Begin typing your search above and press return to search.

రైతుల‌కు బేడీలేయ‌డం త‌ప్పే : కేసీఆర్

By:  Tupaki Desk   |   13 May 2017 5:48 PM GMT
రైతుల‌కు బేడీలేయ‌డం త‌ప్పే : కేసీఆర్
X

ఢిల్లీ ప‌ర్య‌ట‌న అనంత‌రం హైద‌రాబాద్‌కు విచ్చేసిన తెలంగాణ ముఖ్య‌మంత్రి నివాస‌మైన‌ ప్రగతి భవన్ లో కవులు, సినీ దర్శకులు, రచయితలతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. సుమారు ఐదు గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో దర్శకులు, కవులు, రచయితలకు సీఎం కేసీఆర్‌ పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. వ్యవసాయాభివృద్ధి – రైతు సంక్షేమంపై ప్రధానంగా దృష్టి పెట్టిన ఈ సమావేశంలో నీటి ప్రాజెక్టులు, విద్యుత్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం, టిఎస్ ఐపాస్, ఐటి పాలసీ, పేకాట క్లబ్బులు, గుడుంబా నివారణ, గొర్రెల పెంపకం, చేపల పెంపకం, చేనేత పరిశ్రమ, నవీన క్షౌరశాలలు, ఆరోగ్య పరిరక్షణ, కేసీఆర్ కిట్ తదితర అంశాలపై కూడా విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వ కార్యక్రమాలపై చైతన్యవంతుల్ని చేసే విధంగా రచనలు చేయాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో రైతులకు స్వర్ణయుగం తెచ్చే మహోద్యమం రావాలని చెప్పారు. రైతుల కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేలా పాటలు, వీడియో చిత్రాలు రూపొందించాలని సూచించారు. రైతులకు భరోసా ఇచ్చేలా పాటలు, చిత్రాలు ఉండాలన్నారు.

ఖ‌మ్మంలో రైతుల చేతీల‌కు బేడీలు వేయ‌డం త‌ప్పు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇది ఉద్దేశపూర్వ‌కంగా జ‌రిగిందిన కాద‌ని చెప్పిన కేసీఆర్ ఇలాంటివి జ‌ర‌గ‌కుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. బంగ్లాదేశ్ లో ప్రొఫెసర్ యూనస్ ఖాన్ పొదుపు ఉద్యమం చేపట్టినట్లు, ఎస్.కె. డే భారతదేశంలో పంచాయితీ రాజ్ ఉద్యమాన్ని తీసుకొచ్చినట్లు తెలంగాణలో రైతుకు స్వర్ణయుగం తెచ్చే మహోద్యమం రావాలని సీఎం ఆకాంక్షించారు. వ్యవసాయాభివృద్ధి కోసం, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలపై పూర్తి అవగాహన కల్పించడంతో పాటు, ఇక మా భవిష్యత్తుకు ఢోకా లేదనే భరోసా రైతాంగంలో కలిగే విధంగా పాటలు రాయాలని, వీడియో చిత్రాలు రూపొందించాలని, రచనలు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఇప్పటికే రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని పథకాలు తెస్తున్నామని అవన్నీ సక్రమంగా అమలు చేసే బాధ్యతను రైతు సంఘాలకు అప్పగిస్తామని సీఎం వెల్లడించారు. రైతు స్వర్ణ యుగానికి రైతు సంఘాలే నిచ్చెన మెట్లు కావాలని, అవి నిజాయితీగా పని చేయాలన్నారు. వ్యవసాయం బాగు పడి, రైతు ధైర్యంగా ఉండడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా ఉండడం కోసం చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం కావడానికి ప్రజల్లో చైతన్యం కలిగించాలని కోరారు.

తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం వ్యవసాయాభివృద్ధి కోసం, రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని కేసీఆర్ తెలిపారు. ‘‘రైతుకు కావాల్సింది సాగునీరు, విద్యుత్, సకాలంలో ఎరువులు, విత్తనాలు, పంట పండిన తర్వాత మార్కెట్లో గిట్టుబాటు ధర. ఇవి ఉంటే వ్యవసాయదారులకు ఏ సమస్య ఉండదు. వీటన్నింటిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వచ్చే ఏడాది నుంచి వర్షాకాలం, ఎండాకాలం పంటలకు ఎకరానికి నాలుగు వేల చొప్పున ఎనిమిది వేల చొప్పున అందిస్తున్నాం. ఇక తెలంగాణ రైతులకు పెట్టుబడి సమస్య ఉండదు. అందరూ ఒకే పంట వేసి నష్టపోకుండా క్రాప్ కాలనీలు ఏర్పాటు చేస్తాం. వ్యవసాయానుకూల వాతావరణ పరిస్థితులను బట్టి ఎక్కడ ఏ పంట వేయాలో ముందే నిర్ణయించి రైతులతో అవే పంటలు సాగు చేయిస్తాం. వాటికి గిట్టుబాటు ధర వచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అన్ని విషయాల్లో రైతులకు అండగా ఉండడానికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతు సంఘాలను ఏర్పాటు చేస్తాం. రైతు సంఘాలే ధర నిర్ణయించే పద్దతి తెస్తాం. రైతులు గిట్టుబాటు ధర కోసం ఇబ్బంది పడే పరిస్థితి ఇక ఉండదు. ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలంటే రైతుల్లో అవగాహన పెరగాలి. ప్రతీ కార్యక్రమం పారదర్శకంగా జరగాలి. అందుకోసమే ప్రజల్లో చైతన్యం రావాలి. వారిలో చైతన్యం తీసుకొచ్చేలా మీరు పాటలు రాయాలి. చిత్రాలు తీయాలి. రచనలు చేయాలి. రైతును నిలబెట్టేలా సహకరించండి’’ అని కేసీఆర్‌ అభ్యర్థించారు.