Begin typing your search above and press return to search.

అమ్మో ఆగస్టు.. భయపెడుతున్న కేసీఆర్

By:  Tupaki Desk   |   27 July 2018 8:51 AM GMT
అమ్మో ఆగస్టు.. భయపెడుతున్న కేసీఆర్
X
గడిచిన కాంగ్రెస్ పాలనతో పోలిస్తే టీఆర్ ఎస్ పాలనలో పనులు వేగంగా అవుతున్నాయి. అప్పటి పాలకులు నత్తకు నడకనేర్పేలా పనులు చేసేవారే.. ప్రాజెక్టుల పూర్తికావాలంటే సంవత్సరాల కొద్దీ టైం పట్టేది. కానీ కేసీఆర్ వచ్చాక పనులు వాయవేగంతో అవుతున్నాయి. ప్రాజెక్టులను పగలు రాత్రి మూడు షిఫ్టులు పెట్టి పూర్తి చేయిస్తున్నారు. భూగర్భంలో సబ్ స్టేషన్ కూడా నిర్మిస్తున్నారంటే కేసీఆర్ పనుల సామర్థ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. కాలువలన్నీ భూగర్భంలోంచి తవ్వించేస్తున్నారు. ఎక్కడ భూసేకరణ - రైతులకు నష్టం జరగకుండా అత్యాధునిక టెక్నాలీజీతో పనులు చేయిస్తున్నాడు. తను నిద్రపోకుండా.. అధికారులను నిద్రపోనీవవ్వడం లేదు. ఇప్పుడిదీ అధికారులకు పెను సంకటంగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఎక్కడ చూసినా అదే బిజీ.. ఆగస్టు నెల వస్తుందంటే చాలు... అధికారులు హడలి చస్తున్నారు. ప్రభుత్వ పథకాలన్నింటిని ఆగస్టులోనే ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అధికారులు ఆగమాగమవుతున్నారు.. ఆగస్టు 1న తెలంగాణ పాడిరైతులకు గేదెలను అందించే పథకానికి సీఎం కేసీఆర్ ప్రారంభిస్తున్నారు. ఆగస్టు 2న కొత్త గ్రామపంచాయతీలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఆగస్టు 15న మిషన్ భగీరథ ను తెలంగాణలో ప్రారంభించేందుకు కేసీఆర్ నిర్ణయించారు. ఆ తరువాత అందరికీ కంటి పరీక్షలు నిర్వహించి సమస్యలను గుర్తించే విధంగా ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని కూడా ఆగస్టు మొదటి వారంలోనే ప్రారంభించబోతున్నారు.

ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ పథకాలను పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 14ను డెడ్ లైన్ గా విధించారట.. దీంతో ఆ టార్గెట్ పూర్తి చేయడానికి అధికారులంతా బెంబేలెత్తిపోతున్నారు.. తాజాగా సీఎం ఆఫీస్ కార్యదర్శులంతా జిల్లాల బాట పట్టారు. మిషన్ భగీరథ సహా అన్ని పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్లు, అధికారులతో చర్చలు జరుపుతున్నారు. అధికారులంతా కార్యాలయాలు వదిలి ఇప్పుడు క్షేత్రస్థాయిలోనే కనిపిస్తున్నారు..

సీఎం కేసీఆర్ తాను హామీనిచ్చిన ప్రకారం.. 2019 ఎన్నికలలోపే ఆగస్టు 15న మిషన్ భగీరథను ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఇందుకోసం వాయువేగంగా పనులు చేయిస్తున్నాడు. అధికారులకు ఇది పెనుసవాల్ గా మారింది. లక్ష్యం చేరడం చాలా కష్టమవుతోంది. అయినా చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఆగస్టు నెల అంటే చాలు అధికారులంతా హడలి చస్తున్నారట.. కేసీఆర్ పెట్టిన టార్గెట్ కోసం ఆపసోపాలు పడుతున్నారుట..