Begin typing your search above and press return to search.

విజ‌య‌వాడ‌కు కేసీఆర్‌

By:  Tupaki Desk   |   22 Jan 2016 7:22 AM GMT
విజ‌య‌వాడ‌కు కేసీఆర్‌
X
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌ లో మూడో ప‌ర్య‌ట‌న‌కు వెళ్లేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు డిసైడ్ అయ్యారు. త‌న ఇష్ట‌మైన కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న క‌లియుగ దైవమైన తిరుప‌తి బాలాజీని ద‌ర్శించుకోనున్నారు. దీంతో పాటు బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను దీవెన‌లు కూడా పొంద‌నున్నారు.

తెలంగాణ‌ రాష్ట్రం ఏర్ప‌డాల‌ని ఉద్య‌మ నాయ‌కుడిగా ఉన్న స‌మ‌యంలో కేసీఆర్ ప‌లు మొక్కులు మొక్కారు. ఇందులో భాగంగా రూ.5.59 కోట్ల ఖర్చుతో తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లోనూ ఉన్న వివిధ దేవాలయాలకు మొక్కులు చెల్లించుకోవడం, ఆయా దేవతలకు బంగారు ఆభరణాలు చేయించడానికి కేటాయించారు. దాదాపు రూ.4 కోట్లు తిరుపతి వెంకటేశ్వరునికి బంగారు తాపడంతో చేసిన మూలవర్ణకమలము చేయించేందుకు కేటాయించారు. వరంగ‌ల్ భ‌ద్ర‌కాళి అమ్మ‌వారికి ఆభ‌ర‌ణాలు చేయించేందుకు రూ.57 ల‌క్ష‌ల‌తో బంగారు కిరిటం - తిరుచానురు అమ్మ‌వారికి 15 గ్రాముల‌తో ముక్కుపుడ‌క‌, క‌న‌క‌దుర్గ అమ్మ‌వారికి 15 గ్రాముల‌తో ముక్కుపుడ‌క‌, కురువ వీర‌భ‌ద్ర‌స్వామికి 25 గ్రాములతో బంగారు మీసాలు స‌మ‌ర్పించ‌నున్నారు. వీటి మొత్తం విలువ రూ.59 ల‌క్ష‌లుగా అంచ‌నా.

మొక్కులు స‌మ‌ర్పించుకోవ‌డంలో భాగంగా వచ్చేనెలలో తిరుమల వేంకటేశ్వర స్వామివారితో పాటు తిరుచానూరులోని అమ్మవారిని కూడా దర్శించుకోనున్నారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి దాదాపు రెండు కిలోల బంగారం ఉప‌యోగించి కిరీటం చేయించార‌ని తెలుస్తోంది. అదే రోజున తిరుచానూరులోని పద్మావతమ్మ వారిని కూడా దర్శించుకుని, ఆమెకు 15 గ్రాముల బంగారంతో ముక్కుపుడకను బహూకరించనున్నారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత కేసీఆర్ తొలిసారిగా తిరుపతికి వెళ్తున్నారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకుని, ఒకరోజు అక్కడే బస చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తో పాటు ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ల‌నున్నారు. అదేవిధంగా విజయవాడలోని క‌న‌క‌దుర్గ దేవాల‌యాన్ని కూడా కేసీఆర్ ద‌ర్శించుకొని అమ్మ‌వారికి ముక్కుపుడ‌క స‌మ‌ర్పించుకోనున్నారు.

అయితే ముందుగా తిరుమ‌ల‌లో ప‌ర్య‌టిస్తారా లేక విజ‌య‌వాడ‌కు వెళ్తారా అనే విష‌యంలో ఇంకా క్లారిటీ రాలేద‌ని స‌మాచారం.