Begin typing your search above and press return to search.

కేసీఆర్ మాటంటే మాటే బై...!

By:  Tupaki Desk   |   29 Nov 2019 8:22 AM GMT
కేసీఆర్ మాటంటే మాటే బై...!
X
మాకు న‌కిలీ మాట‌లు చెప్పుడు రాదు. యూనియ‌న్లు ప్రతిపక్షాల మాట వినవద్దని - వాళ్లు చలిమంటలు కాచుకుంటారని - జరుగకూడనిది జరిగితే సారీ చెప్పి పోతారు తప్ప ఏమీ చేయలేరని ఆర్టీసీ కార్మికుల‌కు ముందే చెప్పాను. టెంట్ వేస్తే మాట్లాడిపోతారు తప్ప ఆర్చరు తీర్చరు అని చెప్పిన. అమాయకులైన కార్మికులకు లేనిపోని ఆశలు కల్పించి బజారున పడేసి పోయారు.కానీ మేం అట్ల చేయం. వాళ్ల క‌ష్టాల‌న్నీ తీరుస్తాం`` ఆర్టీసీ స‌మ్మెకు ముగింపు ప‌లుకుతున్న స‌మ‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన కామెంట్లు ఇవి. ఆర్టీసీ ప‌రిస్థితి గురించి కార్మికులతో రాబోయే ఐదారు రోజుల్లో స్వ‌యంగా మాట్లాడుతాన‌ని మాట ఇచ్చిన కేసీఆర్ ఈ మేర‌కు దాన్ని నిల‌బెట్టుకున్నారు. వ‌చ్చే ఆదివారం షెడ్యూల్ ఖ‌రారు చేశారు.

`ఆర్టీసీ సంస్థలో ఏం జరుగుతున్నదో యూనియన్ నాయకులు చెప్తున్నరో లేదో నాకైతే డౌటు! వాళ్ల ఆర్థిక పరిస్థితుల గురించి - బస్సుల గురించి కార్మికులకు తెలుసా తెలియదా? యూనియన్ నిషాల పడి కొట్టుకపోతున్నారా తెలియదు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితులు - బస్సుల కండిషన్లు - అప్పులు - మంచి చెడ్డలు - ఇతర అంశాలకు సంబంధించిన డాక్యుమెంట్‌ ను తెలుగులో ప్రింట్ చేసి 49వేల కార్మికులకు ఇవ్వాలని ఆర్టీసీ ఎండీకి చెప్పిన. చదువుకోండి.. వాస్తవాలు తెలుసుకోండి.. ప్రిపేర్ అయి నేను పిలిచే మీటింగ్‌ కు రండి.. అందరం కలిసి మాట్లాడి భోజనం చేసి నిర్ణయం తీసుకుందాం.`అని ప్ర‌క‌టించిన కేసీఆర్‌...ఈ మేర‌కు డిసెంబ‌ర్1వ తేదీన మీటింగ్ తేదీగా ప్ర‌క‌టించారు.

తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 97 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులతో డిసెంబర్1 ఆదివారం ప్రగతి భవన్ లో సమావేశం కావాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యించిన‌ట్లు సీఎం కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఈ స‌మావేశానికి ప్రతీ డిపో నుంచి ఐదుగురు కార్మికులను ఈ సమావేశానికి ఆహ్వానించాలని - వారికి తగు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీని సీఎం ఆదేశించారు. సమావేశానికి పిలిచే ఐదుగురిలో ఖచ్చితంగా ఇద్దరు మహిళా ఉద్యోగులుండాలని - అన్ని వర్గాలకు చెందిన కార్మికుల భాగస్వామ్యం ఉండేలా చూడాలని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. డిసెంబర్ 1న మద్యాహ్నం 12 గంటల వరకు కార్మికులను ప్రగతి భవన్ తీసుకురావాలని - వారికి ప్రగతి భవన్‌ లోనే మద్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నామ‌ని కేసీఆర్ వివ‌రించారు. మ‌ధ్యాహ్న భోజనం అనంతరం కార్మికులతో సీఎం కేసీఆర్‌ నేరుగా మాట్లాడనున్నారు. ఆర్టీసీకి సంబంధించిన అన్ని విషయాలను కూలంకశంగా కేసీఆర్ చర్చించనున్నారు. ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్‌ తో పాటు - ఆర్టీసీ ఎండీ - ఈడీలు - ఆర్.ఎం.లు - డీవిఎంలను ఆహ్వానించారు.