Begin typing your search above and press return to search.

కేసీఆర్ వెన‌క‌గుడు లేదు!..రెవెన్యూతో పాటు క‌లెక్ట‌రూ గ‌ల్లంతే!

By:  Tupaki Desk   |   26 April 2019 12:14 PM GMT
కేసీఆర్ వెన‌క‌గుడు లేదు!..రెవెన్యూతో పాటు క‌లెక్ట‌రూ గ‌ల్లంతే!
X
తెలంగాణ‌లో వ‌రుస‌గా రెండో సారి అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన టీఆర్ ఎస్ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు... ఏకంగా రెండు నెల‌ల పాటు కేబినెట్ అన్న‌దే లేకుండా లాగించేశారు. విప‌క్షాలు విమ‌ర్శిస్తున్నా లెక్క చేయ‌ని కేసీఆర్‌... తాను అనుకున్న స‌మ‌యానికే త‌న కేబినెట్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఆ త‌ర్వాత కూడా కేసీఆర్ అంత‌గా వేగంగా సాగుతున్న దాఖ‌లాలు అయితే క‌నిపించ‌లేదు. ఈ నిదానం నిన్నటిదాకానే. ఇప్పుడు కేసీఆర్ వేగం పెంచేశారు. ఎంత స్పీడుగా అంటే... గ‌తంలో తాను తీసుకున్న నిర్ణ‌యాలను అమ‌లు చేసే దిశ‌గా ఆయ‌న చాలా వేగంగానే సాగుతున్నారు. ఈ విష‌యంలో త‌న‌కు ఎదుర‌య్యే ప‌రిణామాలు కంటి ముందే క‌నిపిస్తున్నా కూడా కేసీఆర్ వెన‌క్కి త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు. ఎప్పుడో తాను ప్ర‌తిపాదించిన ఇంట‌ర్ బోర్డు ర‌ద్దుకు ఇప్పుడు అనుకోకుండా వ‌చ్చిన అవ‌కాశంతో ఆ నిర్ణ‌యాన్ని అమ‌లు చేసేందుకు దాదాపుగా రంగం సిద్ధం చేశారు.

తాజాగా రెవెన్యూ శాఖ స‌మూల ప్ర‌క్షాళ‌న దిశ‌గా అడుగులు వేస్తున్న కేసీఆర్‌.... అందులోనూ స్పీడ్ పెంచేశారు. రెవెన్యూ శాఖ‌ను ఏకంగా ర‌ద్దు చేసే దిశ‌గా సాగుతున్న కేసీఆర్ నిర్ణ‌యాన్ని రెవెన్యూ యంత్రాంగం తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది. రెవెన్యూ శాఖ‌ను ర‌ద్దు చేస్తే స‌హించేది లేద‌ని - కేసీఆర్ కు వ్య‌తిరేకంగా రోడ్డెక్కుతామంటూ రెవెన్యూ యంత్రాంగం ఇప్ప‌టికే హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. అయితే హెచ్చరిక‌లు - బెదిరింపుల‌కు కేసీఆర్ భ‌య‌ప‌డే ర‌కం కాదు క‌దా. అందుకే రెవెన్యూ శాఖ ప్ర‌క్షాళ‌న కోసం ఆయ‌న ఓ అత్యున్న‌త స్థాయి క‌మిటీని రంగంలోకి దింపేశారు. ఈ క‌మిటీ రెవెన్యూ శాఖ ప్ర‌క్షాళ‌న‌కు సంబంధించి స‌మ‌గ్ర అధ్య‌య‌నం చేయ‌డంతో పాటు నివేదిక‌ను సిద్ధం చేసింద‌ని, ఇటీవ‌లే దానిని కేసీఆర్ కు అంద‌జేసింద‌ని తెలుస్తోంది.

ఈ క‌మిటీ ఏఏ ప్ర‌తిపాద‌న‌లు చేసింద‌న్న విష‌యానికి వ‌స్తే... రెవెన్యూ శాఖ‌ను పూర్తిగా ర‌ద్దు చేయాల్సిందేన‌ని తేల్చేసింద‌ట‌. రెవెన్యూ శాఖ ప్ర‌స్తుతం నిర్వ‌ర్తిస్తున్న ప‌లు విధుల‌ను పంచాయ‌తీరాజ్‌, వ్య‌వ‌సాయ శాఖ‌ల‌కు బ‌దిలీ చేయాల‌ని, ఇకపై రెవెన్యూ శాఖ పేరును భూ రికార్డులు, యాజ‌మాన్య నిర్వ‌హ‌ణ శాఖ‌గా మార్చేయాల‌ని సూచించింద‌ట‌. ఇక జిల్లా ప‌రిపాల‌న‌లో కీల‌క‌మైన క‌లెక్ట‌ర్ పోస్టుకు ఆ పేరును ర‌ద్దు చేసేయాల‌ని, ఇక‌పై క‌లెక్ట‌ర్ పోస్టును జిల్లా ప‌రిపాల‌కుడు, లేదంటే జిల్లా న్యాయాధికారి (డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌)గా మార్చేయాల‌ని సూచించింది. ఇత‌ర రాష్ట్రాల్లో జిల్లా క‌లెక్ట‌ర్ ను డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గా పిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలో తెలంగాణ‌లోనూ ఈ పేరును మార్చేయాల‌ని క‌మిటీ సూచించింద‌ట‌.

అయినా రెవెన్యూ శాఖ‌, జిల్లా క‌లెక్ట‌ర్ పేర్ల‌ను బ్రిటిష్ యంత్రాంగం కొన‌సాగించింద‌ని, నాడు భూమి శిస్తు విధానం అమ‌లులో ఉండేది క‌దా. ఆ వ్య‌వ‌హారాల‌ను చూస్తున్న శాఖ‌ను రెవెన్యూగా పిలిస్తే... శిస్తును వ‌సూలు చేసిన అధికారిని క‌లెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఇప్పుడు ఆ శిస్తు లేదు ఆ వ‌సూళ్లు కూడా లేవు క‌దా. అందుకే రెవెన్యూ శాఖ పేరును మార్చేయ‌డంతో పాటు ఆ శాఖకు సంబంధం లేద‌ని ప‌లు విధుల‌ను ఇత‌ర శాఖల‌కు బ‌దిలీ చేయాల‌ని కేసీఆర్ త‌ల‌పోస్తున్నారు. అందుక‌నుగుణంగా క‌మిటీ సిఫార‌సులు చేసింద‌ని, త్వ‌ర‌లోనే కేసీఆర్ స‌ర్కారు వీటిని అమ‌ల్లోకి తీసుకురానుంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ మార్పులు అమ‌ల్లోకి వ‌స్తే... ఇక‌పై తెలంగాణ‌లో రెవెన్యూ శాఖ పేరు భూరికార్డులు, యాజ‌మాన్య నిర్వ‌హ‌ణ శాఖ‌గా, క‌లెక్ట‌ర్ పేరు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గా మారిపోవ‌డం ఖాయ‌మే.