Begin typing your search above and press return to search.

భట్టి ఎంట్రీతో..పోలవరంపై కేసీఆర్ వైఖరి బయటకొచ్చింది!

By:  Tupaki Desk   |   14 Sep 2019 4:14 PM GMT
భట్టి ఎంట్రీతో..పోలవరంపై కేసీఆర్ వైఖరి బయటకొచ్చింది!
X
పోలవరం... ఏపీకి జీవనాడి గానే పరిగణిస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కింది. అయితే తెలంగాణ ప్రజలతో పాటుగా తెలంగాణలోని అధికార పార్టీ టీఆర్ ఎస్ కూడా ఈ ప్రాజెక్టుకు ఆది నుంచి వ్యతిరేకమే. పోలవరాన్ని ఆపేందుకు ఎప్పటికప్పుడు ఒడిశా తనవంతు యత్నాలు చేస్తుంటే... కేసీఆర్ సర్కారు కూడా తన వంతు మంత్రాంగం నెరపుతోంది. అయితే ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్నంతవరకే పోలవరంపై టీఆర్ ఎస్ కు వ్యతిరేకత. మరి ఇప్పుడు తనకు అనుకూలంగా ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకీకి నూతన సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు కదా. మరి ఇప్పుడు కూడా కేసీఆర్ సర్కారు పోలవరానికి వ్యతిరేకమేనా? ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు చాలా తెలివిగా దాటవేస్తూ సాగుతున్న కేసీఆర్ ఎట్టకేలకు నోరిప్పక తప్పలేదు. పోలవరంపై తనకున్న వ్యతిరేకతను ఆయన నోట నుంచే చెప్పించేశారు కాంగ్రెస్ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్క.

ఇదెలా సాధ్యమైందన్న విషయానికి వస్తే... ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం నాటి సమావేశాలను ఓ సారి పరిశీలించాల్సిందే. ఇప్పటికే సీఎంగా ఉండి కూడా రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రతిపాదించిన కేసీఆర్... దానిపై చర్చకు తనదైన శైలిలో స్పందిస్తున్నారు. బడ్జెట్ పై ప్రసంగం సందర్భంగా శనివారం నాటి సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ పక్ష నేత భట్టి విక్రమార్క... సాగు నీటి ప్రాజెక్టులపై కేసీఆర్ సర్కారు అనుసరిస్తున్న వైఖరిపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకున్నా కూడా నిధులు మాత్రం ఖర్చు అయిపోతున్నాయని భట్టి విక్రమార్క... కేసీఆర్ బడ్జెట్ పై నిప్పులు చెరిగారు. భట్టి నోట నుంచి ఈ మాట వచ్చినంతనే తనదైన శైలిలో లేచిన కేసీఆర్... కాంగ్రెస్ పార్టీ ఆరోపణలను తీవ్ర స్వరంతో ఖండించారు.

తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి అయి వేల ఎకరాలకు నీరందుతున్నా, లక్షల ఇళ్లకు తాగు నీరు అందుతున్నా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కళ్లు లేని కబోదుల్లా మాట్లాడుతున్నారంటూ... భట్టిపై కేసీఆర్ విరుచుకుపడ్డారు. భట్టి సొంత జిల్లాలో భ్రహ్మం సాగర్ ప్రాజెక్టు పూర్తి అయిన విషయం ఆయనకు తెలియదా? అంటూ కూడా కేసీఆర్ ఫైరయ్యారు. కళ్లు లేని కబోది అంటూ భట్టిని అబివర్ణించిన కేసీఆర్ అంతటితో ఆగకుండా బుద్దివాడంటూ కేసీఆర్ పరుష పదజాలంతో ఎదురు దాడికి దిగారు. ఈ సందర్భంగానే భట్టి కూడా కేసీఆర్ కు ఎదురొడ్డి నిలిచారు. అన్ పార్లమెంటరీ పదాలను వినియోగిస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని, కేసీఆర్ కు సీఎంగా తాము ఎంత గౌరవమిస్తున్నామో, సభ్యులుగా తమకు కూడా కేసీఆర్ అదే తరహా గౌరవం ఇవ్వాల్సిందేనని భట్టి ప్రతి దాడికి దిగారు.

సందట్లో సడేమియాలాగా... తెలంగాణలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులపై సుదీర్ఘంగా మాట్లాడిన కేసీఆర్... ఏపీలోని పోలవరం ప్రాజెక్టుపైనా తన వైఖరిని చెప్పేశారు. అసెంబ్లీ సాక్షిగానే పోలవరంపై తమ వైఖరి ఇదేనంటూ కేసీఆర్ చేసిన ప్రకటన నిజంగానే సంచలనంగా మారిపోయింది. పోలవరంపై ఆది నుంచి కూడా తమది ఒకే వైఖరి అని, అది ఆ ప్రాజెక్టుకు తామంతా వ్యతిరేకమేనని కూడా కేసీఆర్ చెప్పారు. ఇందుకు గల కారణాలను కూడా చెప్పిన కేసీఆర్... పోలవరం ప్రాజెక్టును గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇందిరా సాగర్ పేరిట నిర్మించే యత్నం చేశాయని, దాని వల్ల తెలంగాణలోని కొంత ప్రాంతం మునిగే ప్రమాదం ఉందని, అందుకే ఆ ప్రాజెక్టును తాము వ్యతిరేకించామని కేసీఆర్ చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఏపీలో జగన్ సర్కారు కొలువుదీరిన తర్వాత కూడా పోలవరంపై ఇదే వైఖరితోనే ముందుకు సాగుతారా? లేదా? అన్న విషయాన్ని మాత్రం కేసీఆర్ ప్రస్తావించలేదు. మొత్తంగా భట్టి సంధించిన విమర్శలతో పోలవరంపై కేసీఆర్ తన వైఖరిని... అది కూడా అసెంబ్లీ సాక్షిగా మరోమారు వెల్లడించారన్న మాట.