Begin typing your search above and press return to search.

చెన్నైలో ఏ గుడికి వెళుతున్నారు కేసీఆర్‌?

By:  Tupaki Desk   |   29 April 2018 5:16 AM GMT
చెన్నైలో ఏ గుడికి వెళుతున్నారు కేసీఆర్‌?
X
నాలుగేళ్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ పాల‌న‌ను నిశితంగా ప‌రిశీలిస్తున్న వారంతా ఒక ఆస‌క్తిక‌ర విష‌యాన్ని చెబుతుంటారు. ప్ర‌తి రెండు.. మూడు నెల‌ల‌కు ఓసారి ఒక కొత్త విష‌యాన్ని తెర మీద‌కు తీసుకొచ్చి.. తెలంగాణ రాష్ట్రంతో పాటు.. ఏపీలోనూ స‌ద‌రు అంశం మీద చ‌ర్చ జ‌రిగేలా చేస్తారు. నిద్ర లేచింది మొద‌లు కేసీఆర్ ను ఆడిపోసుకోవ‌ట‌మే త‌ప్పించి మీకు ఇంకేం ప‌ని లేదా? అని కేసీఆర్ ను వీర‌గా అభిమానించే వారు తిట్టొచ్చు. కానీ.. నిజాయితీతో చెక్ చేస్తే కేసీఆర్ లో కొత్త కొత్త కోణాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి.

ఎప్పుడో నాలుగేళ్ల కింద‌టి మాట చెబితే గుర్తుండ‌క‌పోవ‌చ్చు. కొద్ది నెల‌ల క్రితం జ‌రిగిన రెండు ఉదంతాల గురించి చెబితే కేసీఆర్ టాలెంట్ అర్థ‌మైపోతుంది. గొర్రెల‌తో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ముఖ‌చిత్రం మారిపోవ‌ట‌మే కాదు.. క్యాలండ‌ర్లో డేట్లు మారినంత‌నే.. వేలాది కోట్లు తెలంగాణ‌ను ముంచెత్తుతాయంటూ గొర్రెల ప‌థ‌కాన్ని షురూ చేసిన‌ట్లు చెప్పారు.

కేసీఆర్ గొర్రెల ప‌థ‌కం మాట‌లు విన్న‌ప్పుడు.. దేశంలో ఇంత మంది నేత‌లు ఉన్నారు. ఎవ‌రికి రాని అద్భుత‌మైన ఐడియా కేసీఆర్‌కు వ‌చ్చేసింది. ఇక చూసుకోండి.. తెలంగాణ రాష్ట్రంలో ఎక్క‌డ చూసినా గొర్రెలే.. అదేనండి డ‌బ్బులే డ‌బ్బులు. ఇప్ప‌టివ‌ర‌కూ చేసిన‌.. చేస్తున్న ఉద్యోగాల్ని వ‌దిలేసి గొర్రెల పెంప‌కం లోకి షిఫ్ట్ అయిపోతే బాగుండ‌ని ఆలోచించినోళ్లు ఉన్నారు.

గొర్రెల‌తో ల‌క్ష‌ల కోట్లు సంపాదించే వైనాన్ని ప‌క్క‌న పెట్టేసి.. తెలుగు భాషా వికాసానికి.. తెలుగుకు అంత‌ర్జాతీయ కీర్తిని తీసుకొచ్చేందుకు భారీ ప్లాన్ అని చెప్ప‌ట‌మే కాదు.. త‌న మాష్టారి కాళ్ల‌కు బ‌హిరంగంగా మొక్కిన కేసీఆర్ ను చూసిన‌ప్పుడు.. ఉంటే.. గింటే ఇలాంటి సీఎం ఉండాల‌ని చాలామందికి అనిపించింది.

అంత‌ర్జాతీయ తెలుగు భాషా దినోత్స‌వాన్ని నిర్వ‌హించిన కేసీఆర్‌.. ఆంధ్రాలోని తెలుగువారిని క‌ల‌ప‌కుండానే ఏదేదో సాధిస్తానంటూ భావోద్వేగంతో చెప్పిన ప్రారంభ ఉప‌న్యాసానికి.. చివ‌రి రోజున జ‌స్ట్ వారం.. ప‌ది రోజుల్లో అద్భుతం చేసేయ‌నున్న‌ట్లుగా చెప్పి ఊరించారు.

కేసీఆర్ చెప్పిన వారాలు చాలానే గ‌డిచిపోయాయి. తెలుగు భాష మీద ఆయ‌న చెప్పిన మాట‌లు ప‌క్క‌కు వెళ్లిపోయాయి. ఇప్పుడు ఫెడ‌ర‌ల్ ముచ్చ‌ట‌లో ప‌డిపోయారు కేసీఆర్‌. ఇప్పుడు ఆయ‌న్ను క‌దిలిస్తే చాలు.. దేశానికి కాంగ్రెస్‌.. బీజేపీలు చేసిన ద్రోహాల గురించి గుక్క తిప్పుకోకుండా చెబుతున్నారు. ఈ రెండు పార్టీల‌కుధీటుగా తాను ఏర్పాటు చేసే ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ గురించి చాలానే చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఏం జ‌రుగుతుంద‌న్న‌ది ప‌క్క‌న పెడితే.. త‌న ఫెడ‌ర‌ల్ స్టోరీ చెప్ప‌టానికి కొన్ని రాష్ట్రాల్లో ప‌ర్య‌టిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. కేసీఆర్ నోటి నుంచి ఫెడ‌ర‌ల్ మాట‌లు వ‌స్తుంటే.. ఆయ‌న ప‌ర్య‌టించిన రాష్ట్రాల్లోని నేత‌లు మాత్రం అందుకు భిన్నంగా ఆయా రాష్ట్రాల్లోని దేవాల‌యాల్ని సంద‌ర్శించ‌టానికి కేసీఆర్ వ‌స్తున్నార‌ని.. ప‌నిలో ప‌నిగా త‌మ అధినేత‌ను క‌లుస్తున్న‌ట్లు చెబుతున్నారు. బెంగ‌ళూరులో భేటీ అయిన దేవ‌గౌడ మిన‌హా మిగిలిన రాష్ట్రాల ప‌ర్య‌ట‌న‌లో దేవాల‌యాల్ని కేసీఆర్ సంద‌ర్శిస్తున్నారు.

తాజాగా న‌డుస్తున్న చెన్నై ప‌ర్య‌ట‌న‌ను చూస్తే.. ఒక పూట‌లో వెళ్లి వ‌చ్చే కార్య‌క్ర‌మం కాస్తా.. ఒక రోజు ఉండిపోవ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఆదివారం ఉద‌యం చెన్నై వెళ్లే కేసీఆర్‌.. డీఎంకే అధినేత క‌రుణానిధిని క‌లవ‌నున్నారు. త‌ర్వాత స్టాలిన్ తో భేటీ అయితే స‌రి. కానీ.. అందుకు భిన్నంగా ఆదివారం రాత్రి చెన్నైలో బ‌స చేయ‌నున్న కేసీఆర్‌.. సోమ‌వారం స్టాలిన్ ను క‌లిసి హైద‌రాబాద్‌ కు రిట‌ర్న్ రానున్నారు. సీఎం షెడ్యూల్ గురించి విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో సైతం.. క‌రుణ‌.. స్టాలిన్ భేటీల గురించి చెప్పుకొస్తూనే.. మ‌రికొంద‌రిని క‌ల‌వ‌టంతో పాటు.. మ‌రికొన్ని కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటార‌ని పేర్కొన్నారు. కానీ.. ఆ డిటైల్స్ మాత్రం రివీల్ చేయ‌లేదు. బ‌య‌ట‌కు రాని కార్య‌క్ర‌మాల్లో ఏదైనా గుడికి వెళ్లే ప్రోగ్రాం ఉందా? అలాంటి వివ‌రాలు బ‌య‌ట‌పెట్ట‌టానికి త‌మిళ మీడియా ఉండనే ఉందిగా.