Begin typing your search above and press return to search.

ఆ ఎమ్మెల్యే చాప్ట‌ర్ క్లోజ్ చేయ‌నున్న కేసీఆర్‌?

By:  Tupaki Desk   |   14 July 2017 6:53 AM GMT
ఆ ఎమ్మెల్యే చాప్ట‌ర్ క్లోజ్ చేయ‌నున్న కేసీఆర్‌?
X
క్రమ‌శిక్ష‌ణ వ్య‌వ‌హారాల‌పై అధికార టీఆర్ ఎస్ పార్టీలో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ సాగుతోంది. మహబూబాబాద్ మహిళా కలెక్టర్‌ చేయి పట్టుకుని వివాదాస్ప‌ద రీతిలో ప్ర‌వ‌ర్తించ‌డం ద్వారా ఎమ్మెల్యే బానోతు శంకరనాయక్ చిక్కుల్లో ప‌డిన సంగ‌తి తెలిసిందే. అమర్యాదగా ప్రవర్తించాడన్న ఫిర్యాదుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగ్రహానికి శంకర్‌ నాయక్ గుర‌య్యారు. ఇక్క‌డితో ముగిసిపోయింద‌నుకుంటున్న ఈ ఎపిసోడ్‌ లో కొత్త వార్త‌లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. శంక‌ర్ నాయ‌క్‌ కు వచ్చే ఎన్నికల్లో అధికారపార్టీ తరపున టికెట్టు రావడం కష్టమేనని అప్పుడే టీఆర్‌ ఎస్‌ పార్టీలో గుసగుసలు మొదలయ్యాయి. ఆ స్థానంలో మరొకరికి టికెట్టు వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల్లో జోరుగా మొదలైంది.

మ‌హ‌బూబాబాద్‌ నియోజకవర్గ టీఆర్‌ ఎస్‌ పార్టీ ఇన్‌ ఛార్జీగా మాలోతు కవితను నియమించాలన్న డిమాండ్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. దీంతో వచ్చే ఎన్నికల్లో రెడ్యానాయక్‌ ఎంపీగా, ఆయన కూతురు కవిత ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అంటున్నారు. ప్రస్తుత ఎంపీ సీతారంనాయక్‌ ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆలోచన ఉన్నారని అధికార పార్టీలో చర్చ జరుగుతుండడం గమనార్హం. మాజీ ఎమ్మెల్యే సత్యవతిరాథోడ్‌ కూడా ఎమ్మెల్యే టికెట్టు ఆశిస్తున్నవారిలో ఉన్నారని తెలిసింది. శంకర్‌ నాయక్‌ సంఘటన నేపథ్యంలో ఆశావాహుల వర్గీయుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. అదే స‌మ‌యంలో శంక‌ర్ నాయ‌క్ వ‌ర్గంలో క‌ల‌కలం మొద‌లైంది.

ఇదిలాఉండ‌గా... ఐఎఎస్‌ లు - మహిళా అధికారుల పట్ల అధికారపార్టీ నేతలే అనుచితంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు గత కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. కరీంనగర్‌ - నిజామాబాద్‌ - మహబూబాబాద్‌ - వరంగల్‌ జిల్లాల్లో ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే తాజాగా మహబూబాబాద్‌ లో జరిగిన సంఘటన ఆధారాలతో సహా దొరకడంతో సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యేపై మరింత ఆగ్రహానికి గురయ్యారు. సస్పెండ్‌ చేయాలన్న ఆలోచన వచ్చినా ఆగిపోయారని తెలిసింది. కలెక్టర్‌ కు క్షమాపణ చెప్పాలని ఆదేశించడం వరకే పరిమితమయ్యారని సమాచారం. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం పార్టీ పట్ల కొంత అనుకూల వాతావరణం వచ్చిందని టీఆర్‌ ఎస్‌ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. కలెక్టర్‌కు ఎమ్మెల్యే చేత క్షమాపణ చెప్పించడం మామూలు విషయం కాదని, ఇంతకంటే పెద్ద చర్య ఏముంటుందని అంటున్నారు. తప్పు చేసిన వారు ఏ పార్టీలో ఉన్నా శిక్షిస్తామని, తమ పార్టీలో ఉన్నా వదిలిపెట్టబోమని గతంలో సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఆ మాటనే ప్రస్తుతం ముఖ్యమంత్రి నిజం చేశారని టీఆర్‌ఎస్ వర్గాలు అంటున్నాయి. ఈ హెచ్చరిక ఒక శంకర్‌ నాయక్‌ కే కాదు అని - టిఆర్‌ ఎస్‌ పార్టీలో తప్పు చేసిన మిగతా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకూ వర్తిస్తుందని అంటున్నారు.