Begin typing your search above and press return to search.

ఈసారి కేసీఆర్ కన్ను పడింది జూ మీదా?

By:  Tupaki Desk   |   4 Aug 2015 3:56 AM GMT
ఈసారి కేసీఆర్ కన్ను పడింది జూ మీదా?
X
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కన్ను ఇప్పుడు నెహ్రూ జూలాజికల్ పార్కు మీద పడిందా? జూ పార్కును హైదరాబాద్ నడిబొడ్డు నుంచి తొలగించి శివార్ల లోకి తరలించాలని కేసీఆర్ భావిస్తున్నారా? జూ పార్కు స్థలంలో ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించాలని ఆలోచిస్తున్నారా? ఈ ప్రశ్నలకు ఔను అనే జవాబిస్తున్నాయి టీఆర్ఎస్ వర్గాలు.

ఉస్మానియా ఆస్పత్రిని తీసివేసి దాని స్థానంలో సరికొత్త 20 అంతస్తుల ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించాలని కేసీఆర్ భావించినా.. ప్రతిపక్షాలు పడనివ్వడం లేదు. దానిని చారిత్రక కట్టడంగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్షాల నిరసనలను ప్రభుత్వం తొలుత తేలిగ్గా తీసుకున్నా.. ఇప్పుడు అన్ని పార్టీఃలూ ఏకతాటిపైకి రావడంతో కాస్త సీరియస్ గా ఆలోచిస్తోంది. ఉస్మానియా ఆస్పత్రిని చారిత్రక కట్టడంగా ఉంచేయాలని భావిస్తోందని సమాచారం. గతంలో హైదరాబాద్ శివారుల్లో ఉండే జూ పార్కు ఇప్పుడు నడిబొడ్డులోకి వచ్చేసింది. దాంతో దీనిని శివారుల్లోకి తరలించాలని ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుతం వీటిని తెరపైకి తెచ్చింది కేసీఆర్ సర్కారు. జూ పార్కును వనస్థలిపురంలోని డీర్ పార్కు స్థలంలోకి మార్చి.. జూ పార్కు స్థలంలో ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించాలని భావిస్తోందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

ఇదే నిజమైతే కేసీఆర్ మరోసారి కొరివితో తల గోక్కున్నట్లేనని విశ్లేషకులు వివరిస్తున్నారు. నగరం నడి బొడ్డున ఉన్న జూ పార్కుతో చాలా మందికి అనుబంధం ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు జూ పార్కుకు వెళుతున్నారు. ఇప్పుడు దీనిని ఇక్కడి నుంచి తరలిస్తే కేసీఆర్ మెడకు మరో వివాదం చుట్టుకోవడం ఖాయమని విశ్లేషకులు వివరిస్తున్నారు.