Begin typing your search above and press return to search.

అమ్మ స్ఫూర్తిగా.. ‘‘తెలంగాణ’’ బ్రాండ్?

By:  Tupaki Desk   |   13 Feb 2016 4:01 AM GMT
అమ్మ స్ఫూర్తిగా.. ‘‘తెలంగాణ’’ బ్రాండ్?
X
తనను అభిమానంతో అందరూ పిలుచుకునే ‘‘అమ్మ’’ను ఒక బ్రాండ్ గా మార్చి రాజకీయం చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పూర్తిగా తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. అయితే.. ‘అమ్మ’లా కాకుండా.. మరింత భావోద్వేగాల్ని రగిలించేలా.. విమర్శల దరి చేరకుండా ఉండేలా తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నారు. నిత్యవసర వస్తువులకు సంబంధించి అమ్మకాలు చేపట్టాలని.. వీటన్నింటిని ‘‘తెలంగాణ’’ బ్రాండ్ తో రూపొందించాలన్న తన ఆలోచనను అధికారులకు చెప్పారు.

ఇటీవల కాలంలో ప్రతి వస్తువలోనూ ఏదో ఒక కల్తీ జరగటం? దాన్ని ఎలా చెక్ చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో.. ప్రభుత్వమే ‘తెలంగాణ’ బ్రాండ్ తో పసుపు.. కారం.. అల్లం.. చిన్నఉల్లి.. తదితర మసాలాలు.. సుగంధ ద్రవ్యాల్ని ప్యాక్ చేసి అమ్మకాలు జరిపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల కాలంలో పాల నుంచి ప్రతి వస్తువులోనూ కల్తీ చోటు చేసుకుంటున్న పరిస్థితుల్లో.. అందుకు భిన్నంగా నాణ్యతతో కూడిన వస్తువల్ని.. అందుబాటు ధరల్లో అందించటం ద్వారా రెండు ప్రయోజనాల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది.

ఒకటి నాణ్యమైన ఆహారోత్పత్తుల్ని అందించటం.. రెండోది ధరల విషయంలో ప్రజలకు ఉపశమనం కలిగేలా చేయటం. ఇందుకోసం మెదక్ జిల్లాలోని ములుగు మండలం తున్కి బొల్లారం గ్రామం వద్ద 200 ఎకరాల్లో ఆహార పార్క్ ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. వీటన్నింటికి తోడు తెలంగాణ ప్రజల అవసరాలకు సరిపడా పూలు.. పండ్లు.. కాయగూరల్ని వీలైనంత వరకూ తెలంగాణలోనే పండించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.