Begin typing your search above and press return to search.

తిరుమల వెంకన్నరుణం తీర్చుకోనున్న కేసీఆర్

By:  Tupaki Desk   |   10 Dec 2015 11:26 AM GMT
తిరుమల వెంకన్నరుణం తీర్చుకోనున్న కేసీఆర్
X
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తిరుమల వెంకన్నకు ఆభరణాలు చేయిస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో మొక్కుకున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక రాష్ట్రమేర్పడి ఆయన ముఖ్యమంత్రి ఏడాదిన్నర అయినా మొక్కు తీర్చుకోవడం కుదరలేదు. ఆ దిశగా ఆయన ఆలోచిస్తున్నా కారణాంతరాల వల్ల ఆలస్యమైంది. అయితే... ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయరాదని కేసీఆర్ నిర్ణయించుకున్నారట. రూ.5.59 కోట్లతో బంగారు ఆభరణాలు చేయించి మొక్కు తీర్చుకోవాడానికి రెడీ అవుతున్నారు. ఆభరణాల తయారీ కోసం ఆయన ప్రత్యేకంగా ఒక త్రిసభ్య కమిటీ వేశారు.

వెంకన్నకు ఏఏ ఆభరణాలు చేయించాలి... అవి ఎలా ఉండాలి.. ఎక్కడ చేయించాలి వంటివిషయాల్లో ఈ కమిటీ ముఖ్యమంత్రికి సలహాలు ఇస్తుంది. దేవాదాయశాఖకు చెందిన ఉన్నతాధికారులు భాస్కర్ - కేవీ రమణాచారి - రాజేశ్వర్ లతో ఈ కమిటీ వేశారు. వీరు తితిదేతో సంప్రదించి ఆభరణాలను నిర్ణయించడం... ఆ తరువాత తయారీ పనివాళ్లను గుర్తించడం చేసి కేసీఆర్ కు నివేదిక ఇస్తారు. దాని ప్రకారం ఆయన ఆభరణాలు చేయించి తిరుమల వెంకన్నకు మొక్కు చెల్లించుకుంటారు.

కేసీఆర్ చేపట్టిన ఆయుత చండీయాగం పూర్తయ్యాక, జీహెచ్ ఎంసీ ఎన్నికల హడావుడీ సద్దుమణిగాక కేసీఆర్ తిరుమలకు వెళ్తారని భావిస్తున్నారు. ఆలోగా ఆభరణాలకు సంబంధించిన పనులు పూర్తవుతాయి. ఫిబ్రవరి, లేదా మార్చి మొదటివారంలో కేసీఆర్ తిరుమల వెంకన్నను దర్శించుకోవాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

కేసీఆర్ మొక్కుల లెక్క చూస్తే..

= తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి... మూలవర్ణ కమలం.. నమూనా బంగారు సాలిగ్రామ హారం.. ఐదు పెటల కంటె

= వరంగల్ భద్రకాళి అమ్మవారికి... రెండు కేజీల బంగారు కిరీటం

= తిరుచ్చానూరు పద్మావతి అమ్మవారికి.. 10 నుంచి 15 గ్రాముల బంగారు ముక్కుపుడక

= విజయవాడ కనకదుర్గ అమ్మవారికి.. 10 నుంచి 15 గ్రాముల బంగారు ముక్కుపుడక

= వరంగల్ కురవి వీరభద్రస్వామికి బంగారు మీసాలు.