Begin typing your search above and press return to search.

ముఖ్యమంత్రులూ...!! మా సమస్యపై మీరు పోరాడండి

By:  Tupaki Desk   |   23 Jun 2015 12:30 PM GMT
ముఖ్యమంత్రులూ...!! మా సమస్యపై మీరు పోరాడండి
X
హైదరాబాదులో సెక్షన్‌ 8 అమలు చేయవచ్చున్న అటార్నీ జనరల్‌ సూచనల నేపథ్యంలో తెలంగాణ దాన్ని జాతీయస్థాయి సమస్యగామార్చి అందరి మద్దతు పొందాలని ప్రయత్నిస్తోంది. సెక్షన్‌ 8 అమలు చేస్తే జాతీయస్థాయిలో ఉద్యమించాలని ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కేసీఆర్‌ ఈ విషయంపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఢిల్లీ పెద్దలకు ఫోన్‌ చేసి మాట్లాడారని సమాచారం. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని సెక్షన్‌ 8ను ఉపయోగిస్తూ హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టాలని చూస్తే తాము ఉద్యమిస్తామని.. మీరంతా సహకరించాలంటూ ఆయన కొందరు ముఖ్యమంత్రులను కోరారట.

మరోవైపు హైదరాబాదులో సెక్షన్‌ 8 అమలును ఎట్టిపరస్థితిలోనూ అంగీకరించబోమంటూ గవర్నర్‌ నరసింహన్‌కు కేసీఆర్‌ చెప్పినట్లుగా తెలుస్తోంది. విభజన తరువాత ఏడాది కాలమైనా ఇంతవరకు ఎక్కడా సీమాంధ్రులపై దాడులు జరగలేదని... వారి కాలిలో ముల్లు గుచ్చుకుంటే తీస్తానని తానే స్వయంగా హామీ ఇచ్చానని కేసీఆర్‌ చెప్పారట. ఏపీ సీఎం చంద్రబాబు కుట్రవల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఫిర్యాదు చేశారట. కాగా టీఆరెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సోదిలోకి కూడా లేకుండా పోయిన ఉద్యమ హీరో కోదండరాం కూడా సెక్షన్‌ 8 పై మాట్లాడుతున్నారు. దీన్ని అడ్డుపెట్టుకుని తెలంగాణపై ఏపీ నాయకులు పెత్తనం చెలాయించాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరికలు జారీ చేశారు.

ఇదంతా ఎలా ఉన్నా కేసీఆర్‌ మాత్రం బీజేపీయేతర పార్టీల ముఖ్యమంత్రుల మద్దతు మూటగట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారట. అయితే... వారిలో కొందరు చూద్దాం అన్నట్లుగా మాట్లాడినా మరికొందరు మాత్రం ఇది ఈ రోజుతో పోయే గొడవ కాదు... మనకెందుకులే అన్నట్లుగా విని ఊరుకున్నారని తెలుస్తోంది.