Begin typing your search above and press return to search.

కేసీఆర్ త‌ల‌కున్న మ‌చ్చ ఎట్లా వ‌చ్చింది? ఎప్పుడొచ్చింది?

By:  Tupaki Desk   |   23 July 2019 8:18 AM GMT
కేసీఆర్ త‌ల‌కున్న మ‌చ్చ ఎట్లా వ‌చ్చింది? ఎప్పుడొచ్చింది?
X
కేసీఆర్ నెత్తిన మ‌చ్చ ఒక‌టి ఉంటుంది. ఎప్పుడో త‌గిలిన గాయం తాలుకూ మ‌చ్చ‌. అదెలా వ‌చ్చింది? దానికి కార‌ణం ఎవ‌ర‌న్న విష‌యం ఎప్పుడూ చ‌ర్చ‌కు వ‌చ్చింది లేదు. తాజాగా. ఆ గాయం తాలూకు మ‌చ్చ వెనుకున్న అస‌లు క‌థ‌ను తానే చెప్పుకొచ్చారు కేసీఆర్‌.

ముఖ్య‌మంత్రి హోదాలో తాను పుట్టిన ఊరు చింత‌మ‌డ‌క గ్రామానికి తొలిసారి వెళ్లిన సంద‌ర్భంగా అక్క‌డి వారిలో ప‌లువురిని గుర్తు ప‌ట్టి.. పేర్ల‌తో పిలిచిన ఆయ‌న‌.. గ్రామంతో త‌న‌కున్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు. త‌న త‌ల మీద ఉన్న‌గాయం తాలూకు మ‌చ్చ‌ను చూపిస్తూ.. ఊళ్లో ఉన్న‌ప్పుడు జ‌రిగిన ఉదంతాన్ని గుర్తు చేసుకున్నారు.

ఊరి మొద‌ట్లో ఉన్న చెరువులో తాను ఈత కొడుతుంటే న‌ర్సింలు త‌న మీద‌కు దూకాడ‌ని.. వాడి పండ్లు త‌న త‌ల‌కు తాకి ర‌క్తం వ‌చ్చింద‌న్నారు. త‌ల మీద ఇప్ప‌టికి ఆ గాయం తాలుకూ మ‌చ్చ ఉంద‌న్నారు. అలా త‌న త‌ల మీద గాయం తాలూకు మ‌చ్చ వెనుక అస‌లు విష‌యాన్ని.. దానికి కార‌ణ‌మైన వారి వివ‌రాల్ని వెల్ల‌డించారు.

చింత‌మ‌డ‌క రోడ్ల మీద న‌డిచిన కేసీఆర్‌.. తమ పాత ఇంటిని చూస్తూ కాసేపు నిలుచుండిపోయారు. ఇంటి ద‌గ్గ‌రే ఉన్న ర‌చ్చ‌బండ‌ను చూసి మురిసిపోయిన కేసీఆర్‌.. గ్రామంలో క‌డుతున్న రామాల‌యాన్ని ప‌రిశీలించారు. త‌మ ఇంటి వెనుక వీధిలో ఉన్న రిటైర్డ్ టీచ‌ర్ రాఘ‌వ‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయ‌న స‌తీమ‌ణి మంగ‌మ్మ‌తో మాట్లాడ‌ట‌మే కాదు.. మ‌రో రిటైర్డ్ టీచ‌ర్ ప్ర‌తాప‌రెడ్డి ఇంటికి వెళ్లి మ‌రీ మాట్లాడారు. సీఎం హోదాలో ఉండి కూడా.. త‌న‌కు విద్యాబుద్ధులు నేర్పిన మాష్టార్ల ఇళ్ల‌కే స్వ‌యంగా వెళ్లి.. వారి బాగోగులు అడిగిన తీరుకు అక్క‌డోళ్లంతా భావోద్వేగానికి గురి కావ‌ట‌మే కాదు.. కేసీఆర్ తీరును తెగ మెచ్చేసుకోవ‌టం క‌నిపించింది.