Begin typing your search above and press return to search.

ఇలాంటి ప్ర‌చారంతో భారీ డ్యామేజ్ సారూ?

By:  Tupaki Desk   |   18 April 2019 1:30 AM GMT
ఇలాంటి ప్ర‌చారంతో భారీ డ్యామేజ్ సారూ?
X
కొన్ని అంశాల్ని నిశితంగా ప‌రిశీలిస్తే త‌ప్ప క‌నిపించ‌వు. చాలామంది లైట్ గా తీసుకునే విషయాన్ని కొంద‌రు మాత్రం భూత‌ద్దంలో చూసిన‌ట్లుగా చూస్తే.. కీల‌క‌మైన అంశాల్ని తెర మీద‌కు తెస్తుంటారు. తాజాగా అలాంటిదే ఒక విష‌యం ఇటీవ‌ల కాలంలో జోరుగా ప్ర‌చారం సాగుతోంది. వంద‌ కోట్ల కుంభ‌కోణం చేసే డ్యామేజ్ కంటే కూడా ఎక్కువ‌గా ప్ర‌భుత్వ ఇమేజ్ ను ప్ర‌భావితం చేసే ఇలాంటి విష‌యాల్లో కేసీఆర్ జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్న మాట వినిపిస్తోంది.

ఇంత‌కీ.. అంత‌లా ప్ర‌చారం సాగుతున్న అంశం ఏమిట‌న్న‌ది చూస్తే.. ద‌ళిత వ‌ర్గాల విష‌యం కేసీఆర్ పెద్ద‌గా మ‌క్కువ చూప‌ర‌న్న మాట అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఉత్త‌నే బ‌ట్ట కాల్చి మీద వేస్తే స‌రిపోతుందా?  దానికి సాక్ష్యం ఉందా? అంటే.. ఒక‌టి స‌రిపోతుందా?  రెండు మూడు కావాలా? అన్న ఎదురు ప్ర‌శ్న ఠ‌క్కున వ‌స్తోంది.

ఇంత‌కీ ఆ సాక్ష్యాలు ఏమిట‌న్న ప్ర‌శ్న‌కు బ‌దులిస్తున్న స‌ద‌రు వ‌ర్గాల వారు.. అంబేడ్క‌ర్ జ‌యంతి.. వ‌ర్థంతి సంద‌ర్భంగా ఏర్పాటు చేసే కార్యక్ర‌మంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ ఎందుకు పాల్గొన‌రు?  అంబేడ్క‌ర్ 125 అడుగుల విగ్ర‌హాం ఏమైంది? ద‌ళితుడే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్య‌మంత్రి అన్న హామీ మాటేంటి?  రాష్ట్ర‌ప‌తి హోదాలో ఉన్న ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ కాళ్ల‌కు దండం పెట్టే కేసీఆర్.. ద‌ళితుడైన కోవింద్ రాష్ట్ర‌ప‌తి హోదాలో హైద‌రాబాద్ వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌న కాళ్ల‌కు న‌మ‌స్కారం చేయ‌కుండా.. షేక్ హ్యాండ్ తో స‌రిపెట్ట‌టం ఏమిటి? అంటూ లిస్ట్ విప్పుతున్నారు.

ద‌ళితుల విష‌యంలో కేసీఆర్ చిన్న‌చూపు చూస్తార‌ని.. వారిని అస్స‌లు ప‌ట్టించుకోర‌న్న ప్ర‌చారం పెర‌గ‌టం గులాబీ బాస్ కు ఏ మాత్రం మంచిది కాదు. ఇలాంటి ప్ర‌చారాల‌కు ఎలా బ్రేకులు వేస్తార‌న్న విష‌యంపై కేసీఆర్ అండ్ కో దృష్టి సారించ‌టం మంచిద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.