Begin typing your search above and press return to search.

బీజేపీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసిన కేసీఆర్

By:  Tupaki Desk   |   1 July 2022 5:30 AM GMT
బీజేపీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసిన కేసీఆర్
X
తెలంగాణ రాష్ట్రంలో పాగా వేసేందుకు వీలుగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్ని భారీగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటివేళ.. ఊహించని షాక్ ఇవ్వటంలో సక్సెస్ అయ్యింది తెలంగాణ అధికారపక్షం. మిగిలిన రాష్ట్రాల సంగతేమో కానీ.. తనతో పెట్టుకోవటం అంత సామాన్యమైన విషయం కాదన్న సంగతిని తాజా ఎత్తుగడతో గులాబీ బాస్ కేసీఆర్ స్పష్టం చేశారని చెప్పాలి. యావత్ బీజేపీ పెద్దలు హైదరాబాద్ మహానగరానికి వస్తున్న వేళ.. తమ పార్టీకి చెందిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల (జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్.. హస్తినాపురం.. అడిక్ మెట్)ను తమ పార్టీలోకి చేర్చుకోవటం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ షాకిచ్చారని చెప్పాలి.

దీంతో.. తమ పార్టీకి చెందిన వారు కప్పగంతులు వేయరని.. తమ పార్టీని వీడిపోరన్న వాదనలో పస లేదన్న విషయాన్ని బీజేపీ నేతలు ఇకపై చెప్పుకునే అవకాశం లేదు. అదే సమయంలో.. పార్టీ ఏదైనా సరే.. తాము టార్గెట్ చేయాలే కానీ.. వారికి ఎంతలా చుక్కలు చూపిస్తామన్న దానికి నిదర్శనంగా గులాబీ బాస్ చేతల్లో చూపించారని చెప్పాలి. గ్రేటర్ కు చెందిన నలుగురు కార్పొరేటర్లకు గులాబీ కండువా కప్పటం ద్వారా.. మరింకేం జరగనున్నాయన్న ఆందోళనను కమలనాథుల్లో కలిగించటంలో గులాబీ బాస్ సక్సెస్ అయ్యారని చెప్పాలి.

పార్టీలో చేరిక విషయంలో టీఆర్ఎస్ తో పాటు.. బీజేపీ కార్పొరేటర్లు సైతం అత్యంత గోప్యతను ప్రదర్శించారని చెప్పాలి. పార్టీలో చేరటానికి ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాస్తవానికి గురువారం సాయంత్రం తెలంగాణ భవన్ లో కల్వకుర్తికి చెందిన కాంగ్రెస్ నేతలకు గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన కార్యక్రమం జరిగింది. అనంతరం మంత్రి కేటీఆర్ బంజారాహిల్స్ లోని నందినగర్ లోని తన నివాసానికి చేరుకున్నారు.

అప్పటికే అక్కడకు చేరుకున్న బీజేపీ కార్పొరేటర్లు.. వారున్న ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలు సైతం అక్కడ ఉన్నారు. వారి సమక్షంలో పార్టీలో చేరిక కార్యక్రమం గుట్టుగా జరిగిపోయింది. గ్రేటర్ కు చెందిన నలుగురు బీజేపీ కార్పొరేటర్లు పార్టీలో చేరిన విషయాన్ని కేటీఆర్ కు చెందిన మీడియా విభాగానికి చెందిన వారు సమాచారం అందిస్తూ.. దానికి సంబంధించిన ఫోటోల్ని విడుదల చేసే వరకు ఈ విషయం మరెవరికీ తెలీకుండా ఉండటం గమనార్హం. ఇంత గుట్టును ప్రదర్శించటానికి కారణం లేకపోలేదని చెబుతున్నారు.

బీజేపీ కార్పొరేటర్లు గులాబీ కండువా కప్పుకోవటానికి సిద్ధంగా ఉన్నా.. బీజేపీ.. దాని అనుబంధ సంఘాల నుంచి వచ్చే ఒత్తిడి అంతా ఇంతా అన్నట్లు ఉండదని.. అందుకే ఇంత రహస్యంగా కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా చెబుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ లో చేరిన కార్పొరేటర్లకు.. అందుకు తగ్గట్లు ప్రతిఫలాన్ని చూపిస్తామన్న హామీని ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఇప్పుడు జంప్ అయిన బీజేపీ కార్పొరేటర్లు నలుగురు మూడు వారాల క్రితం ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యారు.

సమతామూర్తి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీని జీహెచ్ఎంసీకిచెందిన బీజేపీ కార్పొరేటర్లలో కొందరిని కలవగా.. మరికొందరిని సమయాభావం కారణంగా కలవలేదు. అందుకు ప్రతిగా.. ప్రత్యేకంగా బీజేపీ కార్పొరేటర్లను పిలిపించుకున్న ప్రధాని మోడీ.. వారిని ప్రత్యేకంగా భేటీ అయి.. వారిని ఉద్దేశించి ప్రసంగించారు కూడా. ఇక.. బీజేపీని నుంచి జంప్ అయిన నలుగురు కార్పొరేటర్లు.. ప్రధాని రాక సందర్భంగా చురుగ్గా లేరని.. మిగిలిన వారి మాదిరి పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా గమ్మున ఉన్నారని చెబుతున్నారు.