Begin typing your search above and press return to search.

తలసానికి ఏపీ బాధ్యతలు...!?

By:  Tupaki Desk   |   18 Jan 2019 4:14 AM GMT
తలసానికి ఏపీ బాధ్యతలు...!?
X
ఆంధ్ర్రదేశ్ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆ పనిని వేగవంతం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం తన కుమారుడు తెలంగాణ రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావును ఆంధ్రప్రదేశ్‌ లో ప్రతిపక్ష నేత వైఎస్. జగన్ మోహన రెడ్డి వద్దకు పంపారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్‌ లకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగానే కేటీఆర్‌ ను జగన్ వద్దకు పంపినట్లు చెబుతున్నారు. అయితే అంతర్గతంగా మాత్రం ఆంధ్ర్రప్రదేశ్‌ లో చంద్రబాబ నాయుడిని గద్దె దించడమే లక్ష్యంగా కెసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ జగన్‌ ను కలిసారు. ఆయన తర్వాత కల్వకుంట్ల తారక రామారావు కలిసారు. ఇలా వ్యూహ రచన చేస్తున్న కెసీఆర్ ఆంధ్రప్రదేశ్‌ లో ఎత్తుగడలను పటిష్ఠంగా అమలు చేసేందుకు తన అనుంగు అనుచరుడు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ను వినియోగిస్తున్నట్లు సమాచారం.

సంక్రాంతి పండుగకు ఆంధ్ర్రప్రదేశ్ వెళ్లిన తలసాని శ్రీనివాస్‌ యాదవ్ విజయవాడలోను - భీమవరంలోను ఆంధ్రప్రదేశ్‌ లో తము రాజకీయాలు చేస్తామని ప్రకటించారు. ఏపీలో యాదవ కుల సంఘాలతో భేటీ అయ్యారు. అందరూ ఊహించిన దాని కంటే కాసింత దూకూడుగానే వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రిటర్న్ గిఫ్ట్ తప్పదని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయడు పాలన ఇంక మూడు నెలలే ఉంటుందని తమదైన శైలిలో తలసాని చెప్పారు. ఈ దూకూడు వెనుక తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసీఆర్ ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏపీలో పరిణామాలను ఎప్పటికప్పుడు బేరీజు వేస్తు తాము రూపొందించే వ్యూహాలను అమలు చేసే బాధ్యతను కెసీఆర్ తలసానికి అప్పగించినట్లుగా పార్టీలో చర్చ జరుగుతోంది. అశాంబ్లీ సమవేశాలు ముగిసిన తర్వాత తలసాని శ్రీనివాస్‌ యాదవ్ మరోసారి ఆంధ్రప్రదేశ్ వెళతారని అంటున్నారు.