Begin typing your search above and press return to search.

మీరు చేస్తే ఒప్పు.. మేం చేస్తే తప్పా

By:  Tupaki Desk   |   19 May 2020 12:10 PM GMT
మీరు చేస్తే ఒప్పు.. మేం చేస్తే తప్పా
X
తెలంగాణ సీఎం కేసీఆర్ పై కేంద్ర హోమ్ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి స్థాయికి తగిన భాష ఉపయోగించడం లేదని విమర్శించారు. ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ పేరుతో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప్యాకేజీ విష‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ ప్యాకేజీ రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను అవ‌మానించే విధంగా ఉంద‌ని మండిప‌డ్డారు. మీడియా సమావేశంలో ఒక రాష్ట్రానికి సీఎం అయి ఉండి అలాంటి భాష ఉపయోగిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంస్కరణల్లో భాగంగా ఒకే దేశం-ఒకే గ్రిడ్ విధానం అమలు కావాల్సిందేనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తాత్కాలిక ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ కష్ట సమయంలో ఆలోచన చేయడం సరికాదని కేసీఆర్ కు హితవు పలికారు. దేశ హితం కోసం కేంద్రం తెచ్చిన ఆర్థిక ప్యాకేజీ అన్ని రాష్ట్రాలకు ఉపయోగకరమని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ హయాంలో ఒక్క రూపాయి దుర్వినియోగమైందా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అలాగే ఈ ప్యాకేజీ ద్వారా ఏ రంగానికి అన్యాయం జరుగుతుందో చెప్పాలని సవాల్ చేశారు.

ఈ కష్టసమయంలో అంతా కలిసి కట్టుగా రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ గారు భావించి మాజీ ప్రధానులు, మాజీ రాష్ట్రపతులు, మీడియా సంస్థలు ప్రతినిధులు, ఆర్థికవేత్తలతో.. వివిధ దేశాల ప్రముఖులతో మాట్లాడిన అనంత‌రం ఈ ప్యాకేజీని ప్ర‌క‌టించార‌ని తెలిపారు. నియంతృత్వ పాలన సాగిస్తూ.. తమ పార్టీ తప్ప ఎవరూ ఉండకూడదనే సంకుచిత దోరణిలో కేసీఆర్ ఉన్నారని ధ్వజమెత్తారు.

తెలంగాణలో ప్రభుత్వం చెప్పిన పంటలు వేయకపోతే రైతు బంధు పథకం వర్తించదని కేసీఆర్ చెబుతున్నారు.. ఇలా ఎందుకు చేస్తున్నట్లు? అని తాము ప్రశ్నించలేదు. ఎందుకంటే సంస్కరణలు, గిట్టుబాటు ధరల కోసం అలా చేశారేమో అని. అదే పని కేంద్రం చేస్తే మాత్రం ఎందుకు సరికాదంటున్నారని కేసీఆర్‌ను ప్రశ్నించారు. అసలు ఎందుకీ ఈ రెండు నాలుకల ధోరణి అని ప్ర‌శ్నించారు.