Begin typing your search above and press return to search.

కేసీఆర్ చండీయాగానికి ప్రణబ్ దా.. మోడీ

By:  Tupaki Desk   |   26 Oct 2015 5:52 AM GMT
కేసీఆర్ చండీయాగానికి ప్రణబ్ దా.. మోడీ
X
తెలంగాణ సుఖశాంతుల కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడతారని చెబుతున్న ఆయుత చండీయాగానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ యాగానికి భారత రాష్ట్రపతి ప్రణబ్ దా.. ప్రధాని మోడీని ఆహ్వానించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. దాదాపుగా ఐదు రోజులు పాటు సాగే చండీయాగానికి వేర్వేరు రోజుల్లో దేశ రాష్ట్రపతిని.. ప్రధానిని పిలవనున్నారు.

మొదట్లో అనుకున్న విధంగా నవంబరులో కాకుండా డిసెంబరు 23 నుంచి 27మధ్య చండీయాగాన్ని నిర్వహిస్తారని చెబుతున్నారు. ఈ సమయంలో అయితే.. రాష్ట్రపతి ప్రణబ్ సైతం హైదారాబాద్ లోనే ఉంటారని.. ఆయన రాకపోకలకు ఇబ్బంది ఉండదని భావిస్తున్నట్లగా తెలుస్తోంది.

చండీయాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో దీని నిర్వహణ బాధ్యతలు ఏదైనా మఠానికి ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తనకు అత్యంత సన్నిహితుడైన జీయర్ స్వామి సలహాలతో కేసీఆర్ అడుగు ముందుకేయనున్నట్లు చెబుతున్నారు. చండీయాగం శైవానికి సంబంధించింది కావటం.. జీయర్ స్వామి వైష్ణవ స్వాములోరు కావటంతో.. తెర వెనుక నుంచి సలహాలు.. సూచనలు ఇవ్వగలుగుతారే తప్పించి.. ప్రత్యక్షంగా వచ్చి పాల్గొనే అవకాశం ఉండదు. భారీ ఎత్తున భావోద్వేగాల్ని ప్రభావితం చేసే ఈ చండీయాగంతో భారీ లబ్థి చేకూరాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తోన్నట్లు ఆయనకు సన్నిహితంగా ఉండేవారు చెబుతున్నారు.