Begin typing your search above and press return to search.

కేసీఆర్ మెరుపు వ్యూహాం...ఢిల్లీలో ధ‌ర్నా

By:  Tupaki Desk   |   9 March 2018 5:57 AM GMT
కేసీఆర్ మెరుపు వ్యూహాం...ఢిల్లీలో ధ‌ర్నా
X
దేశ రాజ‌కీయాలపై క‌న్నేసిన తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఈ క్ర‌మంలో త‌న దూకుడును మ‌రింత పెంచుతున్నారు. త‌న ఢిల్లీ రీ ఎంట్రీ అదిరిపోయేలా ఉండేందుకు గులాబీ ద‌ళ‌ప‌తి స్కెచ్ వేశారు. ఏకంగా ఢిల్లీలోనే ధ‌ర్నా చేయాల‌ని డిసైడ‌య్యార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. అయితే త‌న దూకుడుతో ఎక్క‌డా ఇబ్బందులు ప‌డ‌ని ఆలోచ‌న‌ను సైతం కేసీఆర్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. పార్టీ వ‌ర్గాల సమాచారం ప్ర‌కారం ప్రధానితో సమావేశం కావడం లేదంటే ఢిల్లీలోని ‘జంతర్ మంతర్’ దగ్గర ‘మహా ధర్నా’ పేరుతో భారీ స్థాయిలో నిరసన వ్యక్తం చేసే కార్యక్రమానికి వ్యూహం రచిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు వచ్చే నెల 6వ తేదీతో ముగుస్తున్నందున ఆ లోపే ‘ఛలో ఢిల్లీ’ - ‘మహా ధర్నా’లను నిర్వహించాలని భావిస్తున్నారు.

విద్య - ఉపాధి రంగాలు ‘రాష్ట్రాల జాబితా’లో ఉన్నందున వాటిలో రిజర్వేషన్లు కల్పించే అంశం కూడా కేంద్ర పరిధి నుంచి తప్పించి రాష్ట్రాల జాబితాలో చేర్చాలని కెసిఆర్ డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగంలోని 46వ అధికరణాన్ని సవరించాలని, రాష్ట్రాల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాష్ట్రాలకే ఉండే విధంగా వెసులుబాటు కల్పించాలని అభిప్రాయపడుతున్నారు. టీఆర్‌ ఎస్ ఎంపిలు సైతం గత నాలుగు రోజులుగా రిజర్వేషన్ల అంశంపై పార్లమెంటులో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోవడంతో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడే ఢిల్లీకి వెళ్ళి ఒత్తిడిని మరింత పెంచే విధంగా తగిన కార్యాచరణపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే తేదీ ఖరారుకానుంది.

ఇందుకు తాజా ప‌రిణామం కూడా తోడైంది. మైనారిటీలకు - గిరిజనులకు రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపినా కేంద్ర ప్రభుత్వం 50% కోటా పేరుతో ఆమోదం తెలపకుండా తిరిగి రాష్ట్రానికి పంపడంపై కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన రిజర్వేషన్ పెంపు బిల్లును కేంద్ర హోం మంత్రిత్వశాఖ పరిధిలోని డివోపిటి (సిబ్బంది శిక్షణ వ్యవహారాల విభాగం) అధ్యయనం చేసి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50% దాటరాదని, అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఈ పరిమితిని మించి ఇవ్వడం సాధ్యమవుతుందని, తెలంగాణ ప్రభుత్వ చట్టంలో అలాంటి ‘అసాధారణ’ అంశాలు లేవని కొన్ని కొర్రీలు వేసి తిప్పి పంపింది. కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన ఈ కొర్రీలకు సమాధానాలు పంపడంపై సిఎం కెసిఆర్ ప్రగతిభవన్‌ లో గురువారం సంబంధిత అధికారులతో చర్చించారు. కేంద్రం అడిగిన వివరాలకు ధీటైన సమాధానాలను పంపాలని నిర్ణయం జరిగింది.

ఇదే స‌మ‌యంలో త‌న ఉద్య‌మ జెండాను సైతం కేసీఆర్ ముందుకు తీసుకుపోతున్నారు. భావసారూప్యత కలిగిన పలు జాతీయ - ప్రాంతీయ పార్టీల మద్దతును కూడగట్టాలని భావిస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో తన వాణిని వినిపించాలని, రాష్ట్రంలోని అన్ని పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులను ఢిల్లీకి తీసుకెళ్ళాలని కేసీఆర్ అనుకుంటున్నారు. అవసరమైతే జంతర్‌మంతర్ వేదికగా జరిగే ‘మహా ధర్నా’లో పలు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను కూడా ఆహ్వానించాలని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో వ‌చ్చే నెల‌లో కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నార‌ని స‌మాచారం.