Begin typing your search above and press return to search.

విజయ గర్జన డేట్ మారింది అందుకేనా?

By:  Tupaki Desk   |   2 Nov 2021 5:30 AM GMT
విజయ గర్జన డేట్ మారింది అందుకేనా?
X
పార్టీ పెట్టి రెండు దశాబ్దాలు పూర్తి అయిన నేపథ్యంలో ఈ నెల 15న వరంగల్ లో అంగరంగ వైభవంగా నిర్వహించాలని తలపెట్టిన విజయగర్జన సభను వాయిదా వేస్తూ టీఆర్ఎస్ ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక ప్రకటనను పార్టీ అధినేత కేసీఆర్ పేరుతో విడుదల చేశారు. బహిరంగ సభను ఈ నెల 29న నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. విజయ గర్జన సభ తేదీ మార్పు అంశాన్ని పార్టీకి చెందిన అన్ని స్థాయి నేతలకు అందించాల్సిందిగా పేర్కొన్నారు.

విజయగర్జన డేట్ ఎందుకు మారింది? అన్నది ప్రశ్నగా మారింది. దీనికి హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం ప్రతికూలంగా వచ్చిన వేళ.. ఫలితం వెల్లడైన వెంటనే విజయ గర్జన సభ పేరుతో నిర్వహిస్తే.. ఇబ్బంది ఎదురవుతుందన్న ఉద్దేశంతోనే మార్చినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఇందులో నిజం లేదని టీఆర్ఎస్ వర్గాలు వాదిస్తున్నాయి. నవంబరు 29న దీక్షా దివస్ ను టీఆర్ఎస్ పాటిస్తుందని.. ఆ రోజున సభను నిర్వహిస్తే మరింత బాగుంటుందన్న ఉద్దేశంతోనే.. కేసీఆర్ సభ డేట్ ను మార్చినట్లుగా చెబుతున్నారు.

తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న వేళ.. 2009 నవంబరు 29న టీఆర్ఎస్ అధినేత హోదాలో కేసీఆర్ ప్రారంభించిన ఆమరణదీక్ష చివరకు పెను ప్రభంజనంగా మారటం.. నాటి ఉమ్మడి పాలకులకు ముచ్చమటలు పట్టేలా చేయటం తెలిసిందే. దీనికి గుర్తుగా.. విజయ గర్జన సభను నవంబరు 15 కంటే కూడా మరో రెండు వారాలు ఆగి నవంబరు 29న నిర్వహిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని చెబుతున్నారు. మారిన తేదీకి తగ్గట్లు.. భారీగా జనసమీకరణకు అవసరమైన సమయం దక్కుతుందని.. చరిత్రలో నిలిచిపోయేలా సభా ఏర్పాట్లు సాగాలని చెబుతున్నారు. మొత్తంగా విజయగర్జన సభ డేట్ మారటం రాజకీయ వర్గాల్లో మాత్రం కొత్త చర్చకు తెర తీసిందని చెప్పక తప్పదు.