Begin typing your search above and press return to search.

అలర్ట్ కేసీఆర్ : బాబుతో జర జాగ్రత్త

By:  Tupaki Desk   |   30 April 2018 4:16 AM GMT
అలర్ట్ కేసీఆర్ : బాబుతో జర జాగ్రత్త
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కొత్త జాతీయ కూటమిని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ కూటమికి వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టడం కోసం ఆయన ముమ్మరంగా పర్యటనలు చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో తిరిగి పార్టీల నాయకులతో మాట్లాడుతున్నారు. సంఘీభావం కోరుతున్నారు. ఇలాంటి ప్రయత్నాల్లో భాగంగా ఆయన ఆదివారం నాడు చెన్నై వెళ్లి అక్కడ ప్రతిపక్షం ప్రస్తుతం యూపీఏలో కాంగ్రెస్ జట్టులో ఉన్న డీఎంకే అధినేత కరుణానిధి, ఆయన కుమారుడు స్టాలిన్ లతో చర్చలు జరిపి వచ్చారు.

కేసీఆర్ చెన్నై పర్యటన లో ట్విస్టు ఏంటంటే.. ఈ కూటమికి మద్దతు కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కూడా భేటీ అవుతానంటూ కేసీఆర్ అక్కడ వెల్లడించారు. అయితే ఆయన ఈ ప్రతిపాదన పట్ల గులాబీ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ సీనియర్లు కూడా కేసీఆర్ ఇలాంటి ప్రతిపాదన చేసారేమిటా? అని విస్తుపోతున్నారు. తెలుగుదేశం నుంచి తెరాసలోకి వచ్చిన వాళ్లు, చంద్రబాబునాయుడు మనస్తత్వం, ఆయన వైఖరి పూర్తిగా తెలిసిన వాళ్లు అనేక మంది ఉన్నారు. అలాంటి సీనియర్లు.. కేసీఆర్ ఇంత అనాలోచితంగా ఎలా మాట్లాడారా? అని ఆశ్చర్యపోతున్నారు. ‘చంద్రబాబుతో జర జాగ్రత్త’ అంటూ తమ అధినేతకు హితవు చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు.

చంద్రబాబునాయుడుతో కేసీఆర్ కు స్వయంగా కూడా కొన్ని చేదు అనుభవాలు ఉఎన్నాయి. 2009 ఎన్నికల సమయంలో అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న సమయంలో తెలంగాణలో నెగ్గడం కోసం చంద్రబాబునాయుడు కేసీఆర్ తో ఒక డీల్ కుదుర్చుకున్నారు. తెదేపా- తెరాసల మధ్య పొత్తు కుదిరింది. ఇద్దరూ కలిసి పోటీచేసినప్పటికీ.. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి హవా ముందు నిలవలేకపోయారు. ఓటమి తప్పలేదు. ఓటమి దక్కిన వెంటనే.. చంద్రబాబు తెరాసతో బంధానికి తూచ్ అనేశారు. వారితో జతకలిసి తాను తప్పు చేశానని, లేకుంటే గెలిచేవాడినని బీరాలు పలికారు. అలాంటి నాయకుడితో ఎలా పొత్తు పెట్టుకుంటారంటూ.. ఇప్పుడు కేసీఆర్ కు హితవచనాలు వినవస్తున్నాయి.

పైగా చంద్రబాబు ఇప్పటిదాకా ఏ ఒక్కరితోనూ నిలకడగా స్నేహం చేయలేదని.. ఒక్క కాంగ్రెస్ తప్ప.. అన్ని పార్టీలతోనూ తన అవసరం కోసం స్నేహం చేయడం, తన అవసరం తీరగానే.. వారిని నట్టేట ముంచేసి పోవడం ఆయన వైఖరి అని.. అలాంటి నేతను నమ్మి.. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కోసం ఎలా సంప్రదిస్తారనే కామెంట్స్ తెరాసలో వినిపిస్తున్నాయి.