Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఢిల్లీ టూర్‌..వ‌యా విశాఖ‌...భువ‌నేశ్వ‌ర్‌

By:  Tupaki Desk   |   21 Dec 2018 10:13 AM GMT
కేసీఆర్ ఢిల్లీ టూర్‌..వ‌యా విశాఖ‌...భువ‌నేశ్వ‌ర్‌
X
తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ ర‌థ‌సార‌తి క‌ల్వ‌కుంట్ల‌ చంద్రశేఖర్ రావు మ‌రో కీల‌క‌మైన ప‌రిణామంతో అంద‌రి దృష్టిని త‌న‌వైపు తిప్పుకొంటున్నారు. త‌న జాతీయ ఎజెండా అయిన ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌ లో భాగంగా కీల‌క టూర్ పెట్టుకున్నారు. ఈ నెల 23 నుంచి ఆంధ్రప్రదేశ్ - ఒడిశా - పశ్చిమ బెంగాల్ - దేశ రాజధాని న్యూ ఢిల్లీలో పర్యటించనున్నారు. టీఆర్ ఎస్ పార్టీ కోసం నెల రోజుల పాటు ఒప్పందం కుదుర్చుకున్న ప్రత్యేక విమానంలో ఈ టూర్లు చేయ‌నున్నారు. కీల‌క‌మైన పార్ల‌మెంటు స‌మావేశాల సంద‌ర్భంగా ఈ టూర్ ఆస‌క్తిక‌రంగా మారింది.

విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు ఈ నెల 23న ఉదయం 10గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి విశాఖపట్నం బయలుదేరుతారు. విశాఖలో శారదా పీఠాన్ని సందర్శిస్తారు. పీఠంలోని రాజశ్యామల దేవాలయంలో ప్రత్యేక పూజలు జరుపుతారు. స్వామి స్వరూపానందేంద్ర స్వామీజీ ఆశీస్సులు తీసుకుంటారు. ఆశ్రమంలోనే మధ్యాహ్న భోజనం చేస్తారు. ఆ తర్వాత విశాఖ విమానాశ్రయం నుండి ఒడిశా రాజధాని భువనేశ్వర్ బయలుదేరుతారు. సాయంత్రం 6గంటలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో ఆయన నివాసంలోనే సమావేశం అవుతారు. ఆ రోజు సీఎం అధికార నివాసంలోనే బస చేస్తారు. 24న ఉదయం రోడ్డు మార్గం ద్వారా కోణార్క్ దేవాలయం సందర్శిస్తారు. అనంతరం జగన్నాథ దేవాలయాన్ని సందర్శిస్తారు. పూజల అనంతరం భువనేశ్వర్ చేరుకుని మధ్యాహ్న భోజనం చేస్తారు.

ఆ మ‌రుస‌టి రోజు అక్కడ నుండి ప్రత్యేక విమానంలో కోల్ కతా వెళ్తారు. సాయంత్రం 4గంటలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశం అవుతారు. అనంతరం కాళీమాత దేవాలయాన్ని సందర్శిస్తారు. అదేరోజు రాత్రి ఢిల్లీకి వెళ్తారు. 25వ తేదీ నుండి రెండు, మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలుస్తారు. కేంద్ర ఎన్నికల కమిషనర్‌ తో సమావేశం అవుతారు. బీఎస్పీ అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతితో సమావేశం అవుతారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తోనూ సమావేశం అవుతారు. పలువురు కేంద్ర మంత్రులను కలుసుకుని రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తారని స‌మాచారం. కాగా, కేసీఆర్ తాజా టూర్ మ‌రోమారు చ‌ర్చనీయాంశంగా మారింది.