Begin typing your search above and press return to search.

యాదాద్రికి ఏమేం చేయాలో చెప్పిన కేసీఆర్

By:  Tupaki Desk   |   8 Nov 2020 7:15 AM GMT
యాదాద్రికి ఏమేం చేయాలో చెప్పిన కేసీఆర్
X
అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారికి కొన్ని ప్రాధాన్యతా అంశాలు ఉంటాయి. వాటి విషయంలో వారి విజన్ ఎంత ఉన్నా.. సూక్ష్మమైన అంశాల విషయాల్ని పెద్దగా పట్టించుకోరు. ఆ మాటకు వస్తే.. వారికంత తీరిక ఉండదు. అందుకు భిన్నంగా ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారశైలి. తన హయాంలో యాదాద్రిని తిరుమల పుణ్యక్షేత్రానికి ధీటుగా నిర్మించాలన్న తపన ఎక్కువ. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన ఎవరూ కూడా..ఒక పుణ్యక్షేత్రం మీద చూపనంత శ్రద్ధను యాదాద్రి మీద చూపుతారు కేసీఆర్.

ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్.. తిరుమల క్షేత్రం డెవలప్ మెంట్ మీద ఎక్కువ శ్రద్ధ చూపేవారని చెబుతారు. యాదాద్రి విషయంలో కేసీఆర్ చూపే ఆసక్తితో పోలిస్తే అదేమంత ఎక్కువగా అనిపించదు. యాదగిరిగుట్టగా ఉన్న పుణ్యక్షేత్రాన్ని.. యాదాద్రిగా మార్చటమే కాదు.. ఆలయాన్ని పునర్ నిర్మిస్తున్న వైనం.. వందల కోట్లతో రూపురేఖలు మొత్తంగా మార్చేస్తున్న వైనం తెలిసిందే. మరికొద్ది నెలల్లో తాను అనుకున్న యాదాద్రిని సిద్ధం చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు.

తాజాగా యాదాద్రికి సంబంధించి తన విజన్ ను కేసీఆర్ చెప్పుకొచ్చారు. అధికారులతో ఏర్పాటు చేసిన రివ్యూ సందర్భంగా.. ఆయన ప్రతి విషయాన్ని ఎంత సునిశితంగా చూస్తారన్నది..ఆయన మాటల్నివింటే అర్థమవుతుంది. పనుల వేగాన్ని పెంచి.. మూడు నెలల్లో పూర్తి చేయాలన్న టార్గెట్ ఇచ్చేశారు.

క్యూలైన్ కాంప్లెక్స్ నిర్మాణంతో సహా ఆలయానికి తుది మెరుగులు దిద్దటానికి అయోధ్య.. అక్షరధామ్ వంటి పుణ్యక్షేత్రాలకు పని చేసిన శిల్పుల్ని వెంటనే పిలిపించాలని.. బస్ స్టేషన్ నిర్మాణానికి ఏడు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. 11 ఎకరాల స్థలంలో మూడువేలకు పైగా కార్లు పట్టేలా పార్కింగ్ ఏర్పాటు చేయాలని చెప్పారు.

పూర్తిగా వెజ్ టేరియన్ ఫుడ్ లభించేలా ఫుడ్ కోర్టుల్ని నిర్మించాలని.. అందులో సౌత్ ఇండియన్.. నార్త్ ఇండియన్ వంటకాల్ని అందించేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. యాదాద్రికి సమీపంలోని గండి చెరువును అద్భుతమైన ల్యాండ్ స్కేపింగ్ తో.. ఫౌంటెయిన్లతో తీర్చిదిద్దాలని.. బ్రహ్మోత్సవాల నిర్వహణకు వీలుగా సుందరీకరణ చేపట్టాలని చెప్పారు. యాదాద్రిలో డోనార్ కాటేజీల్ని అద్భుతంగా ఉండేలా తయారు చేయాలన్న ఆయన.. భక్త ప్రహ్లాద.. అమ్మవార్ల పేర్లను కాలేజీలకు పెట్టాలన్నారు. ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మాణంపై ప్రత్యేక ఆరా తీసిన వైనం చూస్తే.. యాదాద్రికి సంబంధించిన పరతి విషయం సీఎం కేసీఆర్ కు ఎంత బాగా అవగాహన ఉందన్న విషయం ఇట్టే తెలియక మానదు.