Begin typing your search above and press return to search.

గ్రేటర్ ఎన్నికల పుణ్యమా అని ఆర్టీసీ ఉద్యోగులకు స్వీట్ న్యూస్

By:  Tupaki Desk   |   15 Nov 2020 5:00 PM GMT
గ్రేటర్ ఎన్నికల పుణ్యమా అని ఆర్టీసీ ఉద్యోగులకు స్వీట్ న్యూస్
X
వరాల దేవుడు అన్నంతనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తుకు వస్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా.. దమ్ముగా సంక్షేమ పథకాల్ని అమలు చేయటమే కాదు.. వరుస పెట్టి వరాలు ఇచ్చే సత్తా ఆయన సొంతం. తనకు నచ్చనప్పుడు కోతలు కోసే ఆయన.. మాంచి మూడ్ లో ఉన్నప్పుడు వరాల్ని ఇచ్చేస్తుంటారు. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. వరాలు ఇచ్చే వేళలో.. కడుపు నిండేలా చూసుకోవటం ఆయనకు మాత్రమే చెల్లుతుంది.

డిమాండ్ చేసి.. దారికి తెచ్చుకోవాలంటే మాత్రం పప్పులు ఉడకవన్న విషయాన్ని ఇప్పటికే కేసీఆర్ ఫ్రూవ్ చేసుకున్నారు. దీంతో.. హక్కుల సాధన కోసం ఆందోళన బాట పట్టే వారంతా ఇప్పుడు రూటు మార్చేస్తున్నారు. సీఎం వారికి ఆగ్రహం కంటే అనుగ్రహం కలిగేలా చూసుకుంటే చాలు.. తమ సమస్యలు ఇట్టే పరిష్కారమవుతాయని భావించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా షురూ కానున్న గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ లో ఈ మధ్య బయటకు రాని వరాల దేవుడు ఒక్కసారిగా బయటకు వచ్చారు.

గడిచిన రెండు.. మూడు రోజులుగా ఆయన వరుస పెట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆస్తిపన్నులో 50 శాతం రాయితీ.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికుల వేతనాల్ని పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అక్కడితో ఆగని ఆయన.. తాజాగా ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల్లో విధించిన కోతను ఎత్తేయటమేకాదు.. కోత పెట్టిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలంటూ ఆర్టీసీ అధికారుల్నిసీఎం ఆదేశాలు జారీ చేశారు.

ఆర్టీసీ ఉద్యోగుల జీతాల్లో 2 నెలల పాటు విధించిన 50 శాతం మొత్తాన్ని తిరిగి చెల్లించాలని చెప్పిన ఆయన.. ఇందుకు అవసరమైన రూ.130 కోట్ల నిధులను విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. అంతేకాదు.. హైదరాబాద్ నగరంలో 50 శాతం బస్సుల్ని పునరుద్ధరించాలని ఆర్టీసీ ఎండీకి సూచన చేశారు. ఇదంతా చూస్తే.. వరుస గ్రేటర్ ఎన్నికలకు దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం కూడా తోడు అయ్యిందని చెప్పొచ్చు. ఇదే సీఎం కేసీఆర్ లోని వరాల దేవుడు ఒళ్లు విరుచుకుంటున్నారని చెప్పక తప్పదు.