ఇక.. సంస్థ అధినేత సుబ్రతోరాయ్ తీహార్ జైల్లో మగ్గుతున్నారు. ఏడాదికి పైగా జైల్లో ఉన్న ఆయనకు బెయిల్ కూడా రాలేదు. ఇక.. పీఎఫ్ ఖాతాలు స్తంభించి.. డబ్బులు రాకపోవటంతో ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. ఈ వ్యవహారంపై ఈఫీఎఫ్ ట్రస్ట్ బోర్డుకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సహారా సొంత పీఎఫ్ ఖాతాలో జమ అయిన తమ డబ్బును తిరిగి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని సంస్థ ఉద్యోగులు.. బాధితులు ఈపీఎఫ్ బోర్డును ఆశ్రయించారు. దీంతో.. సదరు బోర్డు సుప్రీంలో ఇంప్లీడ్ పిటీషన్ దాఖలు చేయనుందని చెబుతున్నారు. సహారా చేసే చెల్లింపుల్లో కార్మికుల ఫీఎఫ్ మొత్తాల్ని కూడా చేర్చాలని తాజాగా సుప్రీంను కోరనుందని చెబుతున్నారు. ఈ కారణంగానే నాడు కేంద్రమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వివాదమైంది. మరి.. ఈ వ్యవహారం కేసీఆర్ ను ఏ దరికి చేర్చనుందన్నది ఆసక్తికరంగా మారింది.