Begin typing your search above and press return to search.

గవర్నర్ పరిధికి కేసీఆర్ కోత వేయనున్నారా?

By:  Tupaki Desk   |   22 July 2015 4:26 AM GMT
గవర్నర్  పరిధికి కేసీఆర్ కోత వేయనున్నారా?
X
కొత్త కొత్తగా ఆలోచించటం కొత్త రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రమే సాధ్యం. ఆ మధ్య మంత్రి వర్గంలోకి మంత్రులుగా తీసుకోవటానికి అవకాశం లేని నేతలకు.. చట్టం అడుగు పొరల్లో ఎక్కడో ఉన్న పార్లమెంటు కార్యదర్శుల పేరిట క్యాబినెట్ హోదా కల్పించి రాజకీయ పంపకాలు చేపట్టటం తెలిసిందే. ఆ తర్వాత హైకోర్టు వేసిన మొట్టికాయతో వెనక్కి తగ్గటం వేరే సంగతి.

కొత్తగా ప్రయత్నించే వారికి ఎదురు దెబ్బలు తప్పవు. అందులోకి రాజకీయాల్లో దూకుడుగా దూసుకుపోయే కేసీఆర్ లాంటి నేతల నిర్ణయాలకు కొన్ని విమర్శలు ఎదురైనా.. కొంగొత్తగా ఆలోచించే విధానాన్ని మాత్రం ఆయన వదిలిపెట్టటం లేదు. తాజాగా ఆయన దృష్టి తెలంగాణలోని యూనివర్సిటీల మీద పడింది.

ఇప్పటివరకూ అనుసరిస్తున్న విధానం ప్రకారం అన్ని యూనివర్సిటీలకు కులపతి (ఛాన్సెలర్)గా గవర్నర్ వ్యవహరిస్తుంటారు. అన్ని వర్సిటీలకు గవర్నర్ కులపతిగా వ్యవహరిస్తుంటారు. తాజాగా అలాంటి విధానాన్ని మార్చాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా చెబుతున్నారు. అన్ని వర్సిటీల కులపతిగా వ్యవహరిస్తున్న గవర్నర్.. నిర్వహణ విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని.. అన్ని వర్సిటీల మీద దృష్టి పెట్టేందుకు సమయం సరిపోదని.. అదే సమయంలో.. ప్రతి వర్సిటీకి ఒక్కో కులపతిని నియమిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేశారు.

తన ఆలోచనను అమలు చేయటానికి కొత్త చట్టం రూపొందించాల్సి ఉంది. దీనిపై తెలంగాణ సర్కారు కసరత్తు మొదలెట్టింది. ఒకవేళ.. కేసీఆర్ ఆలోచన కానీ అమల్లోకి వస్తే.. గవర్నర్ పరిధి భారీగా కోత పడనుంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టి 14 నెలలు అవుతున్నా.. ఇప్పటివరకూ అన్ని వర్సిటీలకు ఉప కులపతుల నియామకమే పూర్తి చేయలేదు. కానీ.. తాజాగా ఉప కులపతుల కోసం సెర్చ్ కమిటీలను వేసిన ఆయన.. కులపతుల వ్యవస్థను మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ కసరత్తు ముగిసి.. చట్టం ఏర్పడితే గవర్నర్ పరిధి కాస్త కుదించటమే కాదు.. కాసిన్ని కొత్త పదవులు (కులపతులుగా) అందుబాటులోకి వచ్చేసే వీలుందని చెబుతున్నారు.