Begin typing your search above and press return to search.

కేసీఆర్ మ్యాజిక్.. కారు ధాటికి హస్తం - సైకిల్ చిత్తు!

By:  Tupaki Desk   |   11 Dec 2018 5:33 AM GMT
కేసీఆర్ మ్యాజిక్.. కారు ధాటికి హస్తం - సైకిల్ చిత్తు!
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడే అయ్యింది. మీడియాను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ - తెలుగుదేశంలు తాము కూడా పోటీలో ఉన్నామని చెప్పుకున్నా అదంతా ఈవీఎంలు ఓపెన్ చేయక ముందే. ఒక్కసారి ఈవీఎంలు ఓపెన్ అయ్యాకా కారు జోరు ముందు.. కాంగ్రెస్ పార్టీ - తెలుగుదేశం పార్టీలు కకావికలం అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సమితి సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది.

ఎనభైకి పైగా స్థానాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి రౌండ్స్ లో తెరాస ఈ మేరకు లీడింగ్ ను సాధించింది. ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తెరాసకు పోటీని కూడా ఇవ్వడం లేదు. కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు కేవలం ఇరవై సీట్ల స్థాయిలో మాత్రమే లీడింగ్ లో ఉన్నారు.

ఎంఐఎం తన సీట్లలో తను లీడింగ్ లో ఉండగా… భారతీయ జనతా పార్టీ మూడు నాలుగు సీట్లలో ఉనికిని చాటుతోంది. ఇక ముందుగా చెప్పినట్టుగా స్వతంత్ర అభ్యర్థులెవరూ సంచలనాలు నమోదు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. కేవలం సంచలనం తెలంగాణ రాష్ట్ర సమితి విజయం మాత్రమే.

తెలంగాణలో తెరాస స్వీప్ చేస్తుందని వివిధ ప్రీ పోల్ సర్వేలు - పోస్ట్ పోల్ సర్వేలు కూడా చెప్పాయి. అయితే కాంగ్రెస్ - తెలుగుదేశం వర్గాలు లగడపాటిని తెర మీదకు తెచ్చాయి. లగడపాటి ఏదో మ్యాజిక్ చేస్తాడని అన్నట్టుగా చర్చను అటు వైపు మళ్లించాయి. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ ఫలితం ఎలా ఉండబోతోంది అనేది మిస్టీరిక్ గా మారింది.

కానీ అంతిమంగా తెలంగాణ రాష్ట్ర సమితికే అధికారం అందుతోంది. ఎవరి మద్దతూ అవసరం లేకుండా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.