Begin typing your search above and press return to search.

కేసీఆర్ మెమ‌రీ చిప్ మామూలు కాదుగా!

By:  Tupaki Desk   |   23 July 2019 5:26 AM GMT
కేసీఆర్ మెమ‌రీ చిప్ మామూలు కాదుగా!
X
65 ఏళ్ల వ్య‌క్తి. అందునా రాష్ట్ర ముఖ్య‌మంత్రి. దాదాపు యాభై ఏళ్ల క్రితం వ‌దిలేసిన ఊరుకు సంబంధించి జ్ఞాప‌కాలు ఎంత ఉంటాయి? ఎంత‌మంది పేర్లు గుర్తుంటాయ్? ఎంత‌మందిని గుర్తు పెట్టుకుంటారు? లాంటి ప్ర‌శ్న‌ల‌కు త‌న‌దైన శైలిలో స‌మాధానం ఇచ్చారు. సుదీర్ఘ‌ రాజ‌కీయ అనుభ‌వం.. నిత్యం వంద‌లాదిమందిని క‌లుసుకునే కేసీఆర్ లాంటి అధినేత‌.. అప్పుడెప్పుడో ఐదు ద‌శాబ్దాల కంటే ముందే తాను వ‌దిలి వ‌చ్చేసిన ఊరిని.. ఆ ఊరు జ్ఞాప‌కాల్ని ఎంత‌లా త‌న‌తోనే క్యారీ చేస్తున్నార‌న్న విష‌యాన్ని చూసిన‌ప్పుడు ఆశ్చ‌ర్యంతో అవాక్కు అవ్వాల్సిందే.

కేసీఆర్ ఎంత బిజీ అన్న విష‌యాన్ని చెప్పాలంటే.. సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఐదేళ్ల‌కు.. అది కూడా రెండోసారి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఆరేడు నెల‌ల త‌ర్వాత తొలిసారి త‌న సొంతూరు చింత‌మ‌డ‌క వెళ్లారు.ఈ సంద‌ర్భంగా త‌న ఊరుకు సంబంధించి త‌న జ్ఞాప‌కాలు ఎంత ప‌చ్చిగా ఉన్నాయో త‌న మాట‌ల‌తో చెప్పేసి.. అంద‌రిని అబ్బుర ప‌ర్చ‌ట‌మే కాదు.. కేసీఆర్ మెమ‌రీ చిప్ మామూలు కాదుగా? అన్న భావ‌న క‌లిగేలా చేశారు.

త‌మ‌కు తెలిసిన కేసీఆర్ కు.. సీఎం కేసీఆర్ కు తేడా ఏమిట‌న్న‌ది.. గ్రామానికి ఆయ‌న రాక ముందే అర్థ‌మైంది. పెద్ద పెద్ద కార్లు. భారీ ఎత్తున చేరుకున్న భ‌ద్ర‌తా సిబ్బంది. హ‌డావుడిగా తిరిగే అధికారులు. ఇలాంటి వేళ‌.. త‌మ గ‌డ్డ మీద పుట్టిన బిడ్డ‌ను చూసుకుంటే చాల‌నుకున్న చింత‌మ‌డ‌కవాసుల‌కు.. త‌న‌దైన ట్రీట్ మెంట్ తో వారి మ‌న‌సు దోచుకోవ‌ట‌మే కాదు.. ఎప్ప‌టికి మ‌ర్చిపోలేని మ‌ధురానుభూతుల్ని మిగిల్చారు. హెలికాఫ్ట‌ర్ లో గ్రామానికి చేరుకున్న కేసీఆర్‌. పలువురిని పేర్ల‌తో పిలిచి.. వారికి సంబంధించిన వివ‌రాల్ని అడిగిన వైనం చూస్తే.. ఇంత‌టి మెమ‌రీ కేసీఆర్ కు మాత్ర‌మే సాధ్యమేమో అన్న భావ‌న క‌లుగ‌క మాన‌దు.

గ్రామంలో త‌న‌కున్న ప‌రిచ‌యాలు.. త‌న‌కున్న గుర్తుల‌ను ప్ర‌స్తావించిన వైనం చింత‌మ‌డ‌క వాసుల క‌డుపు నిండేలా చేసింది. ఓ కూస రాజ‌న్న ఎట్లున్న‌వే.. నీ కొడుకు ఏం జేస్తున్న‌డే.. పోశ‌వ్వ‌.. మ‌మ‌చిగున్న‌వా త‌ల్లీ! మ‌న ప‌డిగె ఆనందం.. కిష్ట‌య్య వ‌చ్చిండ్రా.. గా చెప్యాల న‌ర్సింలు ఉన్న‌డా? వాడు.. బాల‌కిష్టుడి ఆరోగ్యం ఎట్లున్న‌ది? మ‌ల్ల‌న్న‌.. నీ భూమిల ఏం పండిస్తున్న‌వే? ఇలా త‌న‌కు తాను కేసీఆర్ స్వ‌యంగా గుర్తు ప‌ట్టి ప‌లుక‌రించినోళ్లు వీరైతే.. మ‌రో ప‌ది మంది వ‌ర‌కూ పేర్ల‌ను త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించ‌టం ద్వారా పుట్టిన ఊరి విష‌యంలో త‌న‌కున్న అనుబంధాన్ని చెప్ప‌క‌నే చెప్పేశారు కేసీఆర్‌.

రాజ‌కీయంగా కేసీఆర్ తీసుకునే నిర్ణ‌యాలు ఎట్లున్నా.. త‌న తీరుతో అంద‌రి మ‌న‌సుల్ని దోచేసే విష‌యంలో మాత్రం కేసీఆర్ ముందుంటార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. చింత‌మ‌డ‌క‌లో కేసీఆర్ తీరు.. ఆయ‌న ప్ర‌స్తావించిన పేర్ల‌ను చూసినోళ్లంతా.. జ్ఞాప‌కాలు అంద‌రికి ఉంటాయి. కానీ.. సీఎం స్థాయిలో ఉండి కూడా గుర్తుంచుకోవ‌టం కేసీఆర్ లాంటోడికి మాత్ర‌మే సాధ్య‌మ‌వుతాయ‌న్న వ్యాఖ్య చేయ‌టం గ‌మ‌నార్హం.