Begin typing your search above and press return to search.

క‌మిటీలు వేయాల‌న్న కేసీఆర్‌.. ఎమ్మెల్యేల్లో ఆందోళ‌న‌

By:  Tupaki Desk   |   28 Aug 2021 12:30 PM GMT
క‌మిటీలు వేయాల‌న్న కేసీఆర్‌.. ఎమ్మెల్యేల్లో ఆందోళ‌న‌
X
తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీగా ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకున్న టీఆర్ఎస్ వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లోనూ విజ‌య‌దుందుభి మోగించింది. తెలంగాణ మ‌లి ద‌శ ఉద్య‌మాన్ని ముందుడి న‌డిపించిన నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌.. ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఇక ముచ్చ‌ట‌గా మూడో సారి కూడా విజ‌యం సాధించాల‌ని రాబోయే ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టినుంచే పార్టీని సంసిద్ధం చేసే ప్ర‌క్రియ‌ను ఆయ‌న మొద‌లెట్టారు. ఇటీవ‌ల రాష్ట్రంలో బండి సంజ‌య్ దూకుడుతో బీజేపీ, రేవంత్ జోరుతో కాంగ్రెస్ పుంజుకోవ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ త‌ప్ప‌ద‌ని భావించిన కేసీఆర్‌.. వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్‌ను సంస్థాగ‌తంగా ప‌టిష్టం చేయాల‌ని భావిస్తున్నారు.

కేసీఆర్ తీసుకునే నిర్ణ‌యాలు అనూహ్యంగా ఉంటాయ‌ని సంగ‌తి తెలిసిందే. అన్ని ర‌కాలుగా ఆలోచించి ఒక‌టి కంటే ఎక్కువ ప్ర‌యోజ‌నాలు క‌లిగించేలాగానే ఆయ‌న అడుగులు వేస్తారు. ఏ ర‌క‌మైన నిర్ణ‌యం తీసుకున్నా వ్యూహ‌త్మ‌కంగానే సాగుతారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీని సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేయాల‌నే ఆలోచ‌న‌తో గ్రామ‌స్థాయి నుంచి క‌మిటీలు వేయాల‌ని నిర్ణ‌యించారు. ఇటీవ‌ల జ‌రిగిన పార్టీ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశంలో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. సెప్టెంబ‌ర్ నెల‌లోనే వార్డు స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వ‌ర‌కు కొత్త కార్య‌వ‌ర్గం ఏర్పాటు కావాల‌ని ఆదేశించిన ఆయ‌న అందుకు త‌గిన ప్ర‌ణాళిక‌లూ సిద్ధం చేశారు. ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందుకు త‌గిన‌ట్లుగానే తేదీల‌నూ ప్ర‌క‌టించారు.

వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్ప‌టి నుంచే పార్టీని క్షేత్ర‌స్థాయి నుంచి బ‌లోపేతం చేయ‌డం మంచి నిర్ణ‌య‌మే. కానీ ఇప్ప‌డ‌దే పార్టీ ఎమ్మెల్యేల్లో ఆందోళ‌న‌కు కార‌ణ‌మ‌వుతుంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా టీఆర్ఎస్‌కు జిల్లా అధ్య‌క్షులు లేరు. కొత్త‌గా జిల్లాలు ఏర్ప‌డ‌డంతో పార్టీ నాయ‌క‌త్వం కూడా ఆ దిశ‌గా ఆలోచించ‌లేదు. కానీ ఇప్పుడు మ‌ళ్లీ జిల్లా అధ్య‌క్షుల‌ను నియ‌మించాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించ‌డంతో చాలా మంది ఎమ్మెల్యేల‌కు టెన్ష‌న్ మొద‌లైన‌ట్లు తెలుస్తోంది. కొత్త జిల్లాలు ఏర్పాటు కావ‌డంతో వాటి ప‌రిధి చాలా త‌క్కువ‌గా ఉంది. దీంతో ఒక్కో జిల్లాలో రెండు మూడు నియోజ‌క‌వ‌ర్గాలు మాత్ర‌మే ఉన్నాయి.

ఇప్పుడు ఈ నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్యేలు సూచించిన వాళ్లే జిల్లా అధ్య‌క్షులుగా ఎంపిక‌వుతారా? అన్న‌ది సందేహంగా మారింది. ఎమ్మెల్యేల మాట‌ల‌ను విని కేసీఆర్ ఓ నిర్ణ‌యం తీసుకుంటారా? లేదా త‌న‌కున్న అవ‌గాహ‌న‌తోనే కొత్త అధ్య‌క్షుల‌ను ప్ర‌క‌టిస్తారా? అన్న‌ది ఆస‌క్తి రేపుతోంది. మ‌రోవైపు జిల్లాలోని ఎమ్మెల్యేలంద‌రూ క‌లిసి కూర్చుని ఒకే నాయ‌కుడి పేరు సూచిస్తారా? అన్న‌ది కూడా అనుమానామే. త‌మ సూచ‌న‌ల‌ను కేసీఆర్ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోక‌పోతే ఎలా? అనే ఆందోళ‌న కూడా ఎమ్మెల్యేల్లో ఉంద‌నే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. మ‌రోవైపు కొత్త‌గా వ‌చ్చే జిల్లా అధ్య‌క్షులు త‌మ‌పై పెత్తనం చ‌లాయిస్తే అప్పుడు ప‌రిస్థితి ఏమిట‌నే విష‌యంపైనా ఎమ్మెల్యేలు చ‌ర్చ మొద‌లెట్టిన‌ట్లు టాక్‌.